.
ఓటీటీకి వస్తే తప్ప నాసితనం బయటపడదు అన్నట్టు… చాలా సినిమాలు థియేటర్లలో నడిచినన్ని రోజులు పెద్దగా లోతైన, నిజమైన, నిఖార్సయిన నాణ్యతాపరీక్షలు, సమీక్షలు, విశ్లేషణలు కనిపించవు… ఓటీటీకి వచ్చాక, తాపీగా సినిమాను చూశాక ఆ సినిమా అసలు కథేమిటో బయటపడుతుంది సోషల్ మీడియా ట్రూ రివ్యూలలో… ఇదీ అదే…
ప్యారడైజ్ సినిమాతో నానిని ప్రేమించే అభిమానుల సంఖ్య సగానికన్నా ఎక్కువే పడిపోయినట్టుంది… నేచురల్ హీరో కాస్తా అన్- నేచురల్ నటుడిగా దిగిపోయాడు… కమర్షియల్, మాస్ అప్పీల్ పేరిట విపరీతమైన హింస, కథాకథనాల్లో డొల్లతనం, లాజిక్ రాహిత్యాలు రాజ్యమేలాయి సినిమాలో… పాపం జడల్ కాదు, బండల్ అనే వ్యాఖ్యానాలకు దారితీసింది…
Ads
మిత్రుడు Chakri Rao ఏం రాశాడంటే..? ‘‘పారడైస్ చూడటానికి తెరచితిని..
ఉయ్యాలో.. ఉయ్యాలో పాట రాగానే … సినిమా ముయ్యాలో ముయ్యాలో అనిపించినది. మధ్య మధ్యలో చూసి బాగున్న ఎడల మొత్తం చూడవచ్చునని.. ఫాస్ట్ ఫార్వర్డు చేసుకుంటూ అక్కడక్కడా చూసితిని.
విలను పాత్ర నోట్లో పట్టని సిగార్ నోట్లో పెట్టుకోవటం విచిత్రంగా తోచినది. కాస్త సన్ననిది ఇవ్వవలసినది పాపం.
ఇంతలో మన హీరో గారు దర్శనమిచ్చిరి. ఆ జడలతో, బక్క చిక్కిన ఆంబోతు ముక్కుకు రింగులు పెట్టినట్లు మొహముతో హాస్వాస్పదముగా తోచెను. “అతి” సాహసోపేతంగా.. జైల్లో .. తాడు పోరాటాలే కదా.. ఎటు పడితే అటు మెలికలు తిరుగుతూ చిత్రవిచిత్ర పొరాటము చేసి హీరో నేనే పరిచయ ఘట్టం ముగించెను.. తర్వాత…

హా, అప్పట్లో టివిల్లో కొందరు రియల్ ఎస్టేట్ దందాగాళ్లం అంటూ ఇంటర్వూలు ఇచ్చేవారు కదా.. కిలోల కొద్ది కాకిబంగారం వేసుకొని.. ఆ లుక్కును కాపీకొట్టిన విలనూ, అతడి కొడుకూ కనిపించిరి. కుర్ర క్రికెటర్ వైభవ్ బ్యాటును నలువైపులకి ఝుళిపించి సిక్సులు బాదే చందంబున…. పోరాటాల్లో కత్తులు ఝుళిపించి ఎవరు దొర్కితె వాళ్ల కాళ్ళూ చేతులు.. మొండాలూ.. మెడకాయలు ఎగరగొట్టేసిరి.
కాలిన గాయములు అన్నట్లుగా మధ్యలో ఎర్రని దూది ఒళ్లంతా పెట్టి ఓ కుర్రాడిని కూడా చూపించిరి. దూది అని చూపరులకి సులభంగా తెలుస్తూ ఉండెను.
పోతే సినిమాలో ఒక్కరి మొహం కూడా చూడ వీలు లేకుండెను. చూడతగ్గ ఒక ఘట్టమూ లేదాయెను. ప్రతి సన్నివేశమూ ప్రతి షాటూ .. అతి నటన… అప్పు తెచ్చుకున్న తెలంగాణా యాసతో మితి మీరిన డైలాగులు.
ఇహ మన నాయకుడిని చితక్కొట్టి వేళాడ దీస్తే ..????
ఎన్నో సినిమాల్లో ఇలాంటి ప్రీ క్లైమాక్స్ సందర్బ్బాల్లో …..
ఏం చేయాలి ఎంచేయాలి అని స్క్రిప్టు రైటర్లు తలపట్టుకు కూర్చున్న సమయాల్లో….
కథలని ముందుకు నడిపించిన శునక మారాజు ఇక్కడ కూడా కనిపించి కథని నడిపించి.. తన కన్నీళ్ళతో వర్షం కురిపిస్తే…. కళ్ళు తెరచిన హీరోగారు… ఈ సారి ఎదో పేరు తెలియని యుద్దవిద్యలో ఒక రాజమౌళి తరహా సాంగ్ తో రాటుదేలి… తన వాళ్లందర్నీ కూడగట్టి మళ్ళీ యూద్దానికి సిద్దమాయెను..
ఆ తరవాత ఫాస్ట్ ఫార్వర్డులో కూడ చూడలేక ఆపివేయుదమా అనుకునేంతలో
మంటల్లో చిక్కుకుని మాడిపోతుంటే వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలా… కెసిఆర్ వెష ధారణలో
ప్రియదర్శి దర్శనమిచ్చెను . ఆతడి రెండు మూడు డైలాగులు మాత్రం చూసి ఈ సినిమ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కూడ చూడటానికి నా తరం కాదని అర్థమాయెను.
నిజాయితీ లేమితో .. అథెంటిసిటీ మృగ్యమై హాలీవుడ్డు సినిమాలని రంగరించి అతుకుల బొంతగా రాసుకున్న కథ సుస్పష్టముగా తెలియుచున్నా…… ఆ నాయకుడు.. మిగతా నటులు ఎందుకు చేశారో ఈ సినిమా అని అనిపించినా… డబ్బు అందర్నీ నడిపించి యుంటుంది అనే సత్యము గుర్తుకు వచ్చి మిన్నకుండక తప్పదాయెను !!
Share this Article