.
వయస్సు 75 ఏళ్లు… శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజినీకాంత్ ఇంకా రొటీన్ మూస ఫార్ములా సినిమాలు చేస్తూనే ఉన్నాడు… మరీ బాగుండదు అనుకుని కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ లుక్… తను ఒక్కడే సరిపోవడం లేదు, చాలామంది తారల్ని అతిథి పాత్రలుగా తెచ్చి, అదనపు మెరుపుల్లా అద్దాలనీ అనుకున్నాడు… ప్చ్, ఇంతా చేస్తే జైలర్-2 సో సో యావరేజ్ సినిమా అయిపోయింది తప్ప, ‘ఇదిరా రజినీకాంత్ సినిమా’ అని ఈలలేసే పాత రజినీ సినిమా కాలేకపోయింది…
ఒకరా, ఇద్దరా… చాలామంది వస్తుంటారు, పోతుంటారు… కానీ రజినీకాంత్ సినిమా కదా… తనే సినిమా స్క్రీన్‌ను భారీగా ఆక్రమించాడు సహజంగానే, ఎప్పటిలాగే… తనే మోశాడు… తప్పదు కదా, మరి సౌత్ స్టార్ హీరో అంటేనేే ఎవరినీ కనిపించనివ్వకూడదు కదా… అదే బాడీ లాంగ్వేజీ, అవే రజినీకాంత్ మేనరిజమ్స్… కథ కూడా అంతేగా… అన్నీ వదిలి ప్రశాంతంగా బతుకుతూ ఉంటే విలన్ గాడు బతకనివ్వడు, పాత హీరోను గోకి మరీ బయటికి తీసుకొస్తాడు…
Ads
వయసు మీద పడింది కదా యాక్షన్ సీన్లలో మరీ చురుకైన కదలికలు, ప్రయాసలు లేకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భలే మేనేజ్ చేశాడు… రజినీకాంత్‌ను అంతగా కష్టపెట్టలేదు పాపం…
హృతిక్ రోషన్, శివన్న, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్… వీళ్లంతా కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల కోసం అలా వచ్చిపోతారన్నమాట… మరి పాన్ ఇండియా మార్కెట్ కావాలి కదా… రమ్యకృష్ణ, రజినీకాంత్‌లను తెలుగు ప్రేక్షకులు తమ నటులే అనుకుంటారు కాబట్టి, ఏ మోహన్బాబునో పట్టుకురాలేదు… ఈ పాత్రలన్నీ కృత్రిమంగా ఇరికించినట్టుగా ఉండి, కౌంటర్ ప్రొడక్ట్ అనిపిస్తాయి… విద్యాబాలన్ కూడా ఉంది, ఈ పాత్ర పర్లేదు…

చిత్రం గురించి…? ‘జైలర్ 2’ మొదటి సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ప్రారంభమవుతుంది… మొదటి భాగం తర్వాత ముత్తువేల్ పాండియన్ కుటుంబం చుట్టూ ముసురుకున్న కొత్త సమస్యలు, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ…
రజినీకాంత్ నటన గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏముంటుంది..? కాకలు తీరిన నటుడు… అలవోకగా చేసుకుంటూ పోయాడు, మంచినీళ్లు తాగినంత సులభంగా… మొదటి భాగం లాగే, ఇందులో కూడా యాక్షన్ సన్నివేశాలు శృతిమించకుండా, సులభమైన స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా తన వీర ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి… పక్కా కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్ సినిమా అంతా…
ఈమధ్య ప్రతి సినిమాకూ చెప్పుకుంటున్నాం కదా దాదాపుగా… ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు తడబడ్డాడు అని… సేమ్, ఇందులో కూడా… ఫస్టాఫ్ సరదాసరదాగా సాగి, సెకండాఫ్‌లో బోర్ కొట్టేస్తుంది… రజినీ పాత్ర చుట్టూ మూర్తి ట్రాక్, యోగిబాబు ట్రాక్ కామెడీపరంగా బాగానే కుదిరాయి… బ్రిడ్జ్, హోటల్ ఫైట్ సీక్వెన్స్‌లు కూడా బాగానే తీశారు…
సెకండాఫ్ కూడా ఇలాగే సాగిపోతే బాగుండేది… కానీ లేదు… ఎస్.జె. సూర్య, ఆయన కుటుంబానికి సంబంధించిన విలన్ ట్రాక్ కథలో సహజంగా కలవలేదు… బలవంతంగా చొప్పించిన భావోద్వేగ సన్నివేశాలు సినిమాను మరింత వెనక్కిలాగాయి… సో, మంచి స్టార్టింగ్, పేలవమైన ముగింపు…
వీక్ సెకండాఫ్, పెద్దగా రక్తికట్టని ఎమోషన్స్, పసలేని కామియోలు సినిమా స్థాయిని తగ్గించాయి… మరీ రజినీకాంత్ ఫ్యాన్లయితే ఓసారి థియేటర్ వెళ్లి చూడొచ్చునేమో… ఓటీటీలోకి వచ్చేదాకా ఆగినా ఫరక్ పడదు… రజినీకాంత్ సినిమా కదా, అనిరుధ్ బీజీఎం బాగానే ఉంది… అంటే, మరీ అదిరిపోయేలా లేదు, కానీ మాస్ సీన్లకు సరిపోయింది…!!
- అతడు సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్… అన్ని సుమోలు ఎందుకురా బుజ్జా… అవును, ఇన్ని కామియోలు దేనికిరా బుజ్జా..!!
Share this Article