.
న్యూయార్క్… మహానగరం… మధ్యలో 102 అంతస్తుల మహాభవనం… పేరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్… అమెరికా వాస్తువిజ్ఞానంలో ఓ మకుటమే… ఎందుకో తెలుసా..? జస్ట్, 13 నెలల్లోనే 102 అంతస్తుల నిర్మించారు… అదీ 1930 లో… దీని సందర్భనకన్నా దీని వివరాలు తెలుసుకోవడమే ఓ అబ్బురం అనిపించింది…
86వ అంతస్తులోని అబ్జర్వేషన్ డెక్ నుంచి చూస్తే న్యూయార్క్ విశ్వరూపమే!… నిజమే… న్యూయార్క్ నగరాన్ని చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి… ఆకాశాన్ని తాకే భవనాలు, రద్దీగా పరుగులు తీసే రోడ్లు, హడావుడిగా కదిలే జనజీవనం… ఒకవైపు ఆధునిక ప్రపంచానికి ప్రతీకగా నిలిస్తే, మరోవైపు వందేళ్ల కిందటే అమెరికా సాధించిన ఇంజినీరింగ్ అద్భుతాలు ఆశ్చర్యపరుస్తాయి… అలాంటి వాటిలో ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రత్యేకం…
Ads
1930లో నిర్మాణం మొదలుపెట్టి, కేవలం 410 రోజుల్లోనే ఈ మహాకట్టడాన్ని పూర్తి చేశారు… 102 అంతస్తుల భవనం! వారాల తరబడి కాదు.. నెలల తరబడి కాదు.. ఏడాది కొద్దిగా దాటేసరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అందుబాటులోకి వచ్చింది… అప్పటి సాంకేతిక పరిజ్ఞానం, వేలాది మంది కార్మికుల శ్రమ, నిర్మాణ ప్రణాళిక, పనుల సమన్వయం… ఇవన్నీ కలిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం సాధ్యమవుతుందో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నిరూపించింది…

86వ అంతస్తులోని అబ్జర్వేషన్ డెక్ మీద నిలబడి నగరాన్ని చూస్తే.. న్యూయార్క్ విశ్వరూపం కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు, వాటి మధ్య దూసుకెళ్లే రోడ్లు, దూరంగా కనిపించే నదులు… మనిషి నిర్మించుకున్న మహానగరం ఎంత విస్తారమైనదో ఆ ఒక్క చోటు నుంచి అర్థమవుతుంది…
ఏడాదిలోపే దాదాపు ఆకాశాన్ని తాకిన నిర్మాణం!
https://www.facebook.com/reel/1539144018259214
అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్న పోటీ న్యూయార్క్‌లో జోరుగా సాగుతోంది… క్రిస్లర్ బిల్డింగ్‌తో మొదలైన ఆ ఎత్తుల పోటీలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సరికొత్త రికార్డు సృష్టించింది…
నిర్మాణంలో స్టీల్ ఫ్రేమ్‌వర్క్‌ను వారానికి సగటున నాలుగున్నర అంతస్తుల వేగంతో పైకి తీసుకెళ్లారు… కొన్ని సందర్భాల్లో పది పని దినాల్లోనే 14 అంతస్తుల స్టీల్ నిర్మాణం పూర్తయింది… ఈ వేగాన్ని సాధించడానికి కార్మికుల నైపుణ్యం ఒక్కటే సరిపోలేదు… ప్రతి స్టీల్ భాగాన్ని ఎక్కడ అమర్చాలి, ఎప్పుడు నిర్మాణ ప్రదేశానికి చేర్చాలి, ఏ బృందం ఏ పని చేయాలి అనే అంశాలన్నీ పక్కాగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు…
నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ భవనం 102 అంతస్తులతో, పైభాగంలోని యాంటెన్నాతో కలిపి 1,454 అడుగుల ఎత్తుకు చేరుకుంది… మీటర్లలో చెప్పాలంటే సుమారు 443 మీటర్లు… యాంటెన్నాను మినహాయిస్తే పైభాగం ఎత్తు 1,250 అడుగులు, అంటే సుమారు 381 మీటర్లు…
1931లో ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది… దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ రికార్డును తన దగ్గరే ఉంచుకుంది… వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ల నిర్మాణంతో ఆ హోదా కోల్పోయినా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు…
భవన నిర్మాణానికి సుమారు 57,000 టన్నులకు పైగా స్టీల్ ఉపయోగించారు… పది మిలియన్ల ఇటుకలు, వేలాది కిటికీలు ఈ నిర్మాణంలో భాగమయ్యాయి… రాతి పలకలు, గ్రానైట్, అల్యూమినియం వంటి పదార్థాలతో బయటి భాగాన్ని తీర్చిదిద్దారు…
మరో విశేషం ఏమిటంటే… ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే అప్పటి అత్యాధునిక లిఫ్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు… అప్పట్లోనే అత్యంత వేగంగా పనిచేసే లిఫ్టులను అందుబాటులోకి తీసుకురావడం ఈ భవనంలో మరో ఇంజినీరింగ్ ఘనత… 1931లో ప్రారంభించిన లిఫ్టులు 80 ఏళ్లు పనిచేశాయి… 2011లో ఆధునీకరించారు…
- అటు రష్యా, ఇటు అమెరికా… సబ్ వేలు, మెట్రోలు, ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, బ్రిడ్జిలు, పెద్ద పెద్ద రోడ్లు… ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా కాన్సంట్రేట్ చేశాయి… వందేళ్ల క్రితమే అద్భుతమైన వాస్తుజ్ఞానాన్ని సంపాదించి ఉపయోగించాయి… పక్కా ఉదాహరణ ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్… అందుకే అంటారు, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కట్టడం గొప్ప కాదు, వందేళ్ల క్రితం కట్టిన ఈ వంద అంతస్తుల కట్టడమే గొప్ప అని..!
86వ అంతస్తుకు వెళ్లి నగరాన్ని చూడటం మరో అనుభవం… ఆకాశం కింద బహిరంగంగా ఉండే ఈ అబ్జర్వేషన్ డెక్ నుంచి మాన్‌హట్టన్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు… చుట్టూ ఉన్న భవనాలు, వాటి మధ్య ప్రవహించే ట్రాఫిక్, దూరంగా కనిపించే హడ్సన్ నది.. అన్నీ ఒకేసారి కళ్లముందు కనిపిస్తాయి…
ఇదే భవనంలో 102వ అంతస్తులో మరో అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంది… అది పూర్తిగా క్లోజ్డ్… ఓపెన్ టు స్కై కాదు… పైగా అదనపు టికెట్ తీసుకోవాలి… న్యూయార్క్‌ను అర్థం చేసుకోవాలంటే కేవలం టైమ్స్ స్క్వేర్, బ్రాడ్వే, వాల్ స్ట్రీట్ వంటి ప్రదేశాలను సందర్శిస్తే సరిపోదు… ఆ నగరం ఎలా రూపుదిద్దుకుంది, ఎంత పరిమిత స్థలంలో ఎంతటి ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఇలాంటి ఎత్తైన ప్రదేశాల నుంచి నగరాన్ని చూడటం ఎంతో ఉపయోగకరం…
కింగ్‌కాంగ్ నుంచి హాలీవుడ్ వరకు! … ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రావడంలో సినిమాల పాత్ర కూడా ఉంది… 1933లో విడుదలైన కింగ్‌కాంగ్ సినిమాలో ఈ భవనం కీలకంగా కనిపించింది… ఆ తర్వాత అనేక హాలీవుడ్ సినిమాల్లో ఇది ప్రేమకు, నగర జీవితానికి, న్యూయార్క్ ప్రత్యేకతకు ప్రతీకగా నిలిచింది… అనఫైర్ టు రిమెంబర్, స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, అవెంజర్స్ వంటి సినిమాల్లోనూ ఈ కట్టడం ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది…
ఈ భవనం నిర్మించిన కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి… అమెరికా అప్పుడే మహా ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్)లోకి ప్రవేశిస్తోంది… అయినప్పటికీ ఈ భారీ ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేశారు… అయితే భవనం ప్రారంభమైన వెంటనే అన్ని అంతస్తులకూ అద్దెదారులు దొరకలేదు… కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉండటంతో కొంతకాలం దీనిని వ్యంగ్యంగా ‘ఎంప్టీ స్టేట్ బిల్డింగ్’ అని కూడా పిలిచేవారు…
- ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది… అమెరికా అభివృద్ధి అనేది కేవలం సంపదకు సంబంధించిన కథ కాదు. ఆ సంపదను భౌతిక రూపంలోకి మార్చగల ఇంజినీరింగ్ సామర్థ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక పెట్టుబడులు, ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం కూడా అందులో కీలక పాత్ర పోషించాయి…
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను 86వ అంతస్తు నుంచి చూస్తున్నప్పుడు కనిపించేది కేవలం న్యూయార్క్ నగరం కాదు… మనిషి ఆలోచనకు, శ్రమకు, సాంకేతిక నైపుణ్యానికి ఉన్న అపారమైన సామర్థ్యం కూడా!
- చివరగా… ఏయే సెలబ్రిటీలు ఈ బిల్డింగ్‌ను సందర్శించారో చెప్పే ఫోటోలు చాలా పొందుపరిచారు వాల్స్ మీద… తరచి తరచి చూస్తే మన ప్రియాంక చోప్రా ఫోటో కనిపించింది… అంతే..!!
Share this Article