.
ఒక ఫొటో.. ఒక చిన్న పరిశీలన.. కానీ ఆలోచిస్తే ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఓ ఇందిరమ్మ ఇంట్లో నేల మీద కూర్చుని సన్నబియ్యం భోజనం చేస్తున్న దృశ్యమిది. సందర్భం ఏదైనా కావచ్చు.. సామాన్యుల మధ్య కూర్చుని భోజనం చేయడం ఒక ఆసక్తికరమైన సన్నివేశమే. ఒక ఇల్లు, అందులో పండుగపూట సన్నబియ్యపు అన్నం… ఖచ్చితంగా ఓ పేద కుటుంబానికి దీపావళే… అయితే ఈ ఫొటోలో నాకో మరో విషయం కనిపించింది.
అందరూ నేల మీద కూర్చున్నారు. అందరి ముందూ భోజనం ఉంది. కానీ ఒక్కరు కూడా కంచాన్ని నేల మీద పెట్టుకుని తినడం లేదు. ఎవరి కంచం వాళ్ల చేతుల్లోనే ఉంది. నేలకు కొద్దిగా ఎత్తులో పట్టుకుని భోజనం చేస్తున్నారు. ఇదే ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణంగా కనిపించని దృశ్యం!
Ads
ఒకసారి మన చిన్నప్పటి భోజన పద్ధతులు గుర్తు చేసుకోండి. ఇంట్లో అందరూ నేల మీద కూర్చునేవాళ్లు. ఎదురుగా కంచం పెట్టుకునేవాళ్లు. అన్నంలో పప్పు, కూర, నెయ్యి వేసుకుని చేత్తో కలిపి ముద్ద చేసుకుని తినేవాళ్లు. కంచం కదలకుండా నేల మీదే ఉంటుంది. మన చేతులు మాత్రం స్వేచ్ఛగా ఉంటాయి. ఒక్కో ముద్ద నోటికి తీసుకెళ్లడం, పక్కనే ఉన్నవారితో కబుర్లు చెప్పుకోవడం.. అదొక ప్రత్యేకమైన భోజన సంస్కృతి.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డైనింగ్ టేబుళ్లు వచ్చాయి. కుర్చీల మీద కూర్చుని తినడం అలవాటైంది. సోఫాలో కూర్చుని, టీవీ చూస్తూ తినేవాళ్లూ పెరిగారు. నేల మీద కూర్చుని భోజనం చేసే సందర్భాలు తగ్గిపోయాయి. ఒకవేళ కూర్చున్నా కంచాన్ని చేతిలోనే పట్టుకుంటున్నారు. అంటే నేల మీద కూర్చునే పద్ధతి మిగిలినా, నేల మీద కంచం పెట్టుకుని తినే అలవాటు మాత్రం కనుమరుగవుతోందా?
దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మారిన జీవనశైలి ఒక కారణమైతే, పరిశుభ్రతపై పెరిగిన శ్రద్ధ మరో కారణం కావచ్చు. నేల ఎంత శుభ్రంగా ఉందో తెలియని చోట కంచం పెట్టడానికి చాలామంది ఇష్టపడరు. చేతిలో కంచం ఉంటే సౌకర్యంగా ఉంటుందని భావించేవాళ్లూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి డైనింగ్ టేబుల్ మీద తినడానికి అలవాటుపడినవాళ్లు నేల మీద కూర్చున్నప్పుడు కూడా కంచాన్ని చేతిలోనే ఉంచుకోవడం సహజమే.
ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఒకప్పుడు భోజనం అంటే కుటుంబమంతా కలిసి కూర్చుని తినడం. ఇప్పుడు చాలాచోట్ల ఎవరి సమయం వారిది. ఎవరి భోజనం వారిది. ఆహారం తినే పద్ధతిలోనే కాదు, భోజనం చుట్టూ ఉండే కుటుంబ అనుబంధాల్లోనూ మార్పు వచ్చింది.
ఒకరు టీవీ చూస్తూ, మరొకరు ప్యాడ్‌లో ఓటీటీ చూస్తూ, ఇంకొకరు ల్యాప్‌టాపులో ఏదో సీరీస్ చూస్తూ…. ఎవరి లోకం వాళ్లది… ఆహారాన్ని చేతులతో తినడమేమిటి, హవ్వ అని వెక్కిరించినరోజులు గతం… ఇప్పుడు నేల మీద కంచంలో పెట్టుకుని తింటే, హవ్వ, అంత వంగి, అంత జాగ్రత్తగా ముద్దలుముద్దలుగా తినడం ఏమిటి, హవ్వ అని ఆశ్చర్యపోయే రోజులు…
అయితే కంచం నేల మీద పెట్టుకుని తినడమే గొప్ప, చేతిలో పట్టుకుని తినడం తప్పు అని కాదు. కాలంతోపాటు అలవాట్లు మారుతుంటాయి. కానీ ఈ ఫొటో ఒక చిన్న సామాజిక మార్పును మాత్రం గుర్తు చేస్తోంది. నేల మీద కూర్చుని తినే పద్ధతి ఇంకా కనిపిస్తోంది. కానీ నేల మీద కంచం పెట్టుకుని తినే అలవాటు మాత్రం క్రమంగా వెనక్కి వెళ్లిపోతోంది.
చివరికి.... మనం నేల మీద కూర్చునే ఉన్నాం.. కానీ మన భోజన పద్ధతి మాత్రం నేలను వదిలేసింది!
Share this Article