.
Ashok Kumar Vemulapalli …. చిన్నారి పెళ్లి పేరుతో వీసా కోసం కక్కుర్తి.. విదేశాల్లో భారతీయుల పరువు తీస్తున్న కామాంధులు! 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన 41 ఏళ్ల భారతీయుడికి బ్రిటన్ కోర్టు జైలు శిక్ష
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడుతున్న భారతీయులు ఎంతోమంది ఉన్నారు. తమ ప్రతిభతో దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న వారు ఒకవైపు ఉంటే.. కొందరు వ్యక్తులు చేసే నేరాలు మాత్రం దేశం మొత్తానికే తలవంపులు తెస్తున్నాయి.
Ads
బ్రిటన్‌లో చోటుచేసుకున్న తాజా ఘటన దీనికి మరో ఉదాహరణ. 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం… భారతదేశానికి చెందిన 41 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థి విజయ్ ముండ్రాతి.. బ్రిటన్‌లో తన వీసా గడువు ముగిసిన నేపథ్యంలో అక్కడే ఉండేందుకు ఓ 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
ఫేస్‌బుక్ ద్వారా బాలికను సంప్రదించిన అతడు.. ఆమెతో లైంగిక స్వభావం ఉన్న సంభాషణలు జరిపాడు. బరిబాతల స్నానం చేస్తున్న వీడియోలను పంపడంతో పాటు, బాలిక కుటుంబ సభ్యుల గురించి కూడా అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగాడు.
అయితే, అతను మాట్లాడుతున్నది నిజమైన బాలిక కాదు. నేరాలను వెలికితీసేందుకు నిఘా బృందం ఏర్పాటు చేసిన డీకాయ్. బాలికను కలిసేందుకు డాన్‌కాస్టర్‌కు వెళ్లిన ముండ్రాతి.. నిఘా బృందానికి చిక్కాడు. అతని వద్ద ప్రోసెక్కో మద్యం, ఉంగరాలు, పాస్‌పోర్ట్ లభించాయి.
మరో ముగ్గురు 14 ఏళ్ల బాలికలుగా భావించిన డీకాయ్ వ్యక్తులతోనూ లైంగిక సంభాషణలు జరిపినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ముండ్రాతికి 3 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు, జీవితాంతం లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
వీసా కోసం విలువలు మరిచిపోతున్నారా? విదేశాల్లో ఉండేందుకు వీసా అవసరం కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. భవిష్యత్తుపై ఆందోళనలు ఉండొచ్చు. కానీ అందుకోసం చిన్నారుల జీవితాలను, వారి భద్రతను, వారి బాల్యాన్ని బలిపెట్టే హక్కు ఎవరికీ లేదు.
వీసా గడువు ముగిసిందని.. బ్రిటన్‌లో ఉండేందుకు అవకాశం లేదని.. ఓ చిన్నారిని పెళ్లి చేసుకోవాలని ఆలోచించడం ఎంతటి దారుణం? విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ విదేశాలకు వెళ్లిన తర్వాత చట్టాలను ఉల్లంఘించడం, చిన్నారులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మానవత్వాన్ని మరిచిపోవడం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరినీ ఒకే కోణంలో చూడకూడదు. ఎంతోమంది నిజాయితీగా జీవిస్తూ, తమ కుటుంబాలను ఆదుకుంటూ, భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. అయితే, నేరాలకు పాల్పడే కొందరి చర్యలు భారతీయ సమాజంపై ప్రతికూల ముద్ర పడేలా చేస్తున్నాయి.
దేశం పేరు మన చేతుల్లోనే ఉంటుంది. విదేశాలకు వెళ్లినా.. మన విలువలు, చట్టాల పట్ల గౌరవం, మానవత్వం మాత్రం మనతోనే ఉండాలి.
అమెరికాలోనూ తెలుగు వ్యక్తి అరెస్ట్
ఇలాంటి ఘటనలు బ్రిటన్‌కే పరిమితం కాలేదు. అమెరికాలోనూ మైనర్ బాలికలతో ఆన్‌లైన్‌లో అసభ్యకర సంభాషణలు జరుపుతూ తెలుగు వ్యక్తులు పోలీసులకు చిక్కిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
2025లో జార్జియాలో ‘ఆపరేషన్ ఫాంటమ్ విస్పర్’ … అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో 2025లో నిర్వహించిన ‘ఆపరేషన్ ఫాంటమ్ విస్పర్’లో గోగిరెడ్డి సుధాకర్ (34) అనే తెలుగు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు డీకాయ్ ఆపరేషన్ నిర్వహించి, మైనర్ బాలికలుగా నటిస్తూ ఆన్‌లైన్‌లో నిందితులతో సంభాషణలు జరిపారు. మైనర్‌ను లైంగికంగా కలుసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సుధాకర్ సహా 12 మందిని అరెస్ట్ చేశారు..
2026లో న్యూ మెక్సికోలోని శాంటా ఫేలో నాగరాజు బల్కం (26) అనే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కూడా ఆన్‌లైన్ చైల్డ్ ప్రెడేటర్ ఆపరేషన్‌లో అరెస్ట్ అయ్యారు..అతనిపై మైనర్‌ను లైంగికంగా సంప్రదించేందుకు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి.
చివరగా ఒక ప్రశ్న … విదేశాల్లో సంపాదించేది డబ్బు మాత్రమే కాదు.. మన ప్రవర్తన ద్వారా మన దేశానికి వచ్చే గౌరవం కూడా. వీసా కోసం చిన్నారుల జీవితాలతో చెలగాటమా? డబ్బు కోసం మానవత్వాన్ని మరిచిపోవడమా? విదేశాలకు వెళ్లండి.. ఎదగండి.. కానీ మీ ప్రవర్తనతో భారతదేశానికి గౌరవం తీసుకురండి… అశోక్ వేములపల్లి
Share this Article