.
ఓయ్, ఎద్దుబండి సోములూ… షావుకారు జానకి ఉత్తరాంధ్ర మాండలికంలో తన సొంత గొంతు, తన సొంత డబ్బింగుతో నూతన్ ప్రసాద్‌ను చిలకమ్మ అనే పేరున్న ఓ పనిమనిషిగా ఉంటూ… నువ్వు వల్లకుండు అంటూ దబాయించే సీన్ బహుశా ఎవరూ మరిచిపోరు… షావుకారు జానకి అనగానే ఓ తరానికి గుర్తొచ్చేది ఆ డైలాగే…
ఆమె ధాటిగా ఆ డైలాగులు చెబుతుంటే గొల్లపూడి, నూతన్ ప్రసాద్ అలా ఆశ్చర్యంతో చూస్తుండిపోతారు… వాట్ ఏ యాక్టింగ్..? అప్పుడెప్పుడో 1950లో షావుకారు సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈ అచ్చ తెలుగు మహిళామణి పద్మశ్రీ శంకరమంచి జానకి నేడు కన్నుమూసింది… కొన్నాళ్లుగా వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె 94 ఏళ్లు బతికింది…
Ads
కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబం… తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులు… షావుకారు సినిమాతో మొదలైన ఆమె కెరీర్‌లో ఎన్టీయార్, ఏఎన్నార్, రాజకుమార్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి తమిళ, తెలుగు అతిరథ మహారథులందరితోనూ నటించింది… దాదాపు 385 సినిమాలు… ఈ సత్యసాయిబాబా భక్తురాలికి సౌత్ సినిమాలో ఓ అధ్యాయం ఉంది…
కన్నడ, తమిళ ప్రభుత్వాలు తనను సరిగ్గా గుర్తించి, పలు అవార్డులు, పురస్కారాలతో గౌరవించాయి గానీ, ఈ తెలుగు నటికి తెలుగు ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లభించలేదనేది నిజం… అయిదు దశాబ్దాల సినిమా కెరీర్ ఆమెది… అంటే, చిన్న విషయం ఏమీ కాదు…
ఈమె మనమరాలు వైష్ణవి కూడా పలు సినిమాల్లో ప్రధాన నాయికగా, సహాయ పాత్రల్లోనూ నటించింది… షావుకారు జానకి జీవిత విశేషాలు మరికొన్ని, చాలామంది తెలియనివి… ఇలా…

– చాలామందికి ఆమె నటిగానే తెలుసు, కానీ కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమె మద్రాస్ ఆకాశవాణి (All India Radio)లో రేడియో ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది
– చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె గౌహతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ప్రతిభకు గుర్తింపుగా ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకుంది…
– ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. అయితే 1950లో దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన ‘షావుకారు’ సినిమాతో ఆమె కథానాయికగా పరిచయమైంది. ఆ సమయంలో అప్పటికే తమిళంలో ప్రసిద్ధ నటి, ఎం.జి. రామచంద్రన్ (MGR) భార్య అయిన వి.ఎన్. జానకి ఉంది కదా. ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం, ఆమె మొదటి సినిమా పేరైన ‘షావుకారు’ను జానకి పేరు ముందుకు చేర్చి ‘షావుకారు జానకి’గా మార్చారు.
– అప్పట్లో హీరోయిన్లు పెళ్లి కాకుండానే సినిమాల్లోకి వచ్చేవారు. కానీ జానకికి 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెళ్లయి, ఒక బాబు పుట్టిన తర్వాతే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది.
– ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్తూ… “నా భర్త వల్ల ఆస్తులన్నీ పోయాయి. ఒకానొక దశలో రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి కడుపు కాల్చుకుని షూటింగ్‌లలో పాల్గొన్నాను” అని ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత మనస్పర్థల వల్ల ఆమె భర్త నుండి విడిపోయి, ఒంటరిగానే తన ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది…
– తొలి పాన్- ఇండియా హీరోయిన్లలో ఒకరు! 1959లో కన్నడలో వచ్చిన “మహిషాసుర మర్దిని” అనే సినిమా అప్పట్లోనే 7 భాషల్లో విడుదలైంది. లెజెండరీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ సరసన నటించిన ఈ సినిమా ద్వారా, సౌత్ ఇండియాలోనే మొదటి పాన్-ఇండియా హీరోయిన్లలో ఒకరిగా షావుకారు జానకి గారు రికార్డు సృష్టించింది…
– మరో అగ్రనటి కృష్ణకుమారి మరెవరో కాదు, షావుకారు జానకి సొంత చెల్లెలు. అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే కాలంలో స్టార్ హీరోయిన్లుగా రాణించడం విశేషం…
Share this Article