.
Veerendranath Yandamoori… బ్లడ్ కేన్సర్ అంటే ఏమిటో చాలా మందికి ఇప్పటికీ తెలీదు. ‘ఫీవర్’ నవల చదివేదాకా నాకూ తెలీదు. లుకేమియా అంటే ఏమిటో, ఎలా వస్తుందో సామాన్య పాఠకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వివరాలు సేకరించి, ‘ప్రార్థన’ నవల వ్రాశాను.
మన ఎముకల లోపల ‘బోన్ మ్యారో’ (మూలుగ) అనే మృదువైన పదార్థం ఉంటుంది. రక్తకణాలు ప్రధానంగా అక్కడే తయారవుతాయి. లుకేమియా వచ్చినప్పుడు, రోగి శరీరంలోని మూలుగ అసాధారణమైన తెల్ల రక్తకణాలని అదుపు లేకుండా తయారు చేస్తుంది. దాంతో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది.
Ads
…
పిచ్చి కుక్క కాటుకి ‘వాక్సీన్’ కనుక్కున్నవాడు లూయీ పాశ్చర్. ఒక కుందేలులోకి రాబీస్ వైరస్ ఎక్కించి, ఆ కుందేలు విషాన్ని… కుక్క కాటుకి గురైన జోసెఫ్ అనే ఒక తొమ్మిదేళ్ళ కుర్రవాడికి ఎక్కించాడు. కుక్క కరిచిన జోసెఫ్‌కి రాబిస్ వ్యాధి రాలేదు.
పిచ్చి కుక్క కరిచిన తర్వాత కూడా ఏ బాధా లేకుండా బ్రతికిన ప్రపంచపు మొట్టమొదటి మనిషి జోసెఫ్. ఆ తర్వాత జోసెఫ్ పెద్దయి, పాశ్చర్ ఇన్స్టిట్యూట్కి గేట్-కీపర్ అయ్యాడు. జర్మన్ నాజీలు పారిస్ నగరాన్ని వశపరచుకుని పాశ్చర్ సమాధిని బలవంతంగా బద్దలు కొడుతున్నప్పుడు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక రకంగా ఇమ్యూనాలజీకి పాశ్చర్ పితామహుడు.
మా ఎనిమిదో క్లాస్ ఇంగ్లీష్ నాన్- డిటైల్డ్ పుస్తకంలోని వాస్తవ కథ ఇది. దీనికి ‘ప్రార్థన’ నవలలో జెన్నర్ థియరీ కలిపి వాడుకున్నాను.
…
“మన కూతురు చావుబ్రతుకుల మధ్య ఉండగా ఈ అర్థరాత్రి నేనిలా నీకు సైన్స్ పాఠాలు చెప్పటం అసంబద్ధంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం, అంటే నువ్వూ- నేనూ కలిసి తీసుకోబోయే నిర్ణయం మన చిన్నారి ప్రార్థన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ పొరపాటున ఏదయినా జరిగితే, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనం భవిష్యత్తులో మరెప్పుడూ బాధపడకూడదు. అందుకే…. ఇప్పుడే కావల్సినంత వివరంగా ఆలోచించాలి”.
ఆమె మనసు కీడు శంకించింది. బెదురుతూ అతడి వైపు చూసింది.
“ఇప్పుడు మనం కేన్సర్ అంటే ఎలా భయపడుతున్నామో, రెండు వందల సంవత్సరాల క్రితం ప్రజలు మశూచి అంటే అలా భయపడేవారు. ఆ రోజుల్లో మశూచి లక్షలాది మందిని చంపింది. ఊళ్ళో ఒకరికి వస్తే… ప్రజలు భయభ్రాంతులై మొత్తం గ్రామ౦ వదిలి వలస వెళ్లిపోయేవారు” ఆగాడు.
ఆ రోజుల్లోనే ‘కౌపాక్స్’ అనే మరో వ్యాధి కూడా ఉండేది. ఇది ప్రధానంగా పశువులకు వచ్చేది. పాలు పితికే స్త్రీలకే ఇది ఎక్కువగా సోకుతుండేది కానీ ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కొద్దిపాటి జ్వరం, శరీరంపై పొక్కులు వచ్చి తగ్గిపోయేవి. మశూచిలాగా ముఖాన్ని మచ్చలతో వికృతం చేసేది కాదు. కౌపాక్స్ వచ్చినవారికి మశూచి సోకదనే నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేది. కొంతవరకూ నిజమే కూడా” అంటూ కొనసాగించాడు.
“1796లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే వైద్యుడికి ఒక ఆలోచన వచ్చింది. కౌపాక్స్ వ్యాధి సోకినవారిని, అదే వ్యాధి- మశూచి నుంచి కాపాడుతుందేమో అనుకున్నాడు..! ఆ ఆలోచనను ప్రయోగాత్మకంగా పరీక్షించాలనుకున్నాడు..! అందుకోసం తన తోటమాలి ఎనిమిదేళ్ల కుమారుడు జేమ్స్ ఫిప్స్ను ఎంచుకున్నాడు. ఆ సమయంలో సారా నెల్మ్స్ అనే పాలు పితికే యువతికి కౌపాక్స్ సోకి౦ది. బాలుడి చేతి మీద చిన్న రంధ్రం చేసి, ఆమె చేతి పొక్కు నుంచి తీసిన ‘రసి’ని ఆ గాట్లలో ప్రవేశపెట్టాడు.
దేన్ని చూసి మనుష్యులు భయభ్రాంతులై పారిపోయేవారో, ఆ ప్రాణాంతక వ్యాధి వైరస్ నే ఎనిమిదేళ్ల బాలుడిపై ప్రయోగించాడు. ఆ రోజుల్లో ఇటువంటి ప్రయోగం ఎంతటి ప్రమాదకరమో ఊహించుకోవచ్చు.
కానీ బాలుడికి మశూచి రాలేదు! కొద్దిగా జ్వరం, నీరసం వచ్చి తగ్గిపోయాయి.
ఆవిధంగా ‘కౌపాక్స్ వైరస్’ అతడికి ‘మశూచి వైరస్’ నుంచి రక్షణ కల్పించింది! టీకాలు- అన్న పేరుతో మానవజాతిని ఒక భయంకరమైన వ్యాధి నుంచి కాపాడింది” అని క్షణం ఆగాడు.
“ఇప్పుడు చెప్పు వసుమతీ… ఒక తండ్రి తన ఎనిమిదేళ్ల కొడుకుని అప్పగించినట్టే మానవజాతిని రక్షించగల అలాంటి ప్రయోగం కోసం- బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతోన్న నీ కూతుర్ని ఇస్తావా?”
మామూలుగా వింటూన్న ఆమె, ఈ ఆఖరు ప్రశ్నతో ఉలిక్కి పడింది. గదంతా నిశ్శబ్దంగా ఉంది…. (అప్పట్లో ప్రార్థన రాయడమే ఓ సాహసం)
Share this Article