.
నిజంగానే చాలామందికి తెలియదు… బాబా రాందేవ్ చివరకు ఆడవాళ్ల బ్రాలు, ప్యాంటీలు కూడా అమ్ముతాడని..! తనేదో ఆయుర్వేద ఉత్పత్తులు, మందులు, ఆహారాలు గట్రా అమ్ముకునే వ్యాపారిగా మాత్రమే తెలుసు చాలామందికి…
తన పతంజలి సంస్థ సగటు మల్టీ నేషనల్ కంపెనీలాగే ఏది పడితే అమ్ముతోందనే విమర్శలు వచ్చినప్పుడు కూడా… చాలామంది సనాతన వాదులు సమర్థించుకొచ్చేవాళ్లు… నాణ్యత, ధర, స్వదేశీ గట్రా పడికట్టు పదాలు వాడుతూ రాందేవ్కు ఎదురు లేదు, తిరుగు లేదు అని పిడివాదం వినిపించేవాళ్లు…
Ads
యోగాను ముందు పెట్టి, ఓ పేద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు తను… కానీ పోయి పోయి కంగనా రనౌత్ నోట్లో నోరుపెట్టాడు… సహజంగానే తనపై విమర్శలకు పెద్దగా ఎవరూ సాహసించరు, ట్రోలింగ్ జరుగుతుందనే భయంతో… పైగా చాలామంది రాందేవ్ బాబా అంటే అదొక ‘పవిత్రమైన సరుకు’… గోమూత్రంలాగా..!!
కాక్రోచ్ ఆందోళనలను ఉద్దేశించి కంగనా ‘జెనెరేషన్ గట్టర్’ (Generation Gutter – మురికి కాలువ తరం) అని విమర్శించింది… మరి రాందేవ్ బాబాకు ఆమెపై ఏమైనా పాతపగలు, కోపాలు ఉన్నాయేమో తెలియదు… ఏమిటా విమర్శలు, నీ గతం, నీ చరిత్ర మరిచిపోయావా అని ఎకసక్కెం ఆడాడు… నడుమ తనెందుకు ఎంటర్ అయ్యాడనే కోపంతో, అసలే కంగనా కదా… ఏం, నా బెడ్రూంలో ఎప్పటి నుంచి గబ్బిలంలా వేలాడుతూ ఏం చూస్తున్నావ్ అని కౌంటర్ పంచ్ కొట్టింది…
అంతేకాదు… ఎంతటి రాందేవ్నైనా పెద్ద కర్రతో కొట్టాలనేది తన పాలసీ కదా… నువ్వొక నకిలీ మందులు అమ్ముకునే ఫేక్ ఆధ్యాత్మికవేత్తవు, యోగా నుంచి వ్యాపారానికి మళ్లి లక్షల కోట్లు సంపాదిస్తున్నావు, నీ పని చూసుకో ముందు… నీ కలల్లో కూడా నా బెడ్రూమే కనిపిస్తే నీ ఖర్మ… చివరకు ఆడవాళ్ల ఇన్నర్వేర్ అమ్ముకునే నువ్వు కూడా మాట్లాడేవాడివి అయ్యావా అని లెఫ్ట్ రైట్ పీకింది…
రాందేవ్ మళ్లీ కిక్కుమంటే ఒట్టు… ఎందుకంటే, ఆమె చెప్పింది నిజం కాబట్టి… మరీ నీ నుంచి హిందూ సంస్కృతి గురించి, సంప్రదాయం గురించి, ఆధ్యాత్మికత గురించి పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేనుఫోవోయ్ అని ఘాటుగా రిటార్ట్ వదిలింది…
అవునూ, నిజంగా పతంజలి చివరకు బ్రాలు, ప్యాంటీలు అమ్ముతున్నాడా అని తన వెబ్సైట్లు పరిశీలిస్తే… కంగనా చెప్పింది నిజమే అని తెలిసింది…పతంజలి సంస్థకు ఓ దుస్తుల విభాగం ఉంది… పేరు ‘పతంజలి పరిధాన్’ (Patanjali Paridhan)… మహిళల ఇన్నర్వేర్ (బ్రాలు, ప్యాంటీలు), పురుషుల అండర్వేర్లు, బనియన్లు, స్పోర్ట్స్ వేర్ వంటి వస్త్ర ఉత్పత్తులను విక్రయిస్తోంది…
యోగా ఏమిటో, ఆధ్యాత్మికత ఏమిటో, ఆయర్వేదం ఏమిటో… చివరకు పతంజలి ఓ సగటు బహుళ జాతి సంస్థగా రూపాంతరం చెందడం ఏమిటో… వ్యాపారం తప్పు కాదు… బ్రాలు, ప్యాంటీలు అమ్మడం కూడా తప్పు కాదు… కానీ పతంజలి ఇమేజ్ వేరు, చేసే పని వేరు… ఏమో, రాను రాను రాందేవ్ బాబా, లంగోటీలతోపాటు వయగ్రాలు, కండోమ్స్ కూడా అమ్మినా, ఇదే కంగనా మళ్లీ నోరుచేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు…!! దానికి కూడా స్వదేశీ స్వాభిమాన్ అనే నినాదం కూడా జతచేస్తాడేమో!!
Share this Article