.
ఫలక్‌నుమా ప్యాలెస్ తెలుసు కదా… నిజాం రాజుల విలాసవంతమైన భవనం… అందులో సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రత్యేక అతిథితో భేటీ అయ్యాడు… ఆయన ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5 … ఇప్పటిదాకా హైదరాబాద్‌తో ప్రగాఢ అనుబంధం ఉన్న ఆగాఖాన్ తాము హైదరాబాద్ నగరాభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టులకు సాయం చేయాలని సీఎం కోరాడు… ప్రత్యేకించి మూసీ పునరుజ్జీవానికి సాయం కావాలని…! అన్నీ విన్న ఆగాఖాన్ ‘ఫ్యూచర్ సిటీ’ వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాడు… డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని రేవంత్ రెడ్డి కోరాడు…
అసలు ఈ ఆగాఖాన్–5 ఆయన ఎవరు? ఏ దేశానికి చెందినవారు? ఏం చేస్తుంటారు? తెలంగాణ సీఎం ఆయనను అంత ప్రత్యేకంగా ఎందుకు కలిశాడు? హైదరాబాద్‌తో ఆగాఖాన్ బంధం తెలిస్తే అసలు కథ అర్థమవుతుంది!
Ads
ఆగాఖాన్–5 అసలు పేరు ప్రిన్స్ రహీమ్ అల్-హుస్సేనీ… 1971 అక్టోబర్ 12న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించారు. ఆయన తండ్రి కరీమ్ అల్-హుస్సేనీ ఆగాఖాన్–4. 2025 ఫిబ్రవరిలో తండ్రి మరణం తర్వాత రహీమ్ ఆగాఖాన్–5గా బాధ్యతలు స్వీకరించారు… నిజారీ ఇస్మాయిలీ షియా ముస్లింలకు ఆయన 50వ ఇమామ్.
అయితే ఇక్కడే ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆగాఖాన్ అంటే కేవలం మత నాయకుడు కాదు. ఆయన ఆధ్వర్యంలోని Aga Khan Development Network ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, మహిళల సాధికారత, పర్యావరణం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో పనిచేస్తోంది.
అంటే ఆగాఖాన్‌తో ఓ ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అది కేవలం మతపరమైన వ్యవహారం కాదు. అభివృద్ధి, పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, హెరిటేజ్, పట్టణాభివృద్ధి వంటి అనేక అంశాలపై అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో మాట్లాడటం. ఇప్పుడు హైదరాబాద్‌లోకి వచ్చేద్దాం.

ఆగాఖాన్ కుటుంబానికి హైదరాబాద్‌తో ఉన్న బంధం కొత్తది కాదు. దానికి నిలువెత్తు ఉదాహరణ కుతుబ్‌షాహీ టూంబ్స్. గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ రాజుల సమాధుల సముదాయం ఇది. చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. కానీ కాలక్రమంలో నిర్లక్ష్యం కూడా వచ్చింది. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ రంగంలోకి దిగింది.
కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణలో భాగంగా సమాధులతో పాటు పరిసర ప్రాంతం, పురాతన బావులు, నీటి వ్యవస్థలు, ఉద్యానవనాలు, ఇతర చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరించారు. అంటే… “పాత కట్టడానికి కొత్త రంగు” కాదు.

చరిత్రను అర్థం చేసుకుని, దాని అసలు స్వరూపాన్ని సాధ్యమైనంతవరకు తిరిగి తీసుకురావడం. ఆ పనికి అంతర్జాతీయ గుర్తింపూ వచ్చింది. పురాతన బావుల పునరుద్ధరణకు UNESCO Asia-Pacific Heritage Conservation Award కూడా లభించింది.
ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం…. కుతుబ్‌షాహీ టూంబ్స్ నిర్వహణ, సంరక్షణలో కూడా Aga Khan Trust for Culture భాగస్వామ్యం కొనసాగుతోంది. అంటే హైదరాబాద్‌తో ఆగాఖాన్ అనుబంధం ఫోటోలకు, సభలకు మాత్రమే పరిమితం కాలేదు. నగర చరిత్రను కాపాడే పని కూడా ఉంది. ఈ ఫౌండేషన్ సాయంతో పునర్నిర్మించిన శాసనమండలి కొత్త భవనాన్ని ఈమధ్యే రేవంత్ రెడ్డి ప్రారంభించాడు…
100 ఎకరాల విస్తీర్ణంలో ఆగాఖాన్ అకాడమీ కూడా 2013లో ఏర్పాటైంది… ఇప్పుడు రేవంత్‌రెడ్డి తనను ఎందుకు కలిశాడో అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ముఖ్యమంత్రి ఆగాఖాన్–5తో భేటీలో మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్ హెరిటేజ్ పరిరక్షణ అంశాలను ప్రస్తావించాడు… మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలైన సిటీ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వంటి నిర్మాణాల పునరుద్ధరణలో Aga Khan సంస్థల సహకారం కావాలని కోరాడు…
ఇది చూస్తే రేవంత్ ఆలోచనలో మూసీ కేవలం నది కాదని అర్థమవుతుంది. మూసీని అభివృద్ధి చేయడం అంటే నదిని శుభ్రం చేయడం, దాని పక్కన రోడ్లు వేయడం మాత్రమే కాదు. మూసీ ఒడ్డున ఉన్న హైదరాబాద్ చరిత్రను కూడా తిరిగి వెలుగులోకి తీసుకురావడం. నిజాం కాలం నాటి భవనాలు… వంతెనలు… విద్యాసంస్థలు… ఆసుపత్రులు… రాజభవనాలు… పాత నగర నిర్మాణాలు… ఇవన్నీ ఒకే హెరిటేజ్ కథలో భాగం.
అందుకే కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను విజయవంతంగా పునరుద్ధరించిన సంస్థల అనుభవాన్ని మూసీపైకి తీసుకురావాలన్న ఆలోచన ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక మరో వైపు… ఫ్యూచర్ సిటీ!
డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న Telangana Rising Global Summitకు కూడా ఆగాఖాన్–5ను రేవంత్ ఆహ్వానించాడు. ఇక్కడే ఈ మొత్తం కథలో ఓ చక్కటి వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు కుతుబ్‌షాహీ టూంబ్స్… మరోవైపు ఫ్యూచర్ సిటీ. ఒకటి నాలుగు శతాబ్దాల హైదరాబాద్‌కు గుర్తు. మరొకటి రాబోయే హైదరాబాద్‌కు కల.
ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఆగాఖాన్–5 కనిపిస్తున్నారు. గతాన్ని కాపాడటంలో అనుభవం ఉన్న సంస్థ… భవిష్యత్తు నగర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం… మధ్యలో మూసీ. అందుకే ఆగాఖాన్–5 ప్రస్తుత హైదరాబాద్ పర్యటనను సాధారణ ప్రోటోకాల్ భేటీగా తీసిపారేయాల్సిన అవసరం లేదు.
గవర్నర్‌తో విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి గురించి చర్చలు… ముఖ్యమంత్రితో మూసీ, హెరిటేజ్ భవనాల పునరుద్ధరణ గురించి చర్చలు… ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం… ఇదంతా కలిపి చూస్తే హైదరాబాద్‌కు ఆగాఖాన్‌తో సంబంధం మరో దశలోకి వెళ్తున్నట్టే కనిపిస్తోంది.
కుతుబ్‌షాహీల సమాధుల నుంచి మొదలైన కథ… మూసీ ఒడ్డున ఉన్న చారిత్రక భవనాల దాకా వస్తుందా? అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వెళ్తుందా? హైదరాబాద్ చరిత్రను కాపాడటానికి వచ్చిన ఆగాఖాన్ సంస్థలు… ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తును తీర్చిదిద్దే కథలోనూ భాగమవుతాయా? అదే అసలు చూడాల్సిన విషయం.
Share this Article