.
Subramanyam Dogiparthi … కుర్ర గ్లామర్ హీరోయిన్ ఉన్నా , కుర్ర హీరో ఉన్నా ఈ సినిమాలో జయసుధే షీరో . టైటిల్ కూడా సినిమాలో ఆమె పాత్ర పేరు మీదే . ఇనస్పెక్టర్ ఝాన్సీ . 1993 జూన్లో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది . యవ్వనంలో నుంచి ప్రౌఢలోకి పయనిస్తున్న రోజుల్లో జయసుధ నటించిన ఇనస్పెక్టర్ పాత్ర .
తిరుపతిలో షూట్ చేయబడిన ఈ సినిమా కధ టూకీగా ఏంటంటే : అన్ని ఊళ్ళల్లో ఉన్నట్లే ఓ రాజకీయ నాయకుడు . మున్సిపల్ చైర్మన్ కూడా . అతనికో గేంగ్ . వాళ్ళు డూప్లికేట్ లాటరీ టిక్కెట్లు అమ్ముతుంటారు . సారా అమ్ముతుంటారు . ఆంబోతుల్లాగా ఆడవారిని మానభంగాలు చేస్తుంటారు .
Ads
ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది ఇనస్పెక్టర్ ఝాన్సీ . ఝాన్సీ అంటే ఝాన్సీయేగా . క్రిమినల్సుని చీల్చి చెండాడుతుంది . విలన్ మున్సిపల్ చైర్మనుతో ఘర్షణ ప్రారంభం అవుతుంది . ఆమె మేనల్లుడు హరీష్ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు . కాలేజీలో విలన్ మేనకోడలితో ప్రేమలో పడతాడు .
ఘర్షణ ఇంకా పెరుగుతుంది . ఈ ఇనస్పెక్టర్ ఝాన్సీకి ఓ ఫ్లాష్ బేక్ ఉంటుంది . ఆమె మాజీ భర్త గిరిబాబు . ఆ గిరిబాబు రెండో భార్య కూతురే హీరోయిన్ సౌందర్య . క్లైమాక్సులో ఝాన్సీ అన్న , కాలేజీ లెక్చరర్ , ఝాన్సీ కలసి విలన్ల ఆట కట్టించి హీరోహీరోయిన్ల పెళ్లి జరిపించి , మాజీ భార్యాభర్తలు గిరిబాబు , జయసుధలను కలపటంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఈ సినిమాకు కధను , స్క్రీన్ ప్లేని పరుచూరి బ్రదర్సే అందించారు . ఇలాంటి పొలిటికల్ టచ్ ఉండి ఏక్షన్ సినిమా కధల్ని వ్రాయటంలో సిధ్ధహస్తులు కదా ! బాగా అమర్చారు . డైలాగులను కూడా వ్రాసారు . అంతేనా ! అన్నాదమ్ములుగా నటించారు . వెంకటేశ్వరరావు లాయరుగా , గోపాలకృష్ణ లెక్చరరుగా నటించారు .
గోపాలకృష్ణ దిమాగీ నక్సల్ కూడా . ఊళ్ళో విలన్ల భరతం పట్టుతూ ఉంటాడు . అరాచకాలను తన విద్యార్థుల సహాయంతో ప్రతిఘటిస్తూ ఉంటాడు . చాలా ఎనర్జిటిక్ గా నటించాడు .
జయసుధ . ప్రౌఢ పాత్ర . సిన్సియర్ పోలీస్ . మంత్రిని కూడా బ్రోతల్ ఏక్ట్ కింద అరెస్ట్ చేసి నడిరోడ్డు మీద పెరేడ్ చేయించి రాజీనామా చేయించే పాత్ర . బాగా నటించింది .
గ్లామర్ హీరోయిన్ గా సౌందర్య తన వంతు పాత్రను బాగా పోషించింది . మిల్క్ బాయ్ హరీష్ , తాతినేని రాజేశ్వరి , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ , రజిత , చలపతిరావు , కోవై సరళ , తనికెళ్ల భరణి , నర్రా ప్రభృతులు నటించారు .
ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది విలన్ కాస్ట్యూమ్స్ కృష్ణని . మనకు రాజనాల దగ్గర నుండి నూతన్ ప్రసాద్ దాకా చాలామంది విలన్లు ఉన్నారు . ఒక ప్రత్యేక బాణీతో నటించేవాడు కాస్ట్యూమ్స్ కృష్ణ . ఈ సినిమాలో కూడా విభిన్నంగా , చాలా బాగా నటించాడు .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర వ్రాసిన పాటల్ని దర్శకుడు కె సదాశివరావు చక్కగా చిత్రీకరించారు . ఉన్న అయిదు పాటలూ హీరోహీరోయిన్ల మీదే . హే పాపా హే పాపా హే పాపా , ఓ సఖియా నా చెలియా , ఓ ప్రియతమా , గిల్లు గిల్లు చెంప గిల్లు అంటూ సాగుతాయి .
గిల్లు గిల్లు చెమ్మగిల్లు పాటలో సౌందర్యను ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం, మనకు తెలిసిన సౌందర్యం ఈమే కదా మొదట్లో తను సైతం అన్నట్టుగా…
సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . సౌందర్య , జయసుధ అభిమానులు మరలా చూడొచ్చు . It’s an action movie with political overtones .
Share this Article