.
ఒక ప్రిన్సిపాల్‌ను 27 సార్లు కత్తితో పొడిచి చంపిన శిష్యుల కథ ఓ కలవర దృశ్యాన్ని చూపిస్తోంది… వర్తమానమే కాదు, మరింత ప్రమాదకరమైన భవిష్యత్తును కళ్లకుకడుతోంది… ఐతే ఈ సంక్లిష్టమైన సామాజిక సమస్య మొత్తాన్ని “పిల్లల మెదడు, పేరెంటింగ్, కండక్ట్ డిజార్డర్” అనే క్లినికల్ ఫ్రేమ్‌లో మాత్రమే చూడగలమా..?
లేదు, మనకు కావాల్సింది ఇంకాస్త సరళమైన, పెద్ద చిత్రాన్ని చూపించే కథనం… నిజానికి ఇది తక్షణం మేధోసమాజం డిబేట్ పెట్టాల్సింది… ఎందుకంటే, ఆ ప్రిన్సిపల్‌ను చంపింది కత్తి కాదు… ఇంకా ముదరబోతున్న ఓ సామాజిక వ్యాధి లక్షణం… ఓ సంకేతం… తస్మాత్ జాగ్రత్త అని చేస్తున్న హెచ్చరిక కాబట్టి…
Ads
కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య మనసును కలచివేసే ఘటన… ముగ్గురు మైనర్లు… ఐదు రోజుల రెక్కీ… డబ్బు కోసం పథకం… చివరికి 27 కత్తిపోట్లు. ఈ ఘటనను చూస్తే ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇంత చిన్న వయసులో ఒక మనిషిని చంపే ఆలోచన ఎలా వస్తుంది?
ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్ల స్నేహితులు ఎవరు? ఇంట్లో వాళ్లతో ఎలాంటి సంబంధం ఉంది? స్కూల్లో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది? డబ్బు పట్ల వాళ్ల ఆలోచన ఏమిటి? సోషల్ మీడియాలో, సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో ఏం చూస్తున్నారు? హింసను, నేరాన్ని, బ్లూ కంటెంటును ఎంత సులభంగా చూస్తున్నారు? సమాజంలో మంచి-చెడుల మధ్య గీత ఎంత స్పష్టంగా ఉంది?
ఇవన్నీ కలిసి ఒక పిల్లవాడి ఆలోచనా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. పిల్లలు నేరస్తులుగా మారడానికి సినిమాలే కారణం కాదు. సోషల్ మీడియానే కారణం కాదు. తల్లిదండ్రుల పెంపకమే కారణం కాదు.
అదే సినిమాలు చూసే, అదే సోషల్ మీడియా ఉపయోగించే, అదే సమాజంలో పెరిగే లక్షలాది మంది పిల్లలు చాలా మంచిగా, బాధ్యతగా, పద్ధతిగా పెరుగుతున్నారు. కాబట్టి ఏ ఒక్క అంశాన్ని నిందించి చేతులు దులుపుకోవడం సులభమైన పని. అసలు సమస్యను అర్థం చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు.
నేటి పిల్లల ముందు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఒకప్పుడు ఒక పిల్లవాడు తన ఇంట్లో, స్కూల్లో, తన చుట్టుపక్కల చూసిన ప్రపంచమే అతని ప్రపంచం. ఇప్పుడు అతని చేతిలో ఉన్న ఫోన్‌లో ప్రపంచం మొత్తం ఉంది. మంచి కూడా ఉంది. చెడు కూడా ఉంది. జ్ఞానం ఉంది. అసభ్యత కూడా ఉంది. స్ఫూర్తినిచ్చే కథలు ఉన్నాయి. నేరాన్ని స్టైల్‌గా చూపించే కంటెంట్ కూడా ఉంది.
విజయానికి కష్టపడే మార్గం ఉంది. ఒక్క రాత్రిలో డబ్బు సంపాదించాలనే మాయ కూడా ఉంది. ఇవన్నీ చూస్తున్న పిల్లవాడికి ఏది నిజం, ఏది వినోదం, ఏది అనుకరించకూడదు అనే విచక్షణను నేర్పాల్సిన బాధ్యత మాత్రం మనదే. అక్కడ జరుగుతోంది తప్పు…
అందుకే పిల్లల చేతిలో ఫోన్ ఉందా లేదా అన్నదానికంటే, వాళ్ల తలలో ఏం జరుగుతోందో మనం తెలుసుకుంటున్నామా? అన్నది ముఖ్యం.
పిల్లవాడు డబ్బు కోసం పదే పదే అబద్ధాలు చెబుతున్నాడా? ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయా? చిన్న విషయానికే విపరీతమైన కోపం వస్తుందా? ఇతరుల బాధను చూసి ఆనందిస్తున్నాడా? హింస గురించి పదే పదే మాట్లాడుతున్నాడా? ఎవరినైనా చంపేస్తా, చూస్తా అంటూ ప్రతీకార భాష మాట్లాడుతున్నాడా?
ఇలాంటి విషయాలను “పిల్లాడి వయసే కదా… పోనీలే” అని వదిలేయకూడదు. అదే సమయంలో ప్రతి తప్పుకూ కొట్టి, తిట్టి, అవమానించి సరిచేయాలని ప్రయత్నించడం కూడా తప్పే. పిల్లలకు కావాల్సింది భయం కాదు. హద్దులు కావాలి. బాధ్యత కావాలి. ప్రేమ కావాలి. తప్పు చేస్తే పరిణామం ఉంటుందని తెలిసేలా చేయాలి. ఐతే అదంత సులభం కూడా కాదు.
స్కూల్ కూడా మార్కులు, ర్యాంకులు, రిజల్టుల దగ్గరే ఆగిపోకూడదు. పిల్లవాడి ప్రవర్తనలో ప్రమాదకరమైన మార్పు కనిపిస్తే తల్లిదండ్రులతో మాట్లాడాలి. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి. మనం నైతిక వర్తనను బోధిస్తున్నామా అసలు? మన కరిక్యులమ్‌లో ఆ అంశాలున్నాయా అసలు?
సమాజం కూడా తన బాధ్యతను గుర్తించాలి. నేరాన్ని వినోదంగా మార్చే కంటెంట్‌ను పిల్లలు ఎంత సులభంగా చూస్తున్నారు? బ్లూ, హింస, క్రైమ్ కంటెంట్ వారి వయసుకు ముందే అందుబాటులోకి వస్తున్నాయా? డబ్బు, విలాసం, వెంటనే కావాలి అనే సంస్కృతి పిల్లలపై ఎంత ప్రభావం చూపుతోంది? ఇవన్నీ కూడా మనం చర్చించాలి. కానీ చివరికి ఒక విషయాన్ని మరచిపోవద్దు.
అదే కాలంలో, అదే ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు అద్భుతంగా కూడా పెరుగుతున్నారు. అందుకే ఈ ఘటన తర్వాత పిల్లల్ని అనుమానించడం కాదు… వాళ్లతో మాట్లాడటం నేర్చుకోవాలి. వాళ్ల ఫోన్ చెక్ చేయడం మాత్రమే కాదు… వాళ్ల మనసు చదవాలి. మార్కులు అడగడం మాత్రమే కాదు… వాళ్ల ఆలోచనలు అడగాలి.
“ఏం చదివావు?” అని అడిగే తల్లిదండ్రుల కంటే, “ఏం ఆలోచిస్తున్నావు?” అని అడిగే తల్లిదండ్రులు కావాలి. రూపారెడ్డి ప్రాణం తిరిగి రాదు. చట్టం తన పని చేస్తుంది. కానీ ఈ హత్య మనకు ఒక కఠినమైన పాఠం చెప్పింది. నేరం కత్తి చేతిలోకి వచ్చినప్పుడు మొదలవదు. అది చాలా ముందే… ఒక ఆలోచనలో మొదలవుతుంది.
చాలా స్కూళ్లలో ఒక పిల్లాడిని ఒక మాట అనగలిగే పరిస్థితి లేదిప్పుడు, లోకల్ జనం, పేరెంట్స్ సదరు టీచర్ మీద పడిపోతారు… పిల్లాడికి అసలు నైతిక వర్తన మీద భయం లేదు, బాధ్యత లేదు, తప్పు చేసినా వెనకేసుకొచ్చే ‘బలగం’ ఉందనే ధీమా మరిన్ని తప్పులు చేయిస్తుంది… అదీ ప్రధాన కారణం…
రీసెంటుగా ఓ మిత్రుడి సతీమణి వీఆర్ఎస్ తీసుకుంది… ప్రభుత్వం సమకూర్చిన అనేక సౌకర్యాల నడుమ నిజానికి పిల్లలు అద్భుతంగా చదవాలి, ఎదగాలి, కానీ ఆ పరిస్థితి లేదు… సమస్యలు, సర్కారు నుంచి, సమాజం నుంచి, పిల్లల నుంచి… ఒత్తిడి, భయం, ఏదో చిక్కుముడి మీద పడకముందే, వేధించకముందే… ఆ కొలువునే వదిలేసింది… ‘మన సర్కారీ స్కూళ్లు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా చదువు చెప్పే పరిస్థితి లేదు’… ఇదీ ఆమె ముక్తాయింపు…
సో, అనేక కారణాలు… పిల్లలందరూ ఒకేరకంగా ప్రవర్తిస్తారని తేల్చేయలేం… కానీ ఒకేరకం వైపు మనమే తోస్తున్నాం పిల్లల్ని… అరయగ కర్ణుడీల్గె అనేకుల చేతన్ అన్నట్టుగా… అవును, అసలైన డిబేట్ ఈ కోణంలోనే జరగాలి… ఇది ఒక పిల్లాడి మెంటల్ డిజార్డర్ కాదు, పక్కాగా ఓ సోషల్ డిజార్డర్..!!
“ఇది కేవలం చైల్డ్ బిహేవియర్ సమస్య కాదు... మన సోషల్ డిజార్డర్‌కు కనిపిస్తున్న ఓ భయంకరమైన సిగ్నల్”
Share this Article