.
బ్రహ్మచర్యం కోసం మహిళలు కనిపించకూడదా?
ఐఫెల్ టవర్ నుంచి మొదలైన అసలు ప్రశ్న… అసలు BAPS ఏంటి?… ఒక మత సంస్థకు చెందిన సన్యాసులు ఒక దేశానికి వెళ్తారు. అక్కడి ఒక ప్రసిద్ధ పర్యాటక కట్టడాన్ని సందర్శిస్తారు. వాళ్ల ఆధ్యాత్మిక నియమాల ప్రకారం మహిళలతో దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతవరకూ అది వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎంపిక.
కానీ… ఆ సన్యాసులు ఒక పబ్లిక్ స్పేస్‌లోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను కూడా తమకు కనిపించకుండా పక్కకు తప్పించాల్సి వస్తే? అక్కడి నుంచే అసలు ప్రశ్న మొదలవుతుంది. సన్యాసి తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కోసం మహిళ ఎందుకు తన ఉద్యోగ స్థలం నుంచి తప్పుకోవాలి?
Ads
ఇదే ఇప్పుడు ఫ్రాన్స్‌లోని ఐఫెల్ టవర్ వివాదం చుట్టూ తిరుగుతున్న అసలు చర్చ. అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 5న సుమారు 100 మంది సభ్యులతో కూడిన BAPS అనుబంధ హిందూ మత ప్రతినిధి బృందం ఐఫెల్ టవర్‌ను ప్రైవేట్‌గా సందర్శించింది. ఆ సందర్భంగా మహిళా ఉద్యోగులను కొన్ని ప్రాంతాల నుంచి తప్పించి, వారి స్థానాల్లో పురుష ఉద్యోగులను ఉంచినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
“మహిళా సిబ్బంది తమ వర్క్స్టేషన్ల నుంచి వెళ్లిపోవాలని చెప్పారని” యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై, సెప్టెంబర్ 7న ఐఫెల్ టవర్ సిబ్బంది నిరసనకు దిగారు. దాంతో టవర్‌ను మూసివేయాల్సి వచ్చింది.
పారిస్ నగర అధికారులు కూడా దర్యాప్తుకు ఆదేశించారు. తర్వాత టవర్‌ను నిర్వహించే సంస్థ కూడా ఇలాంటి షరతులను అంగీకరించడం తప్పేనని అంగీకరించింది. BAPS మాత్రం మహిళలకు ప్రవేశం నిరాకరించలేదని, ఎవరికీ అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పి, జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.
అంటే… ఘటనపై వాస్తవాల విషయంలో కొన్ని వివరాలు వివాదాస్పదంగా ఉన్నా, మహిళా సిబ్బందిని దూరంగా ఉంచే ఏర్పాట్లు జరిగాయన్న అంశం మాత్రం ఫ్రాన్స్‌లో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది.
మరి BAPS అంటే ఏంటి? BAPS అంటే— Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha. ఇది స్వామినారాయణ సంప్రదాయంలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ. స్వామినారాయణ సంప్రదాయానికి మూలం 18వ శతాబ్దం చివర్లో భగవాన్ స్వామినారాయణ బోధనల్లో ఉంది. 1907లో శాస్త్రిజీ మహారాజ్ BAPS సంస్థను అధికారికంగా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఇది భారతదేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారీ మత- సామాజిక సంస్థ. BAPS స్వయంగా ప్రపంచవ్యాప్తంగా 5,000కు పైగా కేంద్రాలు ఉన్నాయని, లక్షలాది మంది అనుచరులు ఉన్నారని చెబుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్య, ఆరోగ్యం, విపత్తు సహాయం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అంటే… ఇది ఏదో చిన్న మఠం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉన్న ఒక పెద్ద హిందూ సంస్థ.
BAPSలో ప్రత్యేకత ఏమిటి? BAPSలో సన్యాస జీవితం చాలా కఠినమైన నియమాలపై ఆధారపడి ఉంటుంది. సాధువులకు ఐదు ప్రధాన నియమాలు ఉన్నాయి.
నిష్కామం — కామానికి (కోరికలకు) దూరంగా ఉండటం
నిస్నేహం — భౌతిక అనుబంధాలకు దూరంగా ఉండటం
నిస్వాదం — రుచులపై నియంత్రణ
నిర్మానం — అహంకారానికి దూరంగా ఉండటం
నిర్లోభం — ధనంపై ఆసక్తి లేకపోవడం
వీటిలో నిష్కామం అంటే ఎనిమిది విధాల బ్రహ్మచర్యం. ఇక్కడే ఐఫెల్ టవర్ కథకు అసలు లింక్ వస్తుంది. BAPS సాధువుల బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
ఇది కేవలం సంభోగం చేయకపోవడం” అనే అర్థంలో ఉండదు. BAPS స్వయంగా వివరించే అష్టాంగ బ్రహ్మచర్యం చాలా విస్తృతమైనది.
సాధువు—
మహిళల గురించి మాట్లాడకూడదు
మహిళలతో మాట్లాడకూడదు
ఉద్దేశపూర్వకంగా మహిళలను చూడకూడదు
మహిళల సాంగత్యాన్ని కోరుకోకూడదు
మహిళల గురించి ఆలోచించకూడదు
మహిళలతో వినోదం చేయకూడదు
మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు
అంటే… బ్రహ్మచర్యం శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు. మనసు, మాట, చూపు, సాంగత్యం అన్నింటికీ వర్తిస్తుంది. BAPSకు చెందిన ఒక అధికారిక వ్యాసం మరింత స్పష్టంగా చెబుతుంది— అంటే మహిళలను ద్వేషిస్తారా?
ఇక్కడ BAPS వైపు నుంచి ఒక ముఖ్యమైన వివరణ ఉంది. “ఇది మహిళలపై ద్వేషం కాదు” అని సంస్థ స్పష్టంగా చెబుతోంది. వారి వాదన ప్రకారం ఇది మహిళలను తక్కువగా చూడటానికి పెట్టిన నియమం కాదు. సాధువు తన ఆధ్యాత్మిక సాధనలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి స్వీకరించే వ్యక్తిగత నియమం.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… BAPSలో మహిళలకు ప్రత్యేకమైన కార్యకలాపాల కేంద్రాలు, మహిళా సమావేశాలు, మహిళా విభాగాలు ఉన్నాయి. అంటే సంస్థ తనను తాను స్త్రీ వ్యతిరేక సంస్థగా చూడదు. మరి సమస్య ఎక్కడ వచ్చింది?
ఇక్కడే అసలు చిక్కు. ఒక వ్యక్తి తనపై ఒక నియమం విధించుకోవడం ఒక విషయం. ఆ నియమాన్ని పాటించడానికి సమాజంలోని ఇతర వ్యక్తుల ప్రవర్తనను మార్చడం మరో విషయం.
ఒక సన్యాసి— “నేను మహిళలతో మాట్లాడను” అనుకోవచ్చు. “నేను మహిళలను చూడను” అనుకోవచ్చు. “నేను మహిళలకు దూరంగా ఉంటాను” అనుకోవచ్చు. ఇది అతని ఆధ్యాత్మిక నిర్ణయం.
కానీ… అతను ఒక ప్రభుత్వ/ పబ్లిక్ సంస్థలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగి తన ఉద్యోగం చేయకుండా పక్కకు తప్పుకోవాలా? ఇదే ఫ్రాన్స్‌లో ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక సాధువు తన చూపును నియంత్రించుకోవాలా? లేక అతని చూపుకు మహిళలు తమను తాము అదృశ్యం చేసుకోవాలా?
BAPS సిద్ధాంతంలో బ్రహ్మచర్యం అంటే “మహిళలను అసహ్యించుకోవడం” కాదు. వారి సొంత పత్రాల్లోనే మహిళల పట్ల గౌరవం గురించి చెబుతున్నారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో మహిళ ప్రాణాలను కాపాడటానికి సాధువు జోక్యం చేసుకోవచ్చని కూడా BAPS ప్రచురణలు చెబుతున్నాయి.
కానీ ఐఫెల్ టవర్ ఘటన ఈ సిద్ధాంతంపై మరో కఠినమైన ప్రశ్న ముందుకు తెచ్చింది. మత నియమం vs ప్రజాస్వామ్య సమాజం… ఉద్యోగ హక్కులు, లింగ సమానత్వం, పబ్లిక్ స్పేస్‌లో మత స్వేచ్ఛకు ఉన్న పరిమితులు అనే ప్రశ్నగా మారుతుంది. అందుకే ఫ్రాన్స్‌లో రాజకీయ నాయకుల నుంచి కూడా తీవ్ర స్పందన వచ్చింది. పారిస్ నగర అధికారులు విచారం ప్రకటించారు.
ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న… బ్రహ్మచర్యం అంటే అసలు ఏమిటి? తనను తాను నియంత్రించుకోవడమా? లేక తన నియమాన్ని పాటించేందుకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడమా?
Share this Article