.
మొన్న బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్ లాంచింగ్ షోకు సూర్య, కార్తి ఇద్దరూ వచ్చారు… నాగార్జున ఏదో మాట్లాడింప చేశాడు… ఏదో టీజర్ కూడా వేసినట్టున్నారు… ప్రమోషన్ కోసం వచ్చినా ఆ ఎపిసోడ్ పెద్దగా రక్తికట్టలేదు, ఏదో తేడా కొడుతున్నట్టే అనిపించింది… ఆ ఇద్దరిలోనూ పెద్ద జోష్ కనిపించలేదు… సరే, ఓసారి చూద్దాం, ఆ సినిమా సంగతేమిటో…
‘సర్దార్ 2’.. మిషన్ పెద్దదే.. సినిమా మాత్రం ఎందుకిలా పేలవంగా…!! ఒక తండ్రి.. ఒక కొడుకు.. ఒక ప్రమాదకరమైన మిషన్.. బయోలాజికల్ వార్.. ప్రపంచాన్ని వణికించే యాంటీబయాటిక్ అపోకలిప్స్.. ఇవన్నీ వింటే సినిమా మీద ఆసక్తి కలగడం సహజం. పైగా గత సర్దార్‌లో కార్తి పోషించిన పాత్రకు వచ్చిన ఇమేజ్ కూడా ఉంది. దీంతో సర్దార్ 2పై అంచనాలు ఏర్పడతాయి. ఏర్పడ్డాయి.
Ads
కానీ సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆ అంచనాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. కథలో మాత్రం దర్శకుడు P.S. మిత్రన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. తెరపై జరుగుతున్నది మాత్రం ప్రేక్షకుడికి సీరియస్‌గా తీసుకునే అవకాశం ఇవ్వదు. అసలు సమస్య కథలో లేదు.. దాన్ని నమ్మించే విధానంలో ఉంది.
స్పై థ్రిల్లర్ అంటే ప్రేక్షకుడిని టెన్షన్‌లో ఉంచాలి. ఒక మిషన్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న ఆసక్తి ఉండాలి. హీరో ఎదుర్కొనే ప్రమాదం నిజంగానే ప్రమాదంగా అనిపించాలి. కానీ సర్దార్ 2లో ప్రమాదం ఎంత పెద్దదిగా చెప్పినా.. దాన్ని చూపించే విధానం మాత్రం చాలాసార్లు కామెడీగా మారిపోతుంది.
మొదటి భాగం ప్రారంభంలో మాత్రం కొంత ఆశ కలుగుతుంది. ‘ఏజెంట్ వాల్రస్’ కోసం జరిగే అన్వేషణ, అక్కడి నుంచి ‘మిషన్ డోకు’ వైపు కథ వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తాయి. ముఖ్యంగా కథను పక్కదారి పట్టించకుండా దర్శకుడు ఒకే మిషన్ చుట్టూ కథను నడపడం మంచి విషయమే. కానీ అదే కథ తెరపైకి వచ్చేసరికి లాజిక్‌ను ఎక్కడో విమానాశ్రయంలో వదిలేసి వచ్చినట్టుంటుంది.
జపాన్ ఎపిసోడ్ అందుకు పెద్ద ఉదాహరణ. కార్తి, మాళవిక మోహనన్ చేసే విమాన యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు అత్యంత సీరియస్‌గా చిత్రీకరించాడు. కానీ తెరపై ఆ సన్నివేశాలు కనిపించే తీరు మాత్రం నవ్వు తెప్పిస్తుంది. విమానాల నుంచి దూకడం, గాల్లో విన్యాసాలు చేయడం.. ఇవన్నీ ప్రేక్షకుడు ఉత్కంఠగా చూడాల్సిన సన్నివేశాలు. కానీ అక్కడ టెన్షన్ కంటే ‘ఇది నిజంగానే ఇలా కూడా జరుగుతుందా?’ అనే సందేహమే ఎక్కువగా వస్తుంది.
ఒక చిన్నారి ఎమోషనల్ ట్రాక్‌తో ప్రేక్షకుడిని కాస్త కదిలించాలని ప్రయత్నించారు. కానీ అది కూడా కథలో పెద్దగా ప్రభావం చూపదు. చిన్న సర్దార్‌గా కార్తి కనిపించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా గుర్తుండిపోయే స్థాయిలో లేదు. మాళవిక మోహనన్‌కు అప్పగించిన అత్యంత ప్రమాదకరమైన యంత్రాన్ని డీయాక్టివేట్ చేసే బాధ్యత కూడా ఉత్కంఠను పుట్టించలేకపోతుంది.
అంటే కథలో మిషన్ ఉంది.. కానీ మిషన్‌లో థ్రిల్ లేదు. రెండో భాగంలో.. ఒక్కో ఫ్లోర్.. ఒక్కో పజిల్.. ప్రేక్షకుడికి ఒక్కో పరీక్ష! ఇంటర్వెల్ తర్వాత సినిమా మరింత కఠిన పరీక్షగా మారుతుంది. SJ సూర్యా పాత్ర కార్తిని ‘డోకు’ను కనుక్కునే మిషన్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఒక్కో ఫ్లోర్ దాటుతూ, ఒక్కో పజిల్ పరిష్కరించుకుంటూ చివరకు ప్రమాదకరమైన యంత్రం దగ్గరకు చేరుకోవాలి.
వినడానికి బాగానే ఉంది. కానీ తెరపై చూస్తే మాత్రం వీడియో గేమ్‌లో ఒక్కో లెవల్ దాటుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కో ఫ్లోర్.. మరో సమస్య.. మరో ఫైట్.. మరో పజిల్.. ఇలా కథ ముందుకు వెళ్లాల్సింది పోయి సినిమా నడక నెమ్మదిస్తుంది. ప్రేక్షకుడికి ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అనే ఆసక్తి కంటే ‘ఇంకెన్ని ఫ్లోర్లు ఉన్నాయిరా బాబూ?’ అనే ఆలోచన మొదలవుతుంది.
ఇదంతా చాలదన్నట్టు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు వదల్లేదు. మరికొంచెం.. మరికొంచెం అంటూ సన్నివేశాలను సాగదీస్తూ పోయాడు. చివరికి SJ సూర్యా, కార్తి ఇద్దరూ.. ఒక కార్తి కాదు, ఇద్దరు కార్తీలు.. ఇలా ఆకాశంలో జరిగే అంతులేని ఫైట్‌తో సినిమా ముగింపు దశకు చేరుతుంది. అక్కడికి వచ్చేసరికి ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి కంటే సినిమా ఎప్పుడు అయిపోతుందా? అన్న ఆత్రుతే ఎక్కువ.
కార్తి ఏం చేశాడు? కార్తి తనకు ఇచ్చిన పనిని బాగానే చేశాడు. సర్దార్‌గా, అతని కొడుకుగా రెండు పాత్రల్లోనూ ఎలాంటి పెద్ద లోపం కనిపించదు. కానీ సమస్య కార్తిలో లేదు. రెండు పాత్రలు ఉన్నా.. ఒక్క పాత్రకూ గుర్తుండిపోయే సన్నివేశం ఇవ్వలేదు.
హీరో పెర్ఫార్మెన్స్‌ను ఎలివేట్ చేసే బ్లాక్ ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద లోటు. కార్తి స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా, దాన్ని ఉపయోగించుకునే స్థాయిలో సన్నివేశాలు రాయలేదు.
SJ సూర్యా సంగతి మరింత విచిత్రం. విలన్ పాత్రకు పెద్ద స్థానం ఇచ్చారు. కానీ అతని పాత్రలో కొత్తదనం కనిపించదు. అరుపులు, ఓవర్ యాక్షన్, అతిశయోక్తి.. ఇవన్నీ కలిపి విలన్‌ను భయంకరంగా కాకుండా చిరాకు తెప్పించేలా మార్చేశాయి.
మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు.. ఎవరూ పెద్దగా గుర్తుండిపోయే ప్రభావం చూపించలేకపోయారు. యోగిబాబు కామెడీ కూడా కథలో ఉపశమనం ఇవ్వలేకపోయింది. టెక్నికల్‌గా కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు
సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో సమస్య. పాటలు లేని సినిమా కావడంతో BGM చాలా కీలకం. కానీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేయడం కంటే పాతకాలపు యాక్షన్ సినిమాను గుర్తు చేస్తుంది.
జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీలో కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోయే విజువల్ లేదు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే స్థాయిలో చూపించలేకపోయారు. ఎడిటర్ విజయ్ వెలుకుట్టి కత్తెర మరికొంచెం గట్టిగా పనిచేయాల్సింది. ముఖ్యంగా రెండో భాగంలో కనీసం అరగంట సినిమా నిర్దాక్షిణ్యంగా టేబుల్ మీదే వదిలేయాల్సింది.
సీరియస్ స్పై మిషన్‌ను సీరియస్‌గా చెప్పాలనుకున్నాడు. కానీ అతిశయోక్తి యాక్షన్, లాజిక్ లేని పజిల్స్, పాత తరహా విలన్, సాగదీసిన క్లైమాక్స్.. అన్నీ కలిసి ఆ సీరియస్‌నెస్‌ను క్రమంగా కామెడీగా మార్చేశాయి. మిషన్ డోకు కదా… డోకొచ్చేలాగే… అంటే ఇది కార్తి మార్క్ టాక్సిక్ అన్నట్టుగా తీశారు… ఇది అలాగే మరో డిజాస్టర్..!!
Share this Article