.
విదేశీ ట్రిప్ కోసం భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు పోలీసులకే చిక్కి కటకటాలపాలైన వైనం! ‘భార్యకు తెలియకుండా ఏ పనైనా చేయొచ్చు కానీ, అడ్డంగా దొరికిపోతే మాత్రం భూమి బద్దలైనట్టే’ అంటాడు ఒక పెద్దాయన. సరిగ్గా ఇదే సూత్రాన్ని నిజం చేశాడు పూణేకు చెందిన ఓ కేటుగాడు వ్యాపారి.
ప్రియురాలితో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని వేసిన ప్లాన్ కాస్తా బెడిసికొట్టి, చివరకు భార్యకు, పోలీసులకు దొరికిపోయిన ఈ సినిమా స్టోరీ లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Ads
మలేషియా ట్రిప్.. మధ్యలోనే ట్విస్ట్! పూణేకు చెందిన ఆ వ్యాపారికి (46) ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఎలాగైనా ఆమెతో కలిసి విదేశీ గడ్డపై కొన్ని రోజులు ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని భావించాడు. ఇంట్లో మాత్రం బిజినెస్ పని మీద మలేషియా (కౌలాలంపూర్) వెళ్తున్నానని చెప్పి, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చక్కగా చేరుకున్నాడు. ముందే అనుకున్నట్లుగా ఎయిర్‌పోర్ట్‌లో ప్రియురాలు కూడా వచ్చి కలిసింది. ఇద్దరూ కలిసి టికెట్లు తీసుకుని ఇమిగ్రేషన్ చెకింగ్ కౌంటర్ వైపు అడుగులు వేశారు.
కానీ అసలు ట్విస్ట్ అక్కడే తగిలింది! ఆ మహిళ గతంలో తను పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేసిన పాత పాస్‌పోర్ట్‌ను తీసుకురావడంతో ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. పాస్‌పోర్ట్‌లో లోపాలున్నాయని తేల్చి వారి ప్రయాణాన్ని అడ్డుకున్నారు.
కిడ్నాప్ డ్రామా తెరపైకి… మస్తు ప్లాన్ చేసిన విదేశీ ట్రిప్ కాస్తా క్యాన్సిల్ కావడంతో ఆ వ్యాపారికి చెమటలు పట్టాయి. ఈ విషయం ప్రియురాలితో బయటకు వస్తే పరువు పోతుందని, ఒకవేళ ఇంటికి వెళ్తే భార్య నిలదీస్తుందని భయపడ్డాడు. వెంటనే తన బ్రెయిన్‌కు పదును పెట్టి ఒక అబద్ధం అల్లాడు. నేరుగా భార్యకు వాట్సాప్ కాల్ చేసి.. “నన్ను ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు, నా ఫోన్ సీజ్ చేశారు.. రెండ్రోజుల్లో సమస్య సర్దుమనుకుంటుంది” అని నమ్మించాడు. ఆ తర్వాత ప్రియురాలితో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి ముంబైలోని ఓ హోటల్‌కు చెక్కేశాడు.
భార్య ఎంట్రీతో అసలు నాటకం బట్టబయలు! భర్త చెప్పింది నిజమేనని నమ్మిన ఆ భార్య.. రెండు రోజులు ప్రశాంతంగానే ఉంది. కానీ, మూడు రోజులు గడిచినా భర్త నుంచి ఫోన్ రాకపోవడం, ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏదో జరిగిపోయిందని కంగారుపడిపోయిన ఆమె.. ఏకంగా ముంబైలోని సాహర్ పోలీసులను ఆశ్రయించింది. “నా భర్తను ఎవరో కిడ్నాప్ చేశారు, వెంటనే వెతకండి” అంటూ కన్నీళ్లతో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. అసలు సినిమా బయటపడింది.
సీన్ కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్లో రగడ! సీసీటీవీ రికార్డుల్లో ఆ వ్యాపారిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఓ మహిళతో కలిసి సంతోషంగా కారులో వెళ్తున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టి, ఆ హోటల్లో ప్రియురాలితో రొమాంటిక్‌గా గడుపుతున్న ఆ కేటుగాడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసులు విచారించడంతో తాను ప్రియురాలితో వెళ్లాలనుకున్న మాట వాస్తవమేనని, ప్రయాణం రద్దయి భయంతోనే ఈ డ్రామా ఆడానని ఒప్పుకున్నాడు. అయితే, ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో ఆమె ఒక్కసారిగా అపర కాళికలా మారిపోయిందని, ప్రస్తుతం కుటుంబంలో పెద్ద రగడే నడుస్తోందని పోలీసులు తెలిపారు. మొత్తానికి, ప్రియురాలితో రొమాన్స్ చేద్దామని వెళ్లిన ఆ వ్యాపారికి పోలీసుల దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి!
Share this Article