.
నిన్నామొన్నటి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా అనిపించింది కవిత తాజా వ్యాఖ్యలు.., ఆమె నిజామాబాద్ సభలో మాట్లాడుతూ ఓ దశలో ‘నేను పిరికిదాన్ని కాదు’ అని కన్నీళ్లు పెట్టుకుంటూ… బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడింది…
ఆమె పదే పదే గుంటనక్క అని హరీష్‌రావును, కేసీయార్ చుట్టూ దుష్టశక్తులు చేరాయని తిట్టిపోస్తుంది కదా… ఇప్పుడు ‘హరీష్ రావు, కేటీయార్, సంతోష్‌లను క్షమిస్తానేమో గానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు’ అని తీవ్రంగా ధ్వజమెత్తింది… తన తండ్రితో తనకు దూరం పెంచి, తనను పార్టీ నుంచి, ఇంటి నుంచి పంపించేయటంలో ప్రశాంత్ రెడ్డే ప్రధాన బాధ్యుడని నిందించింది…
Ads
దీనికి ప్రశాంత్ రెడ్డి ‘నేను కుట్రదారుడిని కాను, మధ్యవర్తిని, కవిత తీరుతో కేసీయార్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు, ఆ కుటుంబంలో వారి నడుమ విభేదాలను పూడ్చడానికి బాగా ప్రయత్నించాను, కవిత వల్లే సయోధ్య సాధ్యం కాలేదు’ అని సమాధానం ఇచ్చాడు…
గతంలో కవిత ఓటమిపాలు కావడానికి ప్రశాంత్ రెడ్డి కారణమా..? కవితకూ ఆయనకూ నడుమ ఎందుకు రాజకీయంగా చెడిందో బయటికి తెలియదు… కానీ విస్మయం ఏమిటంటే..? కేసీయార్ వంటి పెద్ద దొర ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్ చెబితే వింటాడా, అదీ తన కుటుంబ అంతర్గత విషయాలు, తలనొప్పులకు సంబంధించి..?
ఆ కుటుంబంలో తన పలుకుబడి, కేసీయార్ కూడా ప్రశాంత్ రెడ్డి చెబితే పాటించేంత రేంజ్ సాన్నిహిత్యం ఉందా..? అసలు కేసీయార్ తన కుటుంబానికి సంబంధించి ఎవరినీ మాట్లాడనివ్వడు, కలగజేసుకోనివ్వడు… అలాంటిది ప్రశాంత్ రెడ్డి చెప్పుడు మాటలు విని ఏకంగా సొంత బిడ్డను పార్టీ నుంచి, ఇంటి నుంచి బహిష్కరించాడా..? ప్రశాంత్ రెడ్డి తన సొంత ఇంటి మనిషికన్నా ఎక్కువా..? కేసీయార్, కవిత నడుమ సయోధ్య కుదిర్చేంత ప్రాధాన్యం ఉందా తనకు..? ఎలా..?
తన స్వీయ విచక్షణో, తన సొంత విశ్లేషణలో ఏమైనట్టు మరి..? ఏమాటకామాట… కవిత ఏం మాట్లాడినా ఎవరూ స్పందించకూడదని కేసీయార్ చెప్పాడు… చివరకు కేటీయార్, హరీష్ రావు కూడా ఆమె మీద పల్లెత్తుమాట మాట్లాడటం లేదు… ఒకరిద్దరు నాయకులు, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మినహా పార్టీలో ఇంకెవరూ మాట్లాడటం లేదు… పరస్పర నిందలు, విమర్శలతో కుటుంబానికి, పార్టీకి ఇంకా నష్టం జరుగుతుందనేది కేసీయార్ భావన…
కానీ తెలంగాణ సమాజంలో ఓ భావన మాత్రం బలపడుతోంది… ‘‘పాపం, బిడ్డను పార్టీ నుంచే కాదు, ఇంటి నుంచి కూడా వెళ్లగొట్టిన్రట, రాఖీ కట్టడానికి కూడా పోలేదట ఆమె, గంతఘనం పాపమేం చేసింది బిడ్డ, ఏమన్న ఉంటే ఇంట్లనే కూసోబెట్టి చెప్పుకోవాలె కద..’’ దీనికి సమాధానం అంత సులువు కాదు… చేస్తున్న నష్టం బయటికి కనిపించకపోవచ్చు, కానీ నష్టం మాత్రం నిజం…
కవిత నిజం చెబుతున్నదా, ప్రశాంత్ రెడ్డి చెప్పేదాంట్లో నిజం ఉందానేది వేరు, అదెప్పుడూ బయటికిరాదు, కేసీయార్ ఆమెను ఏకంగా కుటుంబం నుంచే బహిష్కరించేంత కోపం ఎందుకు పెంచుకున్నాడో తనూ చెప్పడు… కానీ బహిరంగంగా ఆమె కంటతడి నిజం… కేసీయార్ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని దూషించడం నిజం…
సాధారణంగా తండ్రీబిడ్డల నడుమ, కుటుంబ సభ్యుల నడుమ, భార్యాభర్తల నడుమ పంచాయితీల్లోకి కుటుంబేతర వ్యక్తుల ప్రమేయాన్ని, జోక్యాన్ని సొసైటీ ఇష్టపడదు… సాధారణంగా రక్తబంధువులే ఎంటర్ కావడానికి సందేహిస్తారు… అలాంటిది ప్రశాంత్ రెడ్డికి ఏకంగా కేసీయార్ కుటుంబ సమస్యలపైనే కలగజేసుకునేంత ‘పెద్దరికం’ ఎలా వచ్చింది…? అంత శక్తిమంతుడా..? సొంతంగా ఆలోచించి, నిర్ణయం, అదీ సొంత బిడ్డ విషయంలో తీసుకోలేనంత బలహీనుడా కేసీయార్..? అదీ ఆశ్చర్యకరం…
తెలంగాణ రాజకీయాలను మూడు దశాబ్దాలకు పైగా శాసించిన కేసీఆర్... తన సొంత కుటుంబానికి సంబంధించిన విషయంలో మాత్రం మరొకరి మాట విని నిర్ణయం తీసుకునేంత బలహీనుడా?
Share this Article