.
అమెరికా అలర్ట్.. సౌదీపై హుతీల దాడులు.. టర్కీ ఎంట్రీ.. రష్యా–ఉక్రెయిన్ మంటలు.. ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల మధ్య?
ప్రపంచం మొత్తం ఒకేసారి యుద్ధంలోకి వెళ్లిపోతోందా? మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ఇప్పుడీ ప్రశ్నలు మీడియాలో వినిపిస్తున్నాయి. కారణం లేకుండా కాదు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో హుతీలు–సౌదీ మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తోంది.
Ads
మరోవైపు సౌదీకి అవసరమైతే సైనికంగా అండగా నిలుస్తామని టర్కీ ప్రకటించింది. పాకిస్థాన్ కూడా అదే రక్షణ ఒప్పందంలో భాగస్వామి. ఇంకోవైపు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. యూరప్ సరిహద్దుల వరకూ డ్రోన్లు, సైబర్ దాడులు, సబోటేజ్ ఆరోపణలు చేరుతున్నాయి.
ఇవన్నీ జరుగుతుండగానే అమెరికా తన పౌరులకు మధ్యప్రాచ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అంటే ప్రపంచం ఇప్పుడున్న ఆందోళన ఒక్క యుద్ధం గురించి కాదు. ఒక యుద్ధం మరో దేశాన్ని, ఆ దేశం మరో మిత్రదేశాన్ని లాగుకుంటూ వెళ్లే తీవ్ర పరిస్థితి గురించే!
సౌదీపై హుతీల దాడులు.. ఇక విషయం సీరియస్!
యెమెన్‌కు చెందిన హుతీలు సౌదీ అరేబియాపై దాడులను పెంచారు. రియాద్‌లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు హుతీలు ప్రకటించగా, సౌదీ భద్రతా దళాలు వాటిని అడ్డుకున్నట్లు తెలిపాయి. రియాద్ విమానాశ్రయం సమీపంలో మంటలు, పొగ కనిపించడంతో పరిస్థితి తీవ్రత బయటపడింది.
ఇది కేవలం సరిహద్దు ఘర్షణ కాదు. హుతీలు ఇప్పటికే సౌదీపై నౌకా దిగ్బంధాన్ని ప్రకటించారు. నగరాలు, ఇంధన మౌలిక వసతులు, సముద్ర రవాణా మార్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సౌదీ చమురు మౌలిక వ్యవస్థకు ఏదైనా పెద్ద నష్టం జరిగితే దాని ప్రభావం సౌదీకి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ చమురు సరఫరాపైనా పడుతుంది.
ఇక్కడే టర్కీ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే! సౌదీకి టర్కీ ఇప్పుడు కీలకంగా మారింది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ ఇటీవల మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఇందులో ఒక దేశంపై సాయుధ దాడిని మిగిలిన సభ్యులపై దాడిగా పరిగణించే నిబంధన ఉంది.
ఇప్పుడు హుతీల దాడులు పెరగడంతో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్.. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు టర్కీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు. అయితే పాకిస్థాన్ విషయంలో ఇప్పటివరకు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 10న ఇస్లామాబాద్ నుంచి వెంటనే సైనిక చర్యపై చర్చ జరగలేదని స్పష్టీకరణ వచ్చింది.
అంటే ఒప్పందం ఉంది. టర్కీ సహాయానికి సిద్ధమని చెబుతోంది. కానీ పాకిస్థాన్ ప్రత్యక్ష సైనిక జోక్యానికి వెళ్లిందని చెప్పే పరిస్థితి ఇంకా లేదు. అయినా హుతీలు మాత్రం టర్కీ, పాకిస్థాన్‌లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ఇదే ఇప్పుడు మధ్యప్రాచ్య పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతోంది. ఒకవైపు హుతీలు.. మరోవైపు సౌదీ.. వెనుక ఇరాన్! హుతీలకు ఇరాన్ మద్దతు ఉందన్నది అంతర్జాతీయంగా విస్తృతంగా నమోదైన విషయం. అందుకే సౌదీ– హుతీ ఘర్షణను కేవలం యెమెన్– సౌదీ సమస్యగా చూడటం కష్టం.
ఒకవైపు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హుతీలు. మరోవైపు సౌదీ. సౌదీకి ఇప్పుడు టర్కీ, పాకిస్థాన్‌లతో కొత్త రక్షణ భాగస్వామ్యం. అమెరికా ప్రయోజనాలు కూడా ఈ ప్రాంతంలో ముడిపడి ఉన్నాయి. ఇదే అసలు భయం.
ఒక దేశంపై జరిగిన దాడి కారణంగా మిత్రదేశం రంగంలోకి వస్తే.. ఆ మిత్రదేశంపై మరో పక్షం దాడి చేస్తే.. దానికి ఇంకో దేశం స్పందిస్తే.. చిన్న ప్రాంతీయ యుద్ధం ఒక్కసారిగా అంతర్జాతీయ సంక్షోభంగా మారిపోవచ్చు.
అమెరికా అలర్ట్ ఎందుకు? ఇదే సమయంలో అమెరికా కూడా తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణ నిర్ణయాలను పునఃపరిశీలించాలని సూచించింది. గగనతలాల మూసివేతలు, విమానాల రద్దు వంటి పరిణామాలు కూడా వేగంగా మారవచ్చని హెచ్చరికలలో పేర్కొంది.
అమెరికా అలర్ట్ అంటే రేపే ప్రపంచ యుద్ధం వస్తుందన్న అర్థం కాదు. కానీ పరిస్థితి ఎటు వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేని స్థితి వచ్చిందన్న సంకేతం మాత్రం.
ఇక రష్యా–ఉక్రెయిన్.. మరో మంట… మధ్యప్రాచ్యం మాత్రమే కాదు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంది. ఇటీవలి రోజుల్లో ఇరు దేశాలు పరస్పరం ఇంధన, మౌలిక వసతులపై దాడులు కొనసాగించాయి. రష్యా ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై దాడులు చేస్తుండగా, ఉక్రెయిన్ రష్యా చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది.
ఇక్కడ మరో ప్రమాదం ఏమిటంటే.. ఈ యుద్ధ ప్రభావం ఉక్రెయిన్ సరిహద్దులను దాటుతోంది. పోలాండ్ ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచుతోంది. రష్యా డ్రోన్లకు సంబంధించిన ఘటనల నేపథ్యంలో సరిహద్దు మౌలిక వసతులను బలోపేతం చేస్తోంది.
యూరప్‌లో రష్యా సైబర్ దాడులు, డ్రోన్ చొరబాట్లు, సబోటేజ్ వంటి హైబ్రిడ్ ముప్పులపై కూడా ఆందోళన పెరుగుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మరి ప్రపంచం ఎందుకు భయపడుతోంది?
ఎందుకంటే ఈసారి సమస్య ఒక యుద్ధం కాదు.. అనేక యుద్ధాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి. ఇక ఎక్కడైనా NATO దేశం నేరుగా రష్యాతో ఢీకొంటే.. పరిస్థితి మరో స్థాయికి వెళ్తుంది. అమెరికా ప్రకటించిన అలర్ట్ ఏవో కొత్త ప్రమాద సంకేతాలను ఇస్తోంది..!!
Share this Article