Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లినా విమర్శలేనా..?!

November 11, 2026 by M S R

.

నిన్న మమ్ముట్టిపై విమర్శలు.. నేడు ఆత్మీయ పలకరింపులు! బీజేపీ నేత పాత పోస్టు మాయం.. కేరళలో కొత్త చర్చ!

సినిమా నటులకు రాజకీయాలు అంటగట్టడం కొత్తేమీ కాదు. వాళ్లు ఎవరిని కలిసినా, ఎక్కడికి వెళ్లినా దాని వెనుక రాజకీయ అర్థాలు వెతకడం ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో సాధారణమైపోయింది. అయితే మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం మరో ఆసక్తికరమైన ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.

Ads

నిన్నటి వరకు ఆయనను విమర్శించిన రాజకీయ నేతే.. నేడు తన ఇంటికి వచ్చిన మమ్ముట్టితో స్నేహం, ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, గతంలో మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకుని పెట్టిన తన పాత ఫేస్‌బుక్ పోస్టును కూడా తొలగించాడు!

అసలేం జరిగిందంటే… కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలకృష్ణన్ కుమార్తె అనఘ వివాహం నవంబర్ 1న గురువాయూర్‌లో జరిగింది. ఈ పెళ్లికి మమ్ముట్టిని కూడా ఆహ్వానించారు. అయితే కొచ్చి నుంచి బయలుదేరిన ఆయన ఆళువా దగ్గర ట్రాఫిక్ సమస్య కారణంగా పెళ్లికి చేరుకోలేకపోయాడు. దీంతో నవంబర్ 8న నేరుగా త్రిస్సూర్‌లోని గోపాలకృష్ణన్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను అభినందించాడు. కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపాడు.

keralam

అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. బీజేపీ నేత ఇంటికి మమ్ముట్టి వెళ్లడంపై కొందరు వామపక్ష భావజాలానికి చెందిన సోషల్ మీడియా ఖాతాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఒక మతతత్వ భావజాలం ఉన్న నేతతో మమ్ముట్టి ఇంతటి సాన్నిహిత్యం ఎందుకంటూ ప్రశ్నించాయి. దీంతో వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది.

ఈ విమర్శలపై గోపాలకృష్ణన్ తీవ్రంగా స్పందించాడు. తన కుమార్తె పెళ్లికి పినరయి విజయన్ సహా సీపీఎం, కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారని గుర్తుచేశాడు. రాజకీయాలకు, మతాలకు అతీతంగా వ్యక్తిగత స్నేహాలు ఉండాలని, మమ్ముట్టిపై జరుగుతున్న సైబర్ దాడులు సమర్థనీయం కాదని అన్నాడు.

ఇక్కడి వరకు కథ ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మమ్ముట్టిని విమర్శించిన పాత పోస్టు ఏమైంది?

2025 నవంబర్‌లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించినప్పుడు గోపాలకృష్ణన్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఆ అవార్డుల్లో మమ్ముట్టి, ఉత్తమ నటి షంలా హంజా, ప్రత్యేక జ్యూరీ ప్రస్తావన పొందిన ఆసిఫ్ అలీ, సినిమాటోగ్రాఫర్ షైజు ఖాలిద్, నటుడు సౌబిన్ షాహిర్, దర్శకుడు ఫాజిల్ మహమ్మద్ వంటి పేర్లను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ఈ పేర్లన్నీ ముస్లిం పేర్లే కావడంతో, ఎన్నికల సమయంలో ప్రభుత్వం మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకే అవార్డుల ఎంపిక చేసిందనే అర్థం వచ్చేలా ‘బిస్మయం.. బిస్మయం..’ అంటూ వ్యాఖ్యానించాడు. అవార్డుల ఎంపికను మతపరమైన కోణంలో ప్రశ్నించాడు.

అప్పట్లో పెట్టిన ఆ పోస్టు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. మమ్ముట్టి తన ఇంటికి వచ్చిన సందర్భంలో గోపాలకృష్ణన్ వ్యక్తిగత స్నేహం, మతసామరస్యం గురించి మాట్లాడుతుండటంతో పాత పోస్టును నెటిజన్లు గుర్తుచేశారు. దీంతో గోపాలకృష్ణన్ ఆ పోస్టును ఫేస్‌బుక్ నుంచి తొలగించాడు. నవంబర్ 10న మలయాళ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

అంటే ఒకవైపు మమ్ముట్టిని తన ఇంటికి ఆహ్వానించిన స్నేహితుడిగా అభివర్ణించడం.. మరోవైపు గతంలో అదే మమ్ముట్టి పేరును మతపరమైన వ్యాఖ్యలతో ప్రస్తావించిన పోస్టును తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సీపీఎం కూడా దూరం పెట్టలేదు.. దగ్గరకు తీసుకుంది! మరోవైపు మమ్ముట్టిపై విమర్శలు చేస్తున్నవారికి సీపీఎంతో సంబంధం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో ఎవరికి వారు పార్టీ మద్దతుదారులమని చెప్పుకుంటూ చేసే వ్యాఖ్యలను పార్టీ వైఖరిగా చూడొద్దన్నాడు. మమ్ముట్టికి వామపక్షాలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అవి కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని చెప్పాడు.

ఇది కూడా గమనించాల్సిన పరిణామమే. ఒకవైపు బీజేపీ నేత ఇంటికి వెళ్లాడని మమ్ముట్టిని విమర్శిస్తుంటే, మరోవైపు సీపీఎం సీనియర్ నేతలు ఆయనకు తమ పార్టీతో ఉన్న సంబంధాలను గుర్తుచేస్తున్నారు.

అసలు రాజకీయాలకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య గీత ఎక్కడ? మమ్ముట్టి బీజేపీలో చేరలేదు. ఆ పార్టీకి మద్దతుగా ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు. ఓ మిత్రుడి కుమార్తె పెళ్లికి వెళ్లలేకపోయాననే ఉద్దేశంతో అతడి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించాడు. అందులో రాజకీయాన్ని వెతకాల్సిన అవసరం ఏముంది? అన్నది ఒక వాదన.

అయితే మమ్ముట్టి వెళ్లిన వ్యక్తి గతంలో తనను, ఇతర నటీనటులను మతపరమైన కోణంలో విమర్శించిన నాయకుడు కావడంతో.. ఆయనతో మమ్ముట్టి సాన్నిహిత్యాన్ని ప్రశ్నించడంలో తప్పేముందని మరో వర్గం వాదిస్తోంది. గతంలో మమ్ముట్టి వయనాడ్ పర్యటన సందర్భంగా తన వెంట వచ్చిన సీపీఎం నాయకుడిని కూడా దూరంగా ఉండాలని కోరిన విషయాన్ని కొందరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. తన పర్యటనను పార్టీ కార్యక్రమంగా భావించకూడదన్నదే అప్పుడు మమ్ముట్టి ఉద్దేశమని గుర్తుచేస్తున్నారు.

ఏదేమైనా, ఈ వ్యవహారంలో మమ్ముట్టి మాత్రం మౌనంగానే ఉన్నాడు. వివాదంపై ఆయన నుంచి ఎలాంటి బహిరంగ స్పందన రాలేదు. సోషల్ మీడియాలో విమర్శల తీవ్రత తగ్గిందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టంగా తెలియదు.

కానీ గోపాలకృష్ణన్ పాత పోస్టును తొలగించడం మాత్రం ఈ వ్యవహారానికి కొత్త కోణాన్ని జోడించింది. వ్యక్తిగత స్నేహాలకు రాజకీయాలు అడ్డుకాకూడదనే మాట అందరికీ వర్తించాలి. నచ్చినప్పుడు స్నేహం.. నచ్చనప్పుడు మతం, రాజకీయాల పేరుతో విమర్శలు చేస్తే మాత్రం ఆ మాటలకు విలువ ఏముంటుంది?

మమ్ముట్టి ఆయన ఇంటికి వెళ్లడం కన్నా.. మమ్ముట్టిని విమర్శించిన ఆ పాత పోస్టును ఆయనే ఇప్పుడు తొలగించడమే ఈ మొత్తం వ్యవహారంలో అసలైన 'బిస్మయం' కాదా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లినా విమర్శలేనా..?!
  • సోనియా గాంధీ ఆరోగ్య రహస్యాలు… 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది..?
  • నిందించకండి- వాళ్లు రాముడి జెండా ఎగరేశారు విశ్వవీథుల్లో…
  • 3 లేదా 4 పెళ్లిళ్ల ఇండియన్ సెలబ్రిటీలు- తక్కువేమీ లేరు..!!
  • పవన్ ‘ఇడుపు కాయితం’ సంచలనం-! ఔనూ, ఈ కోట రుక్మిణి ఎవరు..?!
  • ‘సండియార్’ కమలహాసన్ ఆ పాత కొడవలితో గోక్కుంటున్నాడా..?
  • సో వాట్..? సీతమ్మను ఓ యోధురాలిగా చూపిస్తే తప్పేమిటిట..?!
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా స్వాధీనం చేసుకోబోతున్నదా? Part- 2
  • మెడ నొప్పికి ‘మెత్త’టి పరిష్కారం! ఈ దిండు ధర రూ.40 వేలు!!
  • రియల్ నంబర్ వన్ ! సూర్యను చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions