.
నిజానికి ఓ వార్త చూసి నవ్వొచ్చింది… మన ప్రభుత్వాల చేతకానితనం, తన నియమాలను తనే అమలు చేయలేని దిక్కుమాలినతనం… అవినీతో- భయమో- అసమర్థతో… సెలబ్రిటీల జోలికి వెళ్లాలంటే వణుకు… విషయం ఏమిటీ అంటారా..? ముందుగా ఈ వార్త చదవండి…
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), బాలీవుడ్ అగ్ర నటులు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ‘విమల్ ఇలాచీ’ ప్రకటనపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన ‘విమల్ పాన్ మసాలా’ బ్రాండ్‌ను ఇలాచీ (యాలకులు) పేరుతో పరోక్షంగా (సర్రోగేట్ అడ్వర్టైజింగ్ / Surrogate Advertising) ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకుంది.
మహారాష్ట్రలో గుట్కా, పొగాకు, నికోటిన్ కలిగిన పాన్ మసాలా విక్రయాలు, తయారీపై పూర్తి నిషేధం ఉంది. ఇలాచీ పేరుతో చేస్తున్న ఈ ప్రకటనల రూపం, డైలాగులు, బ్రాండ్ పేరు నేరుగా నిషేధిత పాన్ మసాలాను గుర్తుచేస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Ads
FDA నటులను ఆదేశించిన అంశాలు… ప్రకటనలో నటించడానికి గల కారణాలు, వారి పాత్రపై 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి. ఈ యాడ్‌కు సంబంధించిన ప్రచారంలో పాల్గొనడం వెంటనే ఆపివేయాలి. వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్ల నుండి ఈ ప్రకటనల కంటెంట్‌ను వెంటనే తొలగించాలి. సదరు కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్లు, బ్రాండ్ వివరాలు, మరియు వారికి అందిన చెల్లింపుల (పేమెంట్స్) పత్రాలను సమర్పించాలి.
గతంలో ఈ ప్రకటనపై వచ్చిన విమర్శల కారణంగా నటుడు అక్షయ్ కుమార్ ఈ బ్రాండ్ ఒప్పందం నుండి తప్పుకోగా, ఆయన స్థానంలో ష్రాఫ్ ఈ యాడ్‌లోకి వచ్చారు. తప్పుడు ప్రకటనల నిబంధనల కింద ఈ నటులకు రూ. 10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
గతంలో అమితాబ్ బచ్చన్ కూడా లెంపలేసుకుని, తీసుకున్న సొమ్ము వాపస్ ఇచ్చి మరీ ఈ ఒప్పందాల నుంచి వైదొలిగాడు… మన మహేశ్ బాబు ప్రస్తుతం ఇలాంటి సరోగేట్ యాడ్స్ చేయడం లేదేమో గానీ తను కూడా గతంలో పాన్ బహర్ గుట్కాకు సరోగేట్ యాడ్స్ చేసినవాడే… ‘ముచ్చట’ కూడా ఇదే రాసింది గతంలో… ఈ యాడ్స్ శిక్షార్హమే కాదు అనైతికం కూడా…
ఇదే అడిగితే ఈ షారూక్, ఈ అజయ్, ఈ ష్రాఫ్ ఏమని సమర్థించుకున్నారో తెలుసా..? అవి ప్రమాదకరం అయితే వాటినే నిషేధించండి, కూల్ డ్రింక్స్, గుట్కా, ఆల్కహాల్ మరెందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు… డబ్బు కోసం దేనికైనా తెగిస్తారు కదా మన స్టార్లు…
మరి నవ్వు ఎందుకు వచ్చింది అంటారా..? ఐపీఎల్ సీజన్లో ప్రతి ఓవర్‌కూ ఈ యాడ్స్ వచ్చాయి… కొన్ని వేల నిమిషాలపాటు… అప్పుడెందుకు ఈ FDA సైలెంటుగా ఉండిపోయింది, ఇప్పుడెందుకు హఠాత్తుగా ఈ నేరం గుర్తొచ్చింది… ఇంకా పెద్ద జోక్ ఏమిటో తెలుసా..?
మూడేళ్ల క్రితం కేంద్రం కూడా ఇదే షారూక్, ఇదే అజయ్, అక్షయ్‌లకు నోటీసులు జారీ చేసింది… ఏమైంది..? ఏమీ కాలేదు… మరిప్పుడు ఏమవుతుంది..? ఏమీ కాదు, జనం బూతులు తిడితే తప్ప అక్షయ్, అమితాబ్ వంటి స్టార్లకు సోయి- బుద్ధి రాలేదు, షారూక్- అజయ్‌లకు అదీ లేదు… మిస్ లీడింగ్ సరోగేట్ యాడ్స్ మీద ఎప్పటి నుంచో చర్చ నడుస్తూనేే ఉంది… కానీ కేంద్రానికి, రాష్ట్రాలకు చేతకావడం లేదు !!
2023 లో ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన కథనం ఓసారి చదవండి… ఇదీ లింకు…
తెలుగులో మహేష్ బాబు ఇంకా చేస్తున్నాడా? లేదు, మహేష్ బాబు ప్రస్తుతం ఈ యాడ్స్ చేయడం లేదు. తను గతంలో బాలీవుడ్ నటుడు ఇదే టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘పాన్ బహార్ ఇలాచీ’ ప్రకటనలో నటించాడు…
అదే సమయంలో “బాలీవుడ్ నన్ను భరించలేదు (Bollywood can’t afford me)” అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఒకవైపు బాలీవుడ్ కు అంత సీన్ లేదంటూనే, మరోవైపు ఇలాంటి ఇలాచీ/ పాన్ మసాలా బ్రాండ్ ప్రకటనల్లో నటించడం ఏంటని నెటిజన్లు తనను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వివాదం తీవ్రం కావడంతో మహేష్ బాబు ఆ బ్రాండ్ కాంట్రాక్ట్ నుండి తప్పుకున్నాడు…
Share this Article