.
Murali Buddha …. చాలా ఏళ్ళ తర్వాత అటు వైపు వెళ్ళాను. మూడు దశాబ్దాల క్రితం అక్కడికి ప్రతి రోజూ వెళ్ళేవాడిని … గంటల తరబడి అక్కడ గడిపాను … ఇక్కడి నుంచే చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. ఒకప్పుడు అది అధికార కేంద్రం. ఇప్పుడు వచ్చి పోయే రోగులతో కిటకిటలాడుతుంది.
ఇప్పుడు హైదర్ గూడాలో అపోలో ఆస్పత్రి ఉన్న ప్రాంతంలో ఓ నవాబు భవనం. టీడీపీ కార్యాలయం తొలుత హిమాయత్ నగర్ లో ఉండేది. 95 ఆగస్టులో ఎన్టీఆర్ ను దించేశాక పార్టీ అధ్యక్ష పదవి , సీఎం పదవి, బ్యాంకులో పార్టీ పేరు మీద ఉన్న డిపాజిట్లు, అన్నింటిని హస్తగతం చేసుకున్న బాబు హిమాయత్ నగర్ లోని టీడీపీ అద్దె భవనాన్ని మాత్రం వదిలేశారు.
Ads
ఇది ఒక నవాబు భవనం టీడీపీ అద్దెకు తీసుకుంది. ఆ నవాబు టీడీపీ నాయకుడు కూడా. హిమాయత్ నగర్ నుంచి అరకిలో మీటర్ దూరంలో వీరిదే ఇంకో భవనం హైదర్ గూడలో ఉండేది. బాబు నాయకత్వంలోని టీడీపీ ఆ భవనం తీసుకున్నారు. పాత జ్ఞాపకాల పుస్తకంలో ఆ భవనం ఫోటో ఉంటే బాగుంటుంది అని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అటు వెళితే ఆ లైన్ లో రెండు పాతబడిన భవనాలు కనిపించాయి.
అందులో ఒకటి టీడీపీ ఆఫీస్ అయి ఉంటుంది అనుకొని విచారిస్తే, పాడుపడిన భవనం పక్కన ఉన్న అపోలో ఆస్పత్రి నిర్మించిన ప్రాంతమే అప్పటి టీడీపీ భవనం అని తెలిసింది. అక్కడ ఉన్నవారిని పలకరించి 30 ఏళ్ళ క్రితం ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉండేది అని అడిగితే, వింతగా చూస్తూ – 30 ఏళ్ళ క్రితం నాటి సంగతి ఎవరికి తెలుసు అని నవ్వాడు. అక్కడ ఉన్న వారికే అక్కడి టీడీపీ ఆఫీస్ గురించి తెలియదు అని విన్నాక, ఆనాటి సంగతులు రాయాల్సిందే, రికార్డ్ చేయాల్సిందే అని మరింత బలంగా అనిపించింది.
చిన్న భవనం. బాబు మొదటి రెండు మూడు సంవత్సరాలు అక్కడి నుంచే రాజకీయాలు నడిపారు. హైదర్ గూడా కార్యాలయంలో ఉండగానే బాబు తండ్రి మరణించిన వార్త తెలిసి పార్టీ నాయకులు అక్కడ ఫోటో పెట్టి నివాళి అర్పించారు.
సిపిఐ అప్పటి కార్యదర్శి పువ్వాడ నాగేశ్వర రావు ఇదే ఆఫీస్ లో బాబుతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ రోజుల్లో వారి బంధం అంత దృఢమైంది .

వంగవీటి రత్నకుమారి … 1997 ప్రాంతంలో ఒక రోజు హైదర్ గూడా పార్టీ ఆఫీస్ లో ఉన్నప్పుడు వంగవీటి రత్నకుమారి ఒక డాక్టర్ తో కలిసి టీడీపీ ఆఫీస్ కు వచ్చి బాబుతో మాట్లాడారు. టీడీపీలో చేరారు. ఆమె వంగవీటి రంగా శ్రీమతి. రంగా హత్య తర్వాత విజయవాడ అట్టుడికింది. నగరంలో సంపద అగ్నికి ఆహుతి అయింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వచ్చి ఇంటి ముందు నిలిచినా రత్నకుమారి ఎన్టీఆర్ ను కలువలేదు. చాలాసేపు వేచి చూసి ఎన్టీఆర్ వెళ్లిపోయారు. టీడీపీ సామాజికవర్గం వారి ఆస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
కాలం ఊహించని మార్పులు తెస్తుంది. అదే రత్నకుమారి టీడీపీ కార్యాలయానికి వచ్చి టీడీపీలో చేరారు. ఆస్తి అగ్నికి ఆహుతి అయినా సంపన్నులు కాలక్రమంలో తిరిగి సంపన్నులు అయ్యారు. అప్పుడు ఆస్తులు దోచుకున్నవారి జీవితాల్లో పెద్ద మార్పు లేదు . కేసుల్లో ఇరికిన వారి సంగతి అంతే. నాయకులను నమ్ముకొని బాగుపడే అనుచరులు ఉంటారు. జీవితాలను భస్మం చేసుకునే వారూ ఉంటారు.
