.
ముందుగా ఓ తాజా వార్త చదవండి…. మియాపూర్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక విజయం… 550 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు… వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు న్యాయపరమైన రక్షణ… 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ… ముఖ్యమంత్రి పర్యవేక్షణలో సమర్థవంతమైన న్యాయపోరాటం…
మియాపూర్ భూ వివాదంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన భూ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుమారు 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను (సివిల్ అప్పీల్ నెం.10699/2013 తదితర కేసులు) సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
Ads
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి ముగింపు లభించింది.
సుదీర్ఘ న్యాయపోరాటం… మియాపూర్ సర్వే నంబర్ 100లో 277 ఎకరాల 5 గుంటలు, సర్వే నంబర్ 101లో 273 ఎకరాల 34 గుంటల భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ భూములపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుల్లో 1997లో ప్రత్యేక న్యాయస్థానం, 2003లో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు 23 ఏళ్లుగా ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు న్యాయపరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం, న్యాయ నిపుణుల మధ్య సమన్వయం పెంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. మియాపూర్ భూములు ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసే పాత రెవెన్యూ రికార్డులు, సేత్వార్, క్లాసర్ రిజిస్టర్, గత న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం ఆధారాలుగా సమర్పించింది. ప్రైవేట్ వ్యక్తులు హక్కులు కోరుతూ చూపిన రెవెన్యూ ఎంట్రీల్లో అవకతవకలు ఉన్నాయని గత న్యాయస్థానాలు గుర్తించిన అంశాలను ప్రభుత్వ వాదనల్లో ప్రస్తావించారు.
ప్రభుత్వ వాదనల అనంతరం సుప్రీంకోర్టు ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజయం లభించింది….
….. వార్త చదివారు కదా… 1997లో ప్రత్యేక న్యాయస్థానం, 2003లో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు చెప్పాయి… తరువాత సదరు ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు… తరువాత తెలంగాణ ఉద్యమం, అనంతరం అనివార్యంగా రాష్ట్ర విభజన జరిగింది… 2014లో కేసీయార్ గద్దెనెక్కాడు… తొమ్మిదిన్నరేళ్లు ఆ కేసుకు దిక్కూమొక్కూ లేదు…
కేసు కదిలింది లేదు… కేసు గెలవాల్సిందే, అది తెలంగాణ ప్రజల ఆస్తి, ఆ ప్రభుత్వ భూమి కాపాడాల్సిందే అనే బాధ్యత, చొరవ కేసీయార్ ప్రభుత్వానికి లోపించింది… దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగం, న్యాయనిపుణుల నడుమ సంయమనం సాధించి, సరైన ఆధారాల్ని సుప్రీంకోర్టులో సమర్పించేలా చేసి, శ్రద్ధ చూపించిన ఫలితంగా 550 ఎకరాల అత్యంత విలువైన భూమి దక్కింది… ఎవరి ప్రయోజనాల కోసం కేసీయార్ దీన్ని పట్టించుకోకుండా వదిలేశాడు..? ఇదీ అంతకుమించిన విలువైన ప్రశ్న..!!

2024 జూన్‌లో వార్త ఇది… స్టేటస్ కో ఉత్తర్వులున్నా సరే ఆ భూమిలో యాక్టివిటీ కనిపిస్తే ఈ ప్రభుత్వం అడ్డుకుంది… పోలీసులపైనే రాళ్లు రువ్వినప్పటి వార్త ఇది… ప్రభుత్వం ఎక్కడా తన పట్టు సడలించలేదు… ఫలితంగా ఆ విలువైన భూమి న్యాయపోరాటంలోనూ ప్రభుత్వానికి ఇక దఖలు పడింది… ( Trinity Infraventures and Suvishal PowerGen గోల్డ్ స్టోన్ ప్రసాద్‌పై గతంలో కూడా వార్తలు వచ్చాయి… )
Share this Article