.
హంబగ్… అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ముద్రలన్నీ అబ్సర్డ్… కాంగ్రెస్ పార్టీకే ఓ రంగు ఉండదు, చాలా రంగులు వస్తుంటాయి, కలుస్తుంటాయి, పోతుంటాయి… ఓ వార్డు స్థాయి కార్యకర్త నుంచి హైకమాండ్ కీలక పోస్టుల దాకా, ఏ నాయకుడైనా సరే, తన సమర్థతతో తమ స్థాయిలో ఆధిపత్యాన్ని నిలుపుకుంటారో వాళ్లదే కాంగ్రెస్…
అప్పట్లో వైఎస్ కావచ్చు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కావచ్చు… అసలు గ్రూపులంటూ లేని కాంగ్రెస్ ఉంటుందా..? కాంగ్రెస్ సంస్కృతే అది… కాకపోతే గ్రూపుల్ని ఎలా టాకిల్ చేస్తారనేదే ముఖ్యం… వైఎస్ చేశాడు ఆ పని… తనదైన రీతిలో… ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు, ఈయనది ఇంకో స్టయిల్… ఒక్క ముక్కలో చెప్పాలంటే సీఎం అయినప్పుడు రేవంత్ రెడ్డికన్నా ప్రజెంట్ రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు… ఆ బలం తెచ్చుకున్నాడు…
Ads
దీనికి తన దూకుడే కాదు, తను మెయింటెయిన్ చేసే ‘రిలేషన్స్’ బలమైనవి… వాటి ముందు కొండా ఫ్యామిలీ దుందుడుకు రాజకీయాలే కాదు, వాళ్లకు సపోర్ట్ చేసిన సీనియర్ మంత్రులు, ఎగదోసిన సొంతింటి, పొరుగింటి ప్రతిపక్ష తలలు ఎట్సెట్రా తీవ్ర నిరాశకు గురయ్యాయి…
ఈ ఐదేళ్లూ తను సీఎం, డౌట్ లేదు, పక్కా… రెండోసారి అవకాశం అనేది కాలం, డెస్టిని నిర్ణయిస్తుంది… ఐతే మాటల్లో, చేష్టల్లో అపరిపక్వత కనబడే సుస్మితను ముందుబెట్టి, కుట్ర రాజకీయానికి తెరలేపిన రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎక్కడ ఫెయిలయ్యారు అంటే… రేవంత్ రెడ్డి రాజకీయాల్ని నిర్వర్తించే తీరును సరిగ్గా అంచనా వేయలేకపోవడం!
ఈ మొత్తం ఎపిసోడ్లో చూడాల్సింది కొండా ఫ్యామిలీ సహజమైన దుందుడుకు రాజకీయాల్ని కాదు… తమ వెనుక ఉండి, పెట్రోల్ పోసిన శక్తుల గురించి..! నిన్న పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడు, సురేఖను కాపాడటానికి విపరీతంగా ప్రయత్నించాం అని! అంటే, ఏమిటి అర్థం..? ఆమె చేసింది సబబే, యాక్షన్ అవసరం లేదు అని చెబుతున్నాడా..?
ఓ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఏకంగా సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ రెడ్డికి తెలియదా..? కాంగ్రెస్ సంస్కృతి తెలుసు, గ్రూపుల బెడదలు తెలుసు, కానీ దేన్ని ఎలా నరుక్కురావాలో తెలిసినవాడు కాబట్టి సీఎం కాగలిగాడు… అంత తేలికగా ఈ తాజా కుట్రకు చేతులెత్తేస్తాడా..?
ఈ 1000 రోజులూ గుంభనంగా ఉన్నాడు… ఇక మేమే, రేపోమాపో అన్నట్టు వ్యవహరించిన ఒకరిద్దరు సీనియర్ మంత్రుల్ని సైలెంట్ చేశాడు… కారణాలు, మార్గాలు ఏవైనా సరే… అసలు 1000 రోజులూ ఏ ఇష్యూ లేకుండా కాంగ్రెస్ నడవడమే విశేషం… సురేఖపై వేసిన వేటుతో నిన్నామొన్న గొంతులు సవరించుకుంటున్నవాళ్లూ సైలెంట్ అయిపోయారు…
కొండా ఫ్యామిలీకి మరీ ఎంత అవమానం అంటే..? ఎవరిని బడితే వాళ్లను చేర్చుకోవడానికి బీజేపీ ఏమైనా డస్ట్ బిన్ అనుకున్నారా అని మురళీధర్‌రావు ఎద్దేవా చేశాడు… నథింగ్ డూయింగ్, బీఆర్ఎస్ గేట్లు క్లోజ్ అంటాడు జగదీష్‌రెడ్డి, చివరకు కేఏపాల్, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు…
ఓ రాజ్యసభ ఎంపీ సీటు, ఓ ఎమ్మెల్యే సీటు, జాతీయ పార్టీ కార్యవర్గంలో మంచి పోస్టు కావాలని బీజేపీని అడుగుతున్నట్టు, నిజామాబాద్ పెద్దమనిషి మధ్యవర్తిత్వం అంటున్నారు… నిజానిజాలు తెలియదు…
మొన్న ఒవైసీ చెబుతున్నాడు… ‘రేవంత్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, కుర్చీ వదిలి ఇంటికి పోవల్సి ఉంటుందని కేసీయార్‌కు చెప్పాను, అదే జరిగింది’ అని… ఐతే సురేఖ ఇష్యూను టాకిల్ చేసినట్టే మిగతా గొంతుల్నీ డీల్ చేస్తాడా..? లేదు, రాజగోపాలరెడ్డి ఇష్యూ మరోరకంగా సెటిల్ చేయబడుతుంది…
నిన్న నకిరేకల్ వెళ్లినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్థంతరంగా సీఎం సమావేశాన్ని వదిలేసి వెళ్లిపోగా, అసమ్మతి స్వరాలు పెంచిన రాజగోపాలరెడ్డి మాత్రం హఠాత్తుగా సీఎంకు మాంచి ఫాలోయర్ అయిపోయాడు… ఇది దేనికి సంకేతం..? వేచి చూద్దాం…
సురేఖ బిడ్డ ఏదో వీడియోలో ఏడుస్తోంది… అంతా నావల్లే, మా తల్లి అవినీతి ఏముంది..? అధిష్ఠానానికి మామీద సానుభూతి ఉంది, ఇప్పటికీ సీఎంను వదలను, అక్రమాల ఆధారాల్ని సీబీఐకి, ఈడీకి ఇస్తా అంటూ..! సురేఖపై పడిన వేటు అవినీతి గురించి కాదు, మొత్తం ఎపిసోడ్లో ఆ ప్రస్తావనే లేదు… ఓ సీనియర్ నేతను డైపర్ల ముసలి అని తిట్టడం గురించీ కాదు…
సుస్మితను ముందు పెట్టి మురళి- సురేఖ నడిపించిన రాజకీయం… దాని వెనుక ఉన్న కుట్రదారులు… సీఎంను కూల్చేసే విఫల ప్రయత్నాలు… వాళ్లకు సొంత పార్టీలోనే మద్దతు స్వరాలు… వాటిని కఠినంగా అణిచివేసేందుకు రేవంత్ వేసిన స్టెప్పులు వేరు… ఇకపై ఆడే ఆట కూడా వేరు…
ఏయ్, కేసీయార్ రాజీనామా చెయ్, పుణ్యానికి కోట్ల జీతం తీసుకుంటున్నవ్ సిగ్గులేదా అని ఉరమడం వెనుక… సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని సవాల్ విసరడం వెనుక… తన ఇన్నాళ్ల విజయాలకు కారణమైన తెంపరితనం ఉంది… అది పదును పెట్టుకుని మళ్లీ బయటికి వస్తోంది… సో, ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వ్యతిరేక స్వరాలకు మూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు… ఇది రియాలిటీ !! ఇది కొత్త కాంగ్రెస్ !!
Share this Article