Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన స్టారాధిస్టారులు – తెరపై భీకరమైన ‘నరుకాసురులు’…

November 9, 2026 by M S R

.

ఇప్పుడు హీరోలు అంటే… పెద్ద పెద్ద గన్నులు (అనగా బోఫోర్స్ గన్నులు, ఫైరింగ్ గన్నులు కాదు- బండరాళ్లను పగులగొట్టే గన్నులు) చేత్తో పట్టుకుని లేదా ఆ రేంజ్ పెద్ద కత్తులు, విచిత్ర ఆయుధాలు పట్టుకుని వందలుగా, వేలుగా ఒక్కడే రౌడీలను తరమాలి లేదంటే తురమాలి… అనగా నరకాలి…

అవును, దీపావళి అనగానే, నరకాసుర వధ గుర్తుకురాగానే ఈ ‘నరుకాసురులు’ కూడా గుర్తొచ్చారు… నిజానికి కాక అని చిరంజీవి సినిమా వస్తోంది కదా… ఆ పోస్టర్లు, వాటిల్లో అయ్యగారి భుజాల మీద గన్ను కమ్ గండ్ర గొడ్డలి, నోట్లో సిగరెట్, కళ్లద్దాలు చూడగానే గుర్తొచ్చారు నరుకాసురులు… కొన్నాళ్లుగా మన స్టారాధిస్టారులు సాగిస్తున్న నరుకుడు పందెం, తురుముడు హోమం కూడా గుర్తొచ్చాయి చకచకా…

Ads

సగటు ప్రేక్షకుడు మీరెక్కడ దొరికార్రా బాబూ అని తిట్టిపోస్తున్నా సరే… హీరో వందల క్యూసెక్కుల నెత్తురు వరదలుగా పారిస్తూనే ఉంటాడు… రౌడీల దేహాలు చెల్లాచెదురై హీరో దెబ్బల ధాటికి అంతరిక్షం దాకా ఎగిసిపడుతూనే ఉంటాయి… హీరో అంటే మనిషి కాదు కదా, అంటే మానవాతీతుడు కాదు కదా… కళ్లపైన అద్దాలు కనీసం ముక్కు మీదకు కూడా జారవు… ఒక్కొక్కడినీ తురిమాక గుట్టలుగా శవాలు పేర్చి, దానిపై ఫోజు పెట్టి కూర్చోవాలి హీరో అంటే…

సో, రాబోయే చిరంజీవి బాబాయ్ ( కాకా అంటే బాబాయ్ అనే అర్థం) సినిమాలో నరుకుడు గ్యారంటీ అన్నమాట… మనుషులంటే మన స్టార్లకు జాంబీలు కదా… మెయిన్ విలన్ దగ్గర అయిదొందలకు, వెయ్యి రూపాయలకు పనిచేసే కూలీ రౌడీలు ఉంటారు కదా… వాళ్లను నరుకుతూనే ఉండాలి హీరో అంటే… నడుమ నడుమ రిలీఫ్ కోసం ‘ఏశనాగుల కట్ట మీద’ దొరలు తాగే ఇప్ప సారా వేసి, ఎవరో ఓ ఐటమ్ సాంగ్ వేసుకుని, ఏవో పిచ్చి గెంతులు వేయాలి… మళ్లీ అది వేరే కథ…

ఆదర్శ కుటుంబం అని సినిమా తీశారు కదా ఈమధ్య… అందులో కూడా నరుకుడే… చివరకు వెంకటేశ్, ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ అని టాకీసుకు పోతే అక్కడా నరుకుడు రోగమే… ఈ డైరెక్టర్ ఇంతకు ముందు కొన్ని మంచి సినిమాలు చేశాడుగా… ఇప్పుడు మెదడు వాపు వ్యాధి గానీ సోకిందేమో, “గుంటూరు కారం” లాంటి చెత్త సినిమాలు మొదలెట్టాడు… అందులో హీరో మాట్లాడే మాటలకి ఎవర్ని కొట్టాలో అర్థం కాలేదు…

నరుకుడు పందెం

ఫ్యామిలీ మూవీస్, లవ్ స్టోరీస్‌లతో మంచి సినిమాల హీరోగా కనిపించే నాని తన సహజనటుడు అనే భుజకీర్తిని అర్జెంటుగా నరికేసుకుని, మొన్నటికి మొన్న నరికిన శవాల మీద జడలు వేసుకుని కూర్చున్నాడు… అదేనండీ రౌడీ పీనుగుల ప్యారడైజ్…

అంతకు ముందు అతని HIT-3 మూవీ… ఒక హృద్రోగి అయి ఉండి కూడా నరుకుడే పని… ఎంత మందిని నరికితే అంత మాస్ హీరో అట… ఈయనకి ఏమైందో పాపం… గెట్ వెల్ సూన్ బ్రో… హైదరాబాదులో బోలెడు మంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు, ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా…

అంతకు ముందు వచ్చిన సమంత “మా ఇంటి బంగారం” మూవీ… ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు… కోడలుగా వచ్చి ఇంటిని ఫైరింగ్, పేలుళ్లతో గుల్ల చేసి, చావు తప్పి కన్ను లొట్టపోయేలా చేసిన మనిషి ఆ ఇంటికి బంగారం ఎలా అయ్యిందో ఎంత బుర్ర గోకున్నా ఏ ఒక్క ప్రేక్షకుడికీ అర్థం కాలేదు…

నరకండిరా, తెలుగు సినిమాని నిట్ట నిలువునా, అడ్డంగా ఎలా పడితే అలా ముక్కలు ముక్కలుగా నరకండి… మేమైతే చూడ్డాం మానేస్తున్నాం… ఎంత ఏడుస్తారో ఏడవండి, మీ ఇష్టం… ఏమాత్రం టైమ్ దొరికినా ఎంచక్కా OTT లలో తమిళం, మలయాళం, ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీస్ చూడగలం…  హ్యాపీగా…

విజయ్ సేతుపతి వంటి సూపర్ స్టార్ తమిళంలో “బత్తా” లాంటి అద్భుతమైన మూవీస్ చేస్తుంటే… ఈ బత్తాయిలేమో నరుకుడే పనిగా పెట్టుకున్నరు… మీ దుంపలు తెగ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన స్టారాధిస్టారులు – తెరపై భీకరమైన ‘నరుకాసురులు’…
  • రామాయణంలో పిడకల వేట & గుడ్డు మీద ఈకలు పీకడం!
  • నేలపై కూర్చున్నా చేతిలోనే కంచం! మారిన మన భోజన సంస్కృతి!!
  • మోషన్ పిక్చర్ కాదు, ఎమోషన్ పిక్చర్ – ఆయువుపట్టు, జటాయువుపట్టు
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదా?
  • సీతమ్మ శౌర్యం ! ఆ ఇంగ్లిష్ వెర్షన్ సీన్ ఇండియాలో ఎందుకు తీసేశారు..?!
  • ఓహ్, అదా అసలు సంగతి – స్థానిక గెలుపు బాబు ఘనత ఏమీ కాదన్నమాట..!!
  • సో కాల్డ్ హీరో మెటీరియల్ కాదు- సో వాట్, నిఖార్సయిన నటుడు..!!
  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions