Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫుట్‌పాత్ ఎవరిది ? ఢిల్లీ హైకోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు – తీర్పు !

August 28, 2026 by M S R

.

ఫుట్‌పాత్‌పై ఉన్నవాడిది తప్పు కాదు… వాహనం ఫుట్‌పాత్‌పైకి రావడమే తప్పు! బార్బర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట… ఫుట్‌పాత్‌లు ‘పవిత్రమైన, సురక్షితమైన ప్రదేశాలు’…

ఫుట్‌పాత్ మీద సెలూన్ పెట్టుకున్నాడా? నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వ్యాపారం చేస్తున్నాడా? అయితే ఏదో ఒక రోజు వాహనం దూసుకొచ్చి ఢీకొంటే… అందులో అతడి తప్పూ ఉందని చెప్పొచ్చా? ఢిల్లీ హైకోర్టు సమాధానం… కాదు!

Ads

ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తిని వాహనం ఢీకొట్టి గాయపరిస్తే, అతడు అక్కడ ఎందుకు ఉన్నాడన్న కారణంతో అతడి పరిహారాన్ని తగ్గించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఫుట్‌పాత్ మీద బార్బర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టిన కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది.

అసలేం జరిగింది? ఢిల్లీలో ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. తన కుర్చీలో కస్టమర్‌కు సేవ చేస్తుండగా, ఒక ట్రక్కు నిర్లక్ష్యంగా దూసుకొచ్చి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బార్బర్ గాయపడ్డాడు.

మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ అతడికి రూ. 1,71,350 పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అతడు ఫుట్‌పాత్‌ను ఆక్రమించి అక్కడ కూర్చున్నాడని, ప్రమాదానికి తన వంతుగా నిర్లక్ష్యం ఉందని భావించి 30 శాతం పరిహారం తగ్గించింది. అలా అతడికి చేతికి వచ్చేది రూ.1,19,945 మాత్రమే అయింది.

బార్బర్ హైకోర్టును ఆశ్రయించాడు. ‘అతడు ఫుట్‌పాత్‌పై ఎందుకున్నాడు?’ కాదు… ‘వాహనం అక్కడికెందుకు వచ్చింది?’ జస్టిస్ అనీష్ దయాళ్ ఈ కేసులో చాలా కీలకమైన ప్రశ్నను ముందుకు తెచ్చారు. ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తిని ఎందుకు నిందించాలి? అసలు వాహనం ఫుట్‌పాత్ మీదికి ఎందుకు వచ్చింది? ఇదే అసలు ప్రశ్న అని కోర్టు పేర్కొంది.

ఫుట్‌పాత్‌పై బార్బర్‌గా పనిచేయడం మున్సిపల్ నిబంధనల ప్రకారం అక్రమ వినియోగం కావచ్చు. దానిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవచ్చు. కానీ అది ప్రమాదంలో అతడి ‘కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్’కు కారణం కాదు అని కోర్టు స్పష్టం చేసింది.

అంటే… అక్కడ షాపు పెట్టుకున్నందుకు మున్సిపాలిటీ జరిమానా వేయవచ్చు. ఆక్రమణ తొలగించవచ్చు. కానీ ఫుట్‌పాత్ మీదికి దూసుకొచ్చిన వాహనం ఢీకొట్టి గాయపరిస్తే, ‘నువ్వే అక్కడ ఎందుకు ఉన్నావు?’ అంటూ పరిహారం తగ్గించలేరు.

ఫుట్‌పాత్ ఎవరి కోసం? ఈ తీర్పులో కోర్టు చెప్పిన ఒక మాట ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సినది.  ఫుట్‌పాత్‌లు, పాదచారుల ప్రాంతాలు ‘పవిత్రమైన, సురక్షితమైన ప్రదేశాలు’. అక్కడ వాహనాలు దూసుకెళ్లడానికి కాదు. వాహనాలు నడపడానికి కూడా కాదు.

ఫుట్‌పాత్ మీద నడిచేవాడు కావచ్చు… నిద్రపోతున్నవాడు కావచ్చు… బార్బర్‌గా పనిచేస్తున్నవాడు కావచ్చు… మరే కారణంతోనైనా అక్కడ ఉన్నవాడు కావచ్చు. అరటిపళ్ల బండి కావచ్చు, పానీపూరి బడ్డీ కావచ్చు…  వాహనం ఫుట్‌పాత్‌పైకి వచ్చి ప్రమాదం చేస్తే, అక్కడ ఉన్న వ్యక్తినే ప్రమాదానికి బాధ్యుడిని చేయలేం అన్నది కోర్టు స్పష్టమైన అభిప్రాయం.

