.
వెస్టిండీస్‌కు క్రికెట్‌లో చోటు లేదా..? అనామక బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కే పోటీ! ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ అంటే వెస్టిండీస్.. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఆ జట్టు పేరు వినిపిస్తే ప్రత్యర్థుల వెన్నులో వణుకు. గ్యారీ సోబర్స్ నుంచి వివియన్ రిచర్డ్స్ వరకు.. గ్రీనిడ్జ్, హేన్స్ నుంచి లారా వరకు.. మార్షల్, గార్నర్, హోల్డింగ్, అంబ్రోస్ వరకు.. క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించిన జట్టు అది. కానీ ఇప్పుడు అదే వెస్టిండీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో కనీసం పోటీ ఇవ్వలేని స్థితికి చేరింది. కాదు, అర్హతే సాధించలేదు పోటీకి…
మరోవైపు.. ఒకప్పుడు టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఎవరూ పట్టించుకోని అనామక జట్టు బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా టాప్-4లోకి దూసుకొచ్చి, భారత్ వంటి జట్ల ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపించే స్థాయికి చేరుకుంది. కాలం మారితే క్రికెట్ శక్తి సమీకరణాలు కూడా ఎలా మారిపోతాయో చెప్పడానికి ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికే పెద్ద ఉదాహరణ.
Ads
వెస్టిండీస్.. పేరే మిగిలింది! వెస్టిండీస్ క్రికెట్ పతనం కొత్త విషయం కాదు. కానీ ఈ స్థాయికి పడిపోవడం మాత్రం ఆ జట్టు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయం. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన కరీబియన్ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 20.83 శాతం పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచినా పరిస్థితి మారదు.
అంటే ఒకప్పుడు టెస్టు క్రికెట్‌ను శాసించిన జట్టు.. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో తన ఉనికినే నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది. ఇది కేవలం ఓ టోర్నమెంట్‌లో వైఫల్యం కాదు. వెస్టిండీస్ క్రికెట్ వ్యవస్థ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సంక్షోభానికి ఇది ప్రతిబింబం.
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫాస్ట్‌బౌలింగ్ దళాన్ని తయారు చేసిన కరీబియన్ దీవులు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి టెస్టు జట్టును నిలబెట్టుకోవడానికే ఇబ్బంది పడుతున్నాయి.
బంగ్లాదేశ్.. అనామకుడి నుంచి అడ్డంకిగా! ఇదే సమయంలో మరో కథ జరుగుతోంది. బంగ్లాదేశ్. టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో పెద్ద జట్లకు ప్రత్యర్థిగా కాకుండా, పాయింట్లు సాధించడానికి అనుకూలమైన జట్టుగా చూసిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే పెద్ద జట్లకు లెక్కల్లో తలనొప్పిగా మారింది.
డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయం ఆ జట్టును ఏకంగా 66.67 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి తీసుకొచ్చింది. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా 77.78 శాతంతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో ఉంది. వాటి తర్వాత బంగ్లాదేశ్! అంటే భారత్ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే దిగువనే ఉంది.
టీమిండియా 53.33 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మొత్తం 18 టెస్టుల్లో ఇప్పటికే పది ఆడిన భారత్‌కు ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫైనల్‌కు చేరాలంటే ఇకపై ప్రతి సిరీస్ కీలకమే. ఒకప్పుడు భారత్– బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ అంటే భారత్ ఎంత తేడాతో గెలుస్తుందన్నదే ప్రశ్న. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో భారత్ పైన కూర్చొని ఫైనల్ రేసులో భాగస్వామిగా మారింది.
ఇదే డబ్ల్యూటీసీ తెచ్చిన అసలైన పోటీ. భారత్‌కు ఇప్పుడు ప్రతి టెస్టూ లెక్కే! భారత్ పరిస్థితి పూర్తిగా చేజారిపోయినట్లు కాదు. కానీ ఇక తప్పిదాలకు చోటు లేదు. ఐదు విజయాలతో 53.33 శాతం పాయింట్ల వద్ద ఉన్న టీమిండియా మిగిలిన ఎనిమిది టెస్టుల్లో భారీగా పాయింట్లు కొల్లగొట్టాలి. ఒక సిరీస్‌లో వరుస పరాజయాలు ఎదురైతే ఫైనల్ రేసు ఒక్కసారిగా సంక్లిష్టమవుతుంది.
ఇక్కడే బంగ్లాదేశ్ వంటి జట్ల ఎదుగుదల ప్రభావం కనిపిస్తుంది. టాప్-2లోకి వెళ్లాల్సిన పోటీ కేవలం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మాత్రమే లేదు. బంగ్లాదేశ్ కూడా ఆ లెక్కల్లోకి వచ్చింది. ఇది బంగ్లాదేశ్ సాధించిన పురోగతికి నిదర్శనం అయితే.. భారత్ సహా పెద్ద జట్లకు ఇది ఒక హెచ్చరిక కూడా.
ఫైనల్ కోసం అసలు పోరు ఇప్పుడే మొదలు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ప్రస్తుతం అత్యంత బలమైన స్థితిలో ఉన్నాయి. బంగ్లాదేశ్ అనూహ్యంగా నాలుగో స్థానంలోకి రావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. భారత్ మాత్రం ఐదో స్థానంలో నుంచి పైకి ఎగబాకాల్సి ఉంది. ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలకు పరిస్థితులు దాదాపు క్లిష్టంగా మారిపోయాయి. వెస్టిండీస్ అయితే ఇప్పటికే రేసు నుంచి బయటకు వెళ్లిపోయింది…
Share this Article