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో హోటల్స్ ముందు ఎవరి సైకిల్ కు వాళ్లే బాధ్యులు అని తప్పనిసరిగా రాసి ఉండేది. అప్పుడు సైకిల్ దొంగతనాలు బాగా జరిగేవి. ఇప్పుడు సైకిల్లే కనిపించడం లేదు. ఇక దొంగతనాలకు అవకాశం ఎక్కడ ? ఎవరి సైకిల్ కు వారే బాధ్యులు అని రాసినట్టు ఎవరి జీవితానికి వారే బాధ్యులు అని ఎంత త్వరగా గ్రహిస్తే జీవితం అంత బాగుంటుంది.
రంగా వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన రత్నకుమారి రెండుసార్లు కాంగ్రెస్ శాసన సభ్యురాలిగా గెలిచి 97 లో టీడీపీలో చేరాక క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. వంగవీటి కుమారుడు కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు జనసేన బాట పట్టారు.
బాబు చెంతకు … ఒకప్పుడు ఎన్టీఆర్ ను వణికించిన పలువురు కాలక్రమంలో టీడీపీలో చేరి కనుమరుగు అయ్యారు. సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ను ఇంట్లోకి రానివ్వని రత్నకుమారి టీడీపీలో చేరారు. టిఎన్జీవో నాయకునిగా స్వామినాధన్ ఎన్టీఆర్ కు సింహస్వప్నంగా నిలిచారు. సమ్మె సమయంలో ఎన్టీఆర్ ను సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. చారిత్రక సమ్మెతో ఎన్టీఆర్ కు కంటికి కునుకు లేకుండా చేశారు.
అలాంటి స్వామినాధన్ రిటైర్ అయ్యాక బాబు హయాంలో టీడీపీలో చేరారు . ఎన్టీఆర్ భవన్ లో యాదగిరి రిసెప్షనిస్ట్ గా ఉంటే అతనికి సహాయకునిగా స్వామినాథన్ ఉండేవారు. సమ్మె కాలంలో ఎన్టీఆర్ పై నిప్పులు చెరిగిన మీరు ఇంత సాధువుగా మారిపోయారు అంటే అంతా కాల మహిమ అన్నట్టు చూసేవారు.
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 89 లో కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు. టీడీపీలో బాబు జమానా మొదలయ్యాక చిత్తరంజన్ దాస్ టీడీపీలో చేరి అనామకంగా ఉండి పోయారు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ముషీరాబాద్ శాసన సభ్యునిగా నాయిని నర్సింహారెడ్డి బులెట్ మీద వచ్చేవారు. ఆయన పెద్ద పెద్ద మీసాలు , పాత తరం నాయకుడిగా ధోవతి కట్టుకొని బులెట్ మీద వచ్చేవారు. రహత్ మహల్ టాకీస్ లో పంచాయితీలు తీర్చేవారు. 78 లో టీ అంజయ్యను ముషీరాబాద్ లో ఓడించారు.
ఓడిపోయాక. తర్వాత అంజయ్య సీఎం అయ్యారు . రామయంపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
టీడీపీలో చేరి ఓ ఫైల్ పట్టుకొని బాబు ఉపన్యాసాలు వినేవారు. చిన్నప్పుడు బులెట్ మీద వచ్చిన మిమ్ములను ఇలా చూడడం వింతగా ఉంది అని ఓ రోజు వారికే చెప్పాను. తర్వాత తెరాసలో చేరి మంత్రి అయ్యారు. నాయిని నర్సింహారెడ్డి టీడీపీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చాడో , ఎప్పుడు పోయాడో తెలియనే తెలియలేదు అని బాబు పార్టీ మీటింగ్ లో అన్నారు. రాజకీయాల్లో ఎవరికి ఏదీ శాశ్వతం కాదు .
చంద్రబాబు తొలి పార్టీ ఆఫీస్ అపోలో ఆస్పత్రిగా మారి రోగులతో కిటకిటలాడుతుంటే, ఎన్టీఆర్ తొలి పార్టీ ఆఫీస్ హిమాయత్ నగర్ లో డెంటల్ ఆస్పత్రిగా మారింది…. బుద్దా మురళి
Share this Article