ఇది ఒక్క బార్బర్‌కు సంబంధించిన తీర్పు కాదు. మన నగరాల్లో రోజూ ఫుట్‌పాత్‌ల మీద నడిచే లక్షలాది మంది పాదచారులకు సంబంధించిన ప్రశ్న. ఫుట్‌పాత్‌పై మన దేశంలో ఎవరు నడుస్తున్నారు? ఒక వైపు ఫుట్‌పాత్ ఆక్రమణలు నిజమే. చిన్నచిన్న వ్యాపారాలు ఉంటాయి. బండ్లు ఉంటాయి. షాపుల విస్తరణలు ఉంటాయి. పార్కింగ్ ఉంటుంది. అనేక చోట్ల ఫుట్‌పాత్ కనిపించకుండా పోయింది.

అది పౌర, మున్సిపల్ సమస్య. కానీ దాని పేరుతో ఫుట్‌పాత్ మీద ఉన్న మనిషి ప్రాణానికి విలువ తగ్గదు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించిన వ్యక్తిపై మున్సిపల్ చర్య తీసుకోవడం ఒక విషయం. ఫుట్‌పాత్ మీదికి వాహనాన్ని నడిపి అతడిని ఢీకొట్టి, ఆ ప్రమాదానికి అతడికే కొంత బాధ్యత ఉందని చెప్పడం మరో విషయం.

ఈ రెండింటినీ కలపకూడదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చివరకు బార్బర్‌కు పూర్తి పరిహారం బార్బర్‌పై 30 శాతం తగ్గింపును హైకోర్టు కొట్టివేసింది. అతడికి ఇవ్వాల్సిన పరిహారాన్ని తిరిగి రూ.1,71,350గా నిర్ణయించింది. దీనికి 6 శాతం వార్షిక వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.

అంతేకాదు… ఈ కేసులో బీమా సంస్థ మొదట దాఖలు చేసిన సమాధానంలో ‘కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్’ అనే వాదనను కూడా సరిగా ముందుకు తేలేదని కోర్టు గుర్తించింది. ఒక చిన్న తీర్పు… పెద్ద సందేశం…

మన దగ్గర తరచూ ఒక విచిత్రమైన న్యాయం కనిపిస్తుంది. ఫుట్‌పాత్ ఆక్రమించాడని పాదచారినే తప్పుబడతాం. ఫుట్‌పాత్ మీద బైక్ నడిపిన వాడిని మాత్రం ఏదో సాధారణ విషయంలా చూస్తాం.

ఫుట్‌పాత్ మీద కార్లు పార్క్ చేస్తాం. పాదచారి రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. అక్కడ ప్రమాదం జరిగితే… మళ్లీ ‘రోడ్డు మీద ఎందుకు నడిచావు?’ అనే ప్రశ్న! ఈ ధోరణికి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఒక చక్కటి పాఠం.

పాదచారికి సురక్షితంగా నడిచే స్థలం ఇచ్చినప్పుడే నగరం నిజంగా నాగరికమైన నగరం. ఫుట్‌పాత్ పాదచారిదే. ఆ స్థలాన్ని గౌరవించడం వాహనదారుడి బాధ్యత. అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!
  • టాక్సిక్ డైలాగ్స్ ! ఇది తెలుగేనా..? ఓ ఆసక్తికరమైన చర్చ !!
  • ఓహ్.., బాబా రాందేవ్ వుమెన్ ఇన్నర్‌వేర్ కూడా అమ్ముతున్నాడా..?!
  • ఫుట్‌పాత్ ఎవరిది ? ఢిల్లీ హైకోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు – తీర్పు !
  • Toxic – ఎందుకు డిజాస్టర్ అయ్యిందో తెలుసా..? ఇదుగో ఇందుకు !!
  • ఒక చిరంజీవి- ఆ ముగ్గురు స్నేహితులు ! ఓ మంచి పాజిటివ్ వైబ్స్ !!
  • SIR – పెద్ద ట్విస్టు ఏమిటంటే… ముసాయిదాలో పేరున్నా ఫైనల్ కాదు !!
  • మన వ్యవస్థలు ఎంత గుడ్డివో ఇంత క్లియర్‌గా చెప్పిన కేసు లేదు !!
  • అంతే… ఈ క్షుద్ర ఆంధ్రా మీడియాకు మర్యాద దక్కొద్దు నాయకా !!
  • ‘‘నాకు మీ సభ ఇష్టం లేదు’’ – మోహన్ భగవత్ Vs జోహ్రాన్ మామ్దానీ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions