Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!

September 9, 2026 by M S R

.

ఇదేందిర భయ్, ఇదేం విమానం, ఆడుకునే బొమ్మలాగా చిన్నగ ఉంది, టాయ్ ప్లేన్….. అని వ్యంగ్యంగా తన సోషల్ ఖాతాలో రాసుకొచ్చింది వెరీ హాట్ సెలబ్రిటీ, వివాదాలకు వెరవని, కావాలని వివాదాల్లో వేళ్లు పెట్టే హిందీ ఆంటీ నోరా ఫతేహి… దాంతో సదరు ఎయిర్‌లైన్స్ వాడు ఏకంగా 3 కోట్లకు పరువునష్టం కేసు వేశాడు… చాలా ఆసక్తికరమైన ఈ వివాదం ఏమిటో రెండు వైపులా చూద్దాం…

మీరు మార్కెట్‌లో కొత్తగా వచ్చిన ఓ సబ్బును తీసుకున్నారు… బాగా లేదు… డబ్బు వేస్ట్, ఒక కస్టమర్‌గా మనం మన అభిప్రాయాన్ని జనానికి చెప్పాం, ఒరే జాగ్రత్తరా అని హెచ్చరించాం… అది సోషల్ బాధ్యత ప్లస్ కస్టమర్ రివ్యూ… కానీ ఆ సబ్బు తయారు చేసేవాడు నా పరువు పోయింది, నా అమ్మకాలు తగ్గాయి అని కేసు వేస్తే..?

Ads

అరె, అది నీ ఖర్మ, నాణ్యత నీ బాధ్యత… మంచిగుంటే మంచి రాస్తం, బాగాలేకపోతే వీడొక వేస్ట్ అని రాస్తం… ఇందులో పరువు ఏముంది..? నాణ్యత, కస్టమర్, రివ్యూ… అంతేకదా… నోరా నోరు కాస్త పెద్దది కదా… తను ప్రయాణించిన ఓ విమానాన్ని టాయ్ ప్లేన్ అనేసింది, లెగో ప్లేన్ అని చెప్పింది… ఇక్కడితో మొదలైన విషయం ఇప్పుడు కోర్టు గడప తొక్కింది!

నోరా ఫతేహీపై డ్యూన్స్ ఏవియేషన్ రూ.3 కోట్ల సివిల్ డిఫమేషన్ కేసు వేసింది… గత డిసెంబర్‌లో ముంబై నుంచి జైపూర్‌కు Cessna Citation CJ2 విమానంలో ప్రయాణించినప్పుడు నోరా ఆ విమానాన్ని “మినియేచర్”, “టాయ్”, “లెగో ఎయిర్‌ప్లేన్” అంటూ వ్యాఖ్యానించి, ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిందన్నది కంపెనీ ఆరోపణ…

ఆమెకు 4.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నందున ఆమె వ్యాఖ్యలు విస్తృతంగా వెళ్లాయని, దాని వల్ల తమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, బుకింగ్స్ 15–20 శాతం పడిపోయాయని, క్యాన్సిలేషన్లు పెరిగాయని చెబుతోంది. విమానం DGCA సర్టిఫైడ్, ఎయిర్‌వర్థీ, చట్టబద్ధంగా NSOP కింద నడుస్తోందని కూడా సంస్థ చెబుతోంది. రూ.3 కోట్ల నష్టపరిహారంతో పాటు ఆ పోస్టులను తొలగించాలని, నోరా బహిరంగంగా వివరణ ఇవ్వాలని కోరుతోంది. సెప్టెంబర్ 25న గాంధీనగర్ కోర్టులో తదుపరి విచారణ జరగనుంది.

nora

ఇంతవరకు కంపెనీ వాదన… ఇప్పుడు మరోవైపు నుంచి చూద్దాం.

ప్రశ్న: నోరా ఒక కస్టమర్ కాదా? ఆమె విమానం నడపలేదు. ఆమె విమానం డిజైన్ చేయలేదు. ఆమె దాని సర్టిఫికేషన్ గురించి తీర్పు ఇవ్వలేదు. ఆమె ఒక ప్రయాణికురాలు. తనకు కనిపించినది, తనకు అనిపించినది తన సోషల్ మీడియా ఫాలోవర్లతో పంచుకుంది. అది కూడా వినియోగదారుడి హక్కులో భాగమే కాదా?

ఒక ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసిన కస్టమర్‌కు దాని గురించి తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉండాలి కదా! అది కంపెనీకి నచ్చిన అభిప్రాయమే అయి ఉండాలా? “మీ సేవ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.” కస్టమర్ ఇలా మాత్రమే అనాలా?

అది కాకుండా— “నాకు నచ్చలేదు.” అంటే? అదీ నేరమా? కానీ ఇక్కడ కంపెనీ అడిగే ప్రశ్న కూడా చిన్నది కాదు! “నువ్వు సాధారణ కస్టమర్ అయితే ఒక మాట. కానీ నీకు కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. నువ్వు చెప్పే మాట ఒక సాధారణ కస్టమర్ మాటలా ఉండదు. అది మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. మా బుకింగ్స్ పడిపోయాయి. మా వ్యాపారానికి నష్టం వచ్చింది. అందుకే నీ బాధ్యత కూడా ఎక్కువ.” అని కంపెనీ వాదించవచ్చు.

ఇక్కడ మరో పాయింట్ ఉంది. ఆమె ఒకవేళ ఆహో ఓహో సూపర్ బంపర్ ట్రెమండస్ అని రాసి ఉంటే, 15- 20 శాతం అమ్మకాలు పెరిగి ఉంటే… ఆమెకు కిరీటం పెడతారా వీళ్లు..? కనీసం థాంక్స్ కూడా చెప్పరు… ఆమె ఉన్నదున్నట్టు చెప్పింది… దట్సాల్, నాణ్యత బాగుపరుచుకోవడం మీ ఖర్మ… ఆమెని తిట్టి, ఆమెపై కేసు వేస్తే ఎలా..,? అఫ్‌కోర్స్, మన లీగల్ సిస్టం తెలుసు కదా… ఏది ఎటు కొట్టుకుపోతుందో ఎవరూ చెప్పలేరు…

మీరు ఆన్‌లైన్‌లో ఏ ప్రొడక్టయినా చూడండి, కామెంట్స్, రివ్యూస్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి, పాజిటివ్ ఆ కంపెనీ వాడు రాయించుకుంటాడు డబ్బులిచ్చి… కొనాలా వద్దానేది కస్టమర్ ఇష్టం… అంతేతప్ప నెగెటివ్ రివ్యూ ఇచ్చేసే ప్రతివాడి మీద కేసులు పెడతామంటే ఎలా..? అది నోరా మున్సిపల్ మోరా అని నిందిస్తే ఎలా..?

అన్నట్టు… కోర్టు సదరు ఎయిర్‌లైన్స్ సర్వీస్ నాణ్యత మీద, లైసెన్సుల మీద ఓ రిపోర్టును డీజీసీఏ నుంచి ఎందుకు అడగకూడదు..? అబ్బే, అత్యాశ అంటారా..? సరే, నోరా నోరే కరెక్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!
  • అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!
  • హమారా హైదరాబాద్… ఓ కొత్త ముఖం! ఐటీ, ఫార్మా దాటేసి డిఫెన్స్ హబ్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions