Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?

August 23, 2026 by M S R

.

ఒక మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి టీవీ న్యూస్ చూస్తూ ఆందోళన చెందుతున్నానూ అంటే… అది చిన్న విషయం కాదు. అందులోనూ ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఏదో ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడే వ్యక్తి అంతకంటే కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన జస్టిస్ కేఎం జోసెఫ్.

ఆగస్టు 19న కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన భారత మీడియా పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు రావాల్సినంత ముఖ్యమైనవి. ఆయన ఆందోళన ఒక్కటే.

Ads

మన దేశంలో మీడియా నిజాన్ని ప్రజలకు చెబుతోందా? లేక మీడియాను నడిపిస్తున్న యాజమాన్యాల ప్రయోజనాలకు అనుగుణంగా నిజాన్ని వడపోస్తోందా? జస్టిస్ జోసెఫ్ మాటల్లో చెప్పాలంటే… దేశంలోని చాలా జాతీయ మీడియా సంస్థలకు, పెద్ద వ్యాపార సంస్థలకు మధ్య బలమైన సంబంధం ఏర్పడింది. దాని ప్రభావం వార్తలపై పడుతోంది. ఫలితంగా ప్రజల్లో జరగాల్సిన ఆరోగ్యకరమైన చర్చే దెబ్బతింటోంది.

ఇంకా ముఖ్యమైన విషయం ఆయన చెప్పింది. టీవీ చర్చల్లో యాంకర్లు ఒక విషయాన్ని తమకు కావాల్సిన విధంగా మలుస్తున్నారు. ఎవరు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ మాటను మధ్యలో ఆపాలి, ఏ మాటను పదేపదే చూపించాలి… ఇవన్నీ కలిసొచ్చేసరికి చివరకు ప్రేక్షకుడికే అసలు నిజం ఏమిటో అర్థం కాని పరిస్థితి వస్తోంది.

ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి ముందు పౌరుడికి కావాల్సింది సమాచారం. ఆ సమాచారం నిజమైనదై ఉండాలి. అన్ని వైపుల వాదనలు వినిపించాలి. ఆ తర్వాత నిర్ణయం ప్రజలదై ఉండాలి.

కానీ వార్తే ఒకరి చేతిలో, చర్చ మరోరి చేతిలో, యాజమాన్యం ఇంకొకరి చేతిలో ఉంటే… ప్రజలు నిజాన్ని ఎలా తెలుసుకోవాలి?

మీడియా ఎవరి చేతిలో ఉంది? ఇక్కడే జస్టిస్ జోసెఫ్ ఆందోళనకు అసలు కారణం కనిపిస్తుంది. గత పదేళ్లలో భారత మీడియా రంగంలో పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు వేర్వేరు యాజమాన్యాలు, వేర్వేరు భావజాలాలు, వేర్వేరు సంస్థలు ఉండేవి. ఇప్పుడు దేశంలోని అనేక పెద్ద మీడియా సంస్థలు భారీ కార్పొరేట్ గ్రూపుల చేతుల్లోకి వెళ్లాయి.

ఉదాహరణకు నెట్‌వర్క్18… 2014లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంస్థపై నియంత్రణ సాధించింది. నెట్‌వర్క్18 పరిధిలో CNN-News18, News18 India, CNBC-TV18, Firstpost, Moneycontrolతో పాటు అనేక ప్రాంతీయ వార్తా ఛానళ్లు ఉన్నాయి.

అంటే ఒక పెద్ద వ్యాపార సంస్థకు చెందిన గ్రూప్ ద్వారా దేశంలోని కోట్లాది మందికి వార్తలు చేరుతున్నాయి. అదే విధంగా 2022లో గౌతమ్ అదానీ గ్రూప్ ఎన్‌డీటీవీలో మెజారిటీ నియంత్రణ సాధించింది.

ఎన్‌డీటీవీని ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ దశాబ్దాల క్రితం ప్రారంభించారు. ఒకప్పుడు స్వతంత్ర జర్నలిజానికి ప్రతీకగా భావించిన ఆ సంస్థ కూడా చివరకు ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది.

ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇండియా టుడే, టైమ్స్ గ్రూప్, జీ, హెచ్‌టీ మీడియా వంటి అనేక పెద్ద మీడియా సంస్థల వెనుక కూడా బలమైన వ్యాపార ప్రయోజనాలున్న యాజమాన్యాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న వస్తుంది. వ్యాపార సంస్థ మీడియాను నడపడం తప్పా? అసలు తప్పు కాదు. కానీ ఆ వ్యాపార సంస్థకు ప్రభుత్వంతో పెద్ద వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు, ప్రభుత్వ నిర్ణయాలు ఆ సంస్థ వ్యాపార ప్రయోజనాలపై ప్రభావం చూపగలిగినప్పుడు… అప్పుడు ప్రశ్న మొదలవుతుంది.

ఆ సంస్థకు చెందిన మీడియా ప్రభుత్వం గురించి ఎంత స్వేచ్ఛగా వార్తలు చెప్పగలదు? అదే అసలు సమస్య. టీవీ చర్చలో నిజం ఎక్కడ? ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం.

ఒక ప్రభుత్వ నిర్ణయంపై చర్చ జరుగుతోంది. ఒక వ్యక్తి దాన్ని సమర్థిస్తున్నాడు. మరొక వ్యక్తి వ్యతిరేకిస్తున్నాడు. చూడాల్సింది ఇద్దరి వాదనలూ. కానీ యాంకర్ ఒకరిని పదేపదే అడ్డుకుంటూ, మరొకరికి ఎక్కువ సమయం ఇస్తే? ఒకరి మాటను మధ్యలో కట్ చేసి, మరొకరి మాటను హైలైట్ చేస్తే?

స్క్రీన్ మీద ఒకరిని ‘దేశ వ్యతిరేకి’గా, మరొకరిని ‘దేశభక్తుడు’గా చూపిస్తే? చర్చ అయిపోయే సరికి ప్రేక్షకుడికి ఏం మిగులుతుంది? నిజం కాదు… ఒక అభిప్రాయం. అదే జస్టిస్ జోసెఫ్ చెప్పిన అసలు విషయం.

ప్రభుత్వ ప్రకటనలూ ఒక ఆయుధమేనా? ఇంకో సున్నితమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు మీడియా సంస్థలకు భారీగా ప్రకటనలు ఇస్తాయి. కేంద్రం, రాష్ట్రాలు తమ పథకాలు, కార్యక్రమాలు, ప్రచారాల కోసం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియాకు ప్రకటనలు ఇస్తుంటాయి.

ఇక్కడ కూడా ఒక సహజమైన ప్రశ్న. ఒక మీడియా సంస్థకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ప్రకటనల ఆదాయం వస్తుంటే… అదే ప్రభుత్వంపై ప్రతిరోజూ తీవ్రంగా విమర్శలు చేయగలదా?

చేయవచ్చు. చేయాలి కూడా. కానీ ఆర్థికంగా ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడే సంస్థకు ఒక స్వీయ నియంత్రణ ఏర్పడే అవకాశం మాత్రం ఉంటుంది. అదే జస్టిస్ జోసెఫ్ చెప్పిన “క్యారెట్ అండ్ స్టిక్” సమస్య.

అంటే… అవసరమైతే ప్రకటనల రూపంలో ప్రోత్సాహం, అవసరమైతే వాటిని నిలిపివేసే అవకాశం. ఇలాంటి పరిస్థితి ఉంటే మీడియా స్వేచ్ఛ కాగితంపై ఉండొచ్చు. కానీ ఆచరణలో ఎంత ఉంటుందన్నదే ప్రశ్న.

ప్రపంచంలో మన స్థానం ఏంటి? మీడియా స్వేచ్ఛ విషయంలో అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Reporters Without Borders (RSF) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలను ర్యాంక్ చేస్తుంది. (దీని విశ్వసనీయత పెద్ద ప్రశ్నార్థకం అయినప్పటికీ…)

భారత్ ర్యాంకు 2012లో 122 కాగా, 2022లో 150కి పడిపోయింది. 2023లో 161కి చేరింది. 2024లో 159, 2025లో 151వ స్థానంలో నిలిచింది. ర్యాంకు ఒక్కటే దేశంలో మీడియా పరిస్థితికి పూర్తి కొలమానం కాదు. కానీ ఈ గణాంకాలను పూర్తిగా విస్మరించలేం కూడా.

ఎందుకంటే మీడియా స్వేచ్ఛ అంటే జర్నలిస్టుకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నిజమైన సమాచారం తెలుసుకునే ప్రతి పౌరుడి హక్కు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయమే. అందుకే జస్టిస్ జోసెఫ్ ఈ అంశాన్ని రాజ్యాంగంతో ముడిపెట్టారు.

సుప్రీంకోర్టు కౌశల్ కిశోర్ కేసులో ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 హక్కుల పరిధిపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ జోసెఫ్ దాన్ని ప్రస్తావిస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఒక టీవీ చర్చకు నన్ను పిలిచి, నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా అడ్డుకుంటే… నా మాటలను వక్రీకరిస్తే… అది మాట్లాడే వ్యక్తి హక్కును మాత్రమే కాదు, నిజం తెలుసుకోవాలనుకునే ప్రేక్షకుడి హక్కును కూడా ప్రభావితం చేస్తుంది.

ఇదే అసలు పాయింట్. మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థకు మాత్రమే స్వేచ్ఛ కాదు. ప్రజలకు నిజం తెలుసుకునే స్వేచ్ఛ కూడా.

మరి పరిష్కారం ఏమిటి? ఒకే సంస్థ టీవీ, పత్రిక, డిజిటల్ మీడియా… అన్నింటినీ నియంత్రించకుండా మీడియా యాజమాన్యంపై కఠినమైన పరిమితులు ఉండాలి. ప్రభుత్వం ఏ మీడియా సంస్థకు ఎన్ని కోట్ల ప్రకటనలు ఇచ్చిందో ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం నుంచి పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే బలమైన ప్రజా ప్రసార వ్యవస్థ ఉండాలి.

నిజం రాసినందుకు జర్నలిస్టులు చట్టపరమైన వేధింపులకు గురికాకుండా రక్షణ ఉండాలి. ఇవి కొత్త ఆలోచనలు కావు. అమలు చేయడానికి కావాల్సింది ఒక్కటే. రాజకీయ సంకల్పం.

నాలుగో స్థంభం నిలబడుతుందా? ప్రజాస్వామ్యానికి మీడియాను నాలుగో స్థంభం అంటాం. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి. ప్రతిపక్షం తప్పు చేస్తే కూడా ప్రశ్నించాలి. అధికారంలో ఉన్నవారికి జవాబుదారీతనం ఉండేలా చూడాలి. ప్రజలకు అన్ని కోణాల్లో సమాచారం అందించాలి.

కానీ మీడియానే ఒక రాజకీయ, వ్యాపార ప్రయోజనానికి అనుగుణంగా వార్తలను వడపోస్తే? అప్పుడు ప్రజాస్వామ్యానికి మిగిలేది ఏమిటి? జస్టిస్ కేఎం జోసెఫ్ చెప్పిన మాటల అసలు బరువు ఇక్కడే ఉంది.

  • “ప్రతి ప్రజాస్వామ్య పౌరుడి అంతిమ హక్కు నిజాన్ని వెతకడం, నిజాన్ని తెలుసుకోవడం.”

ఆ నిజాన్ని చెప్పాల్సిన మీడియా… నిజం ఏదో ప్రజలే వెతుక్కోవాల్సిన పరిస్థితికి వస్తే, అది కేవలం మీడియా సమస్య కాదు. అది ప్రజాస్వామ్యానికి వచ్చిన సమస్య. అందుకే జస్టిస్ జోసెఫ్ చివర్లో “అధికారులు దీనిని గమనించాలి” అన్నారు.

నిజమే. టీవీ రిమోట్ మన చేతిలో ఉండొచ్చు. కానీ మనకు కనిపిస్తున్న వార్తల వెనుక రిమోట్ ఎవరి చేతిలో ఉంది? అదే ఇప్పుడు అడగాల్సిన అసలు ప్రశ్న. ….. Cholleti … (The writer is with the Cholleti BlackRobe Chambers, Hyderabad, and writes on economy, politics and law.)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions