.
అసలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాక మనుషులు ఇలా తయారవుతారా..? లేక ఇలాంటోళ్లే తృణమూల్ పార్టీలో చేరడానికి అర్హులా..? ఈ సందేహం ఎంతోకాలంగా ఉంది… రైట్ ఫ్రమ్ మమతా బెనర్జీ దిగువ స్థాయి కార్యకర్త దాకా… సేమ్, సేమ్… ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవ్వరూ మినహాయింపు కాదేమో ఈ తేడా ధోరణులకు… బెంగాలీ జనం కర్రుకాల్చి వాతలు పెట్టినా, ఊరూరా తరుముతున్నా ఇప్పటికీ అంతే…
పర్ఫెక్ట్ తాజా ఉదాహరణ కీర్తి ఆజాద్… అప్పుడెప్పుడో క్రికెట్ ఆడి ఉద్దరించాడు లెండి… 1983 వరల్డ్ కప్ విజేతల టీమ్ సభ్యుడు… భగవత్ ఝా ఆజాద్ అని బెంగాల్ మాజీ సీఎం ఉండేవాడు, (మైథిలి హిందూ బ్రాహ్మిణ్)… తన కొడుకే ఈ ఆజాద్… అంతటి రాజకీయ కుటుంబంలో పుట్టినా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు… ఆ అర్హతే బహుశా తృణమూల్ కాంగ్రెస్‌కు అర్హత సంపాదించి పెట్టినట్టుంది…
Ads
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య ఒక ప్రధాన రాజకీయ పోరాట క్షేత్రంగా మారింది… వచ్చే నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రామ మందిరాన్ని సందర్శించనున్నాడు… ఈ ప్రతిపాదిత పర్యటనపై పలువురు బీజేపీ నాయకులు యాదవ్‌ను విమర్శించారు… ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య, తాను అయోధ్యలోని ఆ పుణ్యక్షేత్రాన్ని ఎప్పటికీ సందర్శించబోనని ప్రకటిస్తూ, రామ మందిరం- శ్రీరాముడిపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి…

తనేమంటాడంటే..? ‘‘దేశంలో పూజించే ఏకైక దైవం శ్రీరాముడేనా..? 3,200 కోట్ల దేవతలలో శ్రీరాముడు ఒక్కడేనా..? నేను అక్కడికి (అయోధ్యకు) ఎప్పటికీ వెళ్ళను… ఎందుకంటే, అగ్నిపరీక్షలో ఉత్తీర్ణులైన తన భార్యను శ్రీరాముడు విడిచిపెట్టి, ఆ మాతను తన ఇంటి నుంచి పంపించేశాడు…
సీత జన్మించిన మిథిలకు చెందినవాడిని నేను, ఆమెను తల్లిగా భావిస్తా… మిథిలకు చెందిన ప్రతి ఒక్కరికీ సీతామాత తల్లితో సమానం… నేను కాళీదేవిని పూజిస్తాను… కామాఖ్య, దక్షిణ కాళీ, కాళీఘాట్ వంటి ఆమెకు అంకితం చేయబడిన ఆలయాలతో పాటు ఢిల్లీలోని గోల్ మార్కెట్లో ఉన్న కాళీ ఆలయాన్ని కూడా సందర్శిస్తాను… బీజేపీ తన మతపరమైన ప్రసంగాలను ప్రధానంగా శ్రీరాముడిపైనే కేంద్రీకరిస్తూ, శ్రీకృష్ణుడిని విస్మరిస్తోంది…’’
…. పక్కా పిచ్చి కూతలు… ఈ 3200 కోట్ల దేవతలు అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో ఈ గణాంక నిపుణుడికి..? సీతమ్మ కోసం పోరాడతానంటూ రాముడిపైనే విమర్శలు… ఎన్నికల వేళ సంచలనం కోసం ఆరాటమా..? ఆ జ్ఞానం స్థాయి అంతేనా..? ఒక ఎంపీ మత విశ్వాసాలపై మాట్లాడేటప్పుడు కనీస అవగాహన, బాధ్యత ఉండాలి కదా..! ముఖ్యంగా కోట్లాది మంది ఆరాధించే ఒక దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం…
ఒక దేవతను ఆరాధించడానికి మరొక దేవతను తిరస్కరించాల్సిన అవసరం లేదు… రాముడిని పూజించేవారు కాళీమాతను కూడా పూజిస్తారు… కాళీమాత భక్తులు రాముడిని కూడా ఆరాధిస్తారు… రామాయణంలోని ఉత్తరకాండలో సీతమ్మను అడవులకు పంపిన ఘట్టంపై శతాబ్దాలుగా భిన్నమైన వ్యాఖ్యానాలు, విమర్శలు ఉన్నాయి… స్త్రీ కోణంలో రామాయణాన్ని పరిశీలించడం కూడా కొత్త విషయం కాదు…
కానీ ఒక ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మాత్రమే తీసుకుని మొత్తం పాత్రను కొట్టిపారేయడం, కోట్లాది మంది ఆరాధించే వ్యక్తిని రాజకీయ వ్యాఖ్యలకు ఉపయోగించుకోవడం చిల్లరతనం… పైగా నాది మిథిల కాబట్టి నా తల్లి కోసం మాట్లాడతాను అనే పిచ్చి కవరింగు… నీ తల్లి భర్తే శ్రీరాముడు, అంటే నీకు తండ్రి… ఈ సోయి కూడా లేదు…
అన్నట్టు… ఈ పెద్ద మనిషి బీజేపీ ఎంపీ ఒకప్పుడు… అరుణ జైట్లీతో పడలేదు, పైగా ఇలాంటి పిచ్చి కూతలు మొదటి నుంచీ అలవాటు కాబోలు బీజేపీ బహిష్కరించింది… తరువాత కాంగ్రెస్… సరిగ్గా ఇలాంటివాళ్లే కావాలని వెతికి పట్టుకునే మమత బెనర్జీ తనను టీఎంసీలోకి తీసుకుంది.. 2024లో ఎంపీగా గెలిచాడు,., రాజకీయాల్లో విమర్శలు చేయడానికి కూడా ఒక స్థాయి, సంయమనం ఉండాలి… టీఎంసీ నేతలకు తప్ప..!! కీర్తి ఆజాద్ ఈ తిక్క కూతలతో మమత బెనర్జీ అభిమానాన్ని మరింత పొంది ఉంటాడు… డౌట్ లేదు..!!
Share this Article