Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…

October 30, 2026 by M S R

.

ఓ అమెరికా మిత్రుడు… షింగిల్స్, ఫ్లూ వేక్సిన్లు రెండూ ఒకేరోజు వేయించుకున్నాను, ఫాల్ స్టార్టయింది కదా, తప్పదు, కాస్త జ్వరం తగిలింది, రేపటికల్లా తగ్గుతుందేమో, 50 దాటాను కదా, ఆ రెండు సూదులు పొడిపించుకోకపోతే మా డాక్టర్ ఊరుకోడు… అని చెబుతున్నాడు ఫోన్‌లో…

ఆశ్చర్యం వేసింది… యాభై దాటాక తప్పకుండా వేసుకోవాల్సిన వేక్సిన్లా..? మనం ఇండియాలో ఇవేమీ పెద్దగా పట్టించుకోం కదా… అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎడమ జబ్బకు వేసిన రెండు వేక్సిన్లే గుర్తు… అవీ ఎందుకు గుర్తున్నాయంటే… అవి పుండ్లుగా మారి, పొక్కులు కట్టి, నాలుగు రోజులు జ్వరం పీడించి, ఆ గాయాలు జీవితాంతం జబ్బ మీద అలాగే బర్రలుగా (మచ్చలు) మిగిలిపోతాయి కాబట్టి…

Ads

అవెందుకో ఇప్పుడు చెప్పలేం గానీ… బహుశా మశూచి, క్షయ నివారణ బీసీజీ కావచ్చు… నిర్బంధంగా అణగబట్టి మరీ సూదులు గుచ్చేవాళ్లు… ప్రపంచమంతా మశూచి మాయమైంది, ఇక దాన్ని మానేశారు… బీసీజీ ఇంకా వేస్తున్నారు… ఈమధ్య మళ్లీ క్షయ విజృంభిస్తోంది… బహుశా కోవిడ్ దెబ్బకు చాలామంది ఊపిరితిత్తులు బలహీనపడి, ఇమ్యూనిటీ దెబ్బతిని, దాక్కున్న క్షయ కోరలు చాస్తుందేమో… బీసీజీ వేస్తున్నారు ఈమధ్య…

ఆ తరువాత ఇక వేక్సిన్ వేసుకున్నదే లేదు… ఆమధ్య తప్పనిసరై వేసుకున్న కోవిడ్ రెండో డోసుల వేక్సిన్ తప్ప… అప్పటికే ఆ వేక్సిన్ మీద నెగెటివ్ ప్రచారం జరగడం, కోవిడ్ తీవ్రత తగ్గిపోవడంతో బూస్టర్ డోస్ వేసుకున్నట్టు కూడా గుర్తు లేదు… హెపటైటిస్ బీ గురించి బహుళ ప్రచారం జరిగింది గానీ దాన్నీ పట్టించుకోలేదు…

ఇప్పుడు పిల్లలు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలు రకరకాల రసాయనాలు అలవాటు చేయడం… పుట్టాక బోలెడన్ని వేక్సిన్లు… దాదాపు ఏడాదిదాకా అనేకం… వేక్సిన్లే గాకుండా రకరకాల మెడిసిన్స్, లోషన్స్, క్రీములు… రసాయనాలు మధ్య పెంచుతున్నాం… అఫ్‌కోర్స్, చాలా వ్యాధుల నుంచి రక్షణ… థాంక్స్ టు మెడికల్ రీసెర్చ్…

పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో పల్స్ పోలియా ఎఫెక్టివ్‌గా జరగకపోవడం, ఇంకా కేసులు నమోదవుతున్న కారణంగా… 2014లోనే మనం పోలియోరహితం అయిపోయినా సరే, ఏళ్లు గడుస్తున్నా మన దేశంలో ఇంకా ఇంకా పల్స్ పోలియో నిర్వహిస్తూనే ఉన్నాం… ఇంకా ఎన్నేళ్లో..!

vaccination

అందుకే 50 దాటాక వేక్సిన్లు అనేది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది… అమెరికాలో వేరు… ప్రివెన్షన్ మీద కాన్సంట్రేషన్ చాలా ఎక్కువ… మెడికల్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి… టీకాలు బీమాలో కవరవుతాయి… వింటర్ స్టార్ట్ కాగానే ఫ్లూ వేక్సిన్ వేస్తారు… వేయించుకుంటారు… ముందుజాగ్రత్త… దాని ప్రభావం ఎక్కువే కాబట్టి…

అమెరికాలో షింగిల్స్ ఎందుకు వేయించుకుంటారంటే… చిన్నప్పుడు గనుక చికెన్ పాక్స్ (అమ్మవారు) సోకి ఉంటే, దాని అవశేషాలు అలాగే దేహంలో ఉండి ఉంటే, ఇమ్యూనిటీ వయసుతోపాటు తగ్గి అది మళ్లీ తీవ్రమైన నరాలనొప్పితో బయటపడకుండా ఈ వేక్సిన్ (shingrix)… ఫ్లూ టీకా (Influenza)తోపాటు న్యుమోకోకల్ టీకా (Pneumonia) కూడా వేయించుకుంటారు, ఊపిరితిత్తులకు రక్షణగా…

Tdap టీకా (ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు) పదేళ్లకు ఓసారి… కాలేయ సమస్యలు రాకుండా హెపటైటిస్ B (Hepatitis B) వేక్సిన్లు (19 – 59 ఏజ్) సరేసరి… ఊపిరితిత్తులకు సంబంధించి పాస్ట్ రికార్డ్, సున్నితత్వం ఉన్నవారికి RSV వేస్తారట… 75 వయస్సు దాటితే తప్పనిసరి… ఐనా ఇప్పుడు వేక్సిన్లంటే ఏముంది..? ఓ దోమ కుట్టినట్టు… చురుక్కుమంటుంది కాస్త… అంతే… కానీ మస్తు ప్రొటెక్షన్… ఆ పాత మశూచి బర్రలు, బీసీజీ పుండ్ల కాలం పోయి యాభై ఏళ్లయిందిలే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…
  • … చివరకు ఓటీటీలోనూ ఫాస్ట్‌ఫార్వర్డ్ చేస్తూ సైతం చూడలేకపోతి…
  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’
  • వారణాసి OTT బిజినెస్… జక్కన్న మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా ?
  • శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!
  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions