.
అలల సవ్వడిలో ‘మురి మిక్చర్’ కబుర్లు…. By Srinivas Ganjivarapu…
సముద్రం అంటే అలలు, ఇసుక తిన్నెలతో పాటు.. ఎన్నో జీవితాలు, మరెన్నో సంస్కృతులు వచ్చి కలిసే ఒక విశాల తీరం. తూర్పు కనుమలు కలిసే విశాఖ సాగర తీరంలో సాయంత్రమైతే, ఒక అనిర్వచనీయమైన అనుభూతి ‘మురి మిక్చర్’.
పచ్చి ఉల్లిపాయ ఘాటు, నిమ్మరసం పులుపు, వేయించిన పల్లీల కరకర… వీటన్నింటి కలబోతగా పేపర్ కోన్‌లో చేతికందే ఈ స్నాక్ వైజాగ్ గుండెచప్పుడుగా ఎప్పుడో మారిపోయింది.
ఈ రుచి వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. 1960, 70ల కాలంలో వైజాగ్ పోర్టు, హిందుస్థాన్ షిప్‌యార్డ్, విశాఖ ఉక్కు కర్మాగారం ఊపిరిపోసుకుంటున్న వేళ… పనుల కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుండి వేలాదిగా కార్మికులు ఇక్కడికి వలస వచ్చారు.
Ads
పొట్టచేతబట్టుకుని వచ్చిన ఆ చేతులు, తమతో పాటు కోల్‌కతా వీధుల్లోని ‘ఝాల్ముడి’ సంస్కృతినీ మోసుకొచ్చాయి. ఒడియాలో మరమరాలను ‘ముడి’ అంటారు. స్థానిక తెలుగు యాసలో ఆ పదం నెమ్మదిగా ఒదిగిపోయి, ముద్దుగా ‘ముర్రీలు’గా రూపాంతరం చెందింది. అలా పరాయి నేల నుంచి వచ్చిన ఒక చిరుతిండి, విశాఖ నేల స్వభావాన్ని ఒంటబట్టించుకుంది.
1980ల నాటికి ఆర్కే బీచ్ నగరానికి వినోద కేంద్రంగా ఎదుగుతున్న క్రమంలో, తోపుడు బండ్లు, బుట్టలపై మురి మిక్చర్ వ్యాపారం జోరందుకుంది.
1990ల సమయానికి కోస్తా జిల్లాల్లో ఒకప్పుడు ఒక ఊపుఊపిన అటుకులతో చేసిన ‘పిడత కింద పప్పు’ నెమ్మదిగా తెరమరుగవుతున్న దశకు చేరింది… అటు కోస్తా, ఇటు తూర్పు తీర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వైజాగ్ చేరిన ఎందరో చిన్న వ్యాపారులకు, చిరుతిండి ప్రేమికులకు ఈ మరమరాల మిక్చర్ ఒక కొత్త రుచిని.. ఆశను, జీవనోపాధిని ఇచ్చింది.

ధర చవక, కడుపునకు తేలిక. బియ్యపు మరమరాలు, సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కరకరలాడే పల్లీలు, బూందీ, చిటికెడు కారం… వీటన్నింటిపై చివరగా పిండే తాజా నిమ్మరసం. ఆ రేకు గిన్నెలో గరిటెతో ‘టకటకా’ తిప్పుతూ చేసే ఆ లయబద్ధమైన శబ్దం వింటుంటేనే నోట్లో నీళ్లూరుతాయి. పులుపు, కారం, క్రంచీ కలగలిసిన ఆ రుచి… సాయంత్రపు సముద్రపు చల్లగాలిలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఒక అమృతంలా అనిపించింది.
ఆర్కే బీచ్ నుంచి ఋషికొండ వరకూ… గట్టున కూర్చుని అలలను చూస్తూ కాలేజీ మిత్రుల కబుర్లు, కుటుంబాల సరదా సాయంత్రాలు, ప్రేమికుల మౌనాలు… అన్నీ ఆ పేపర్ కోన్‌తో ముడిపడిపోయాయి. విదేశాల్లోనో, దూరపు నగరాల్లోనో స్థిరపడిన వైజాగ్ వాసులు ఎప్పుడు సొంత ఊరికి వచ్చినా, స్నేహితులతో కలిసి బీచ్ రోడ్డులో మురి మిక్చర్ తినకపోతే వాళ్ల ప్రయాణం అసంపూర్ణమే. ఆ గిన్నె శబ్దం విశాఖలో కొందరి అస్తిత్వపు సంగీతం అయిపోయింది.
ఆర్కే బీచ్ తీరం వెంబడి నడుస్తుంటే… ఈ మురి మిక్చర్ బడ్డీలకు కాస్త దూరంగా, అలలు ఎగసిపడే చోట చీకటి నీడల్లో కొన్ని పాత శిథిల నిర్మాణాలు కనిపిస్తాయి. అలల తాకిడికి కరిగిపోతూ, నిశ్శబ్దంగా నిలబడ్డ ఆ రాళ్లు ఎన్నో తరాల జ్ఞాపకాలను, సాగరపు గుసగుసలను తమలో దాచుకున్నాయి. చెప్పడానికి వాటి దగ్గర బోలెడన్ని తీపి, చేదు ఊసులున్నాయి… వాటన్నింటినీ నెమ్మదిగా, ఒక్కొక్కటిగా విప్పుకుంటూ చెప్పుకోవాలి …
Share this Article