Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బామ్మా అన్నపూర్ణమ్మా… ఏమిటమ్మా ఇది..? ప్చ్, బాగోలేదు సుమీ!!

November 16, 2026 by M S R

.

తెలుగు సినిమాల్లో బామ్మ పాత్ర అనగానే ఒకప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేరు నిర్మలమ్మ. ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ఆయనకు బామ్మగా నటించిన తర్వాత నిర్మలమ్మ చాలామందికి ఇంట్లో మనిషైపోయింది. తెర మీద చిరంజీవికి బామ్మగా కనిపించినా, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు మాత్రం తమ సొంత బామ్మను చూసిన అనుభూతి కలిగించేది.

మనవడితో ప్రేమగా కబుర్లు చెప్పినా, కోపం వస్తే ‘ఒరేయ్ సన్నాసి’ అంటూ కసురుకున్నా నిర్మలమ్మకే చెల్లింది. ఆవిడ పలకరింపులో ఆప్యాయత, మందలింపులో ప్రేమ ఉండేవి. అందుకే ఆ తరం ప్రేక్షకులు నిర్మలమ్మను అంతగా ఓన్ చేసుకున్నారు. ఆవిడ బామ్మ పాత్రలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది.

Ads

నిర్మలమ్మ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులకు దగ్గరైన బామ్మ పాత్రలు పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత వచ్చినవాళ్లలో అన్నపూర్ణమ్మ కాస్త ఫ్యామిలియర్‌గా అనిపించింది. తల్లి పాత్రల్లోనూ, అత్త పాత్రల్లోనూ, బామ్మ పాత్రల్లోనూ సహజంగా ఒదిగిపోయి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

కానీ తాజాగా ‘హ్యాపీ జర్నీ’ సినిమాలో అన్నపూర్ణమ్మను చూసిన తర్వాత మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగింది. నిజం చెప్పాలంటే, ఆమె మీద ఇన్నాళ్లూ ఏర్పడిన అభిమానం, గౌరవం కొంత తగ్గినట్టనిపించింది.

annapoorna

ఆ సినిమాలో బామ్మ చేతిలో మందు బాటిల్ లేకుండా అడుగు ముందుకు పడదు. తాను తాగడమే కాకుండా చుట్టూ ఉన్న ఆడవాళ్లను కూడా ఒక పెగ్గు వేయమని ప్రోత్సహిస్తుంటుంది. (అఫ్‌కోర్స్.. మందు బాటిల్లో దర్శకుడు జ్యూస్ పోసి ఉండొచ్చు!) అదొక్కటేనా అంటే అదీ లేదు. సిగరెట్లను కూడా అలవోకగా ఊదిపారేస్తుంది.

ఇంకా రోమ్ వెళ్తే రోమన్‌లా ఉండాలన్న సామెత గుర్తొచ్చిందేమో.. అన్నపూర్ణమ్మకు జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు కూడా తొడిగించాడు దర్శకుడు. వెరసి ఒక ఆధునిక హాలీవుడ్ హీరోయిన్ తరహాలో బామ్మ పాత్రను తీర్చిదిద్దాడు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వయసు మళ్లిన వాళ్లు మందు తాగకూడదా? సిగరెట్ కాల్చకూడదా? జీన్స్ వేసుకోకూడదా? అనేది ప్రశ్న కాదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లది. కానీ తెర మీద ఒక పాత్రను ఎలా చూపిస్తున్నాం? ఆ పాత్రకు ఆ వేషధారణ, ఆ భాష, ఆ ప్రవర్తన ఎంతవరకు అవసరం? అన్నదే అసలు ప్రశ్న.

అన్నపూర్ణమ్మ గారూ.. ఇన్నాళ్లూ మీరు సినిమాల్లో హీరోలకు తల్లిగా, అత్తగా, బామ్మగా ఎన్నో మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. మీ ముఖం చూస్తేనే ఒక కుటుంబంలోని పెద్దావిడ గుర్తొచ్చేంతగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి మీరు ఈ సినిమాలో చేసిన వేషం ఒక్కసారి ప్రివ్యూలో అయినా చూసుకున్నారా అనిపించింది.

నిజానికి నేను కూడా సినిమా మొత్తం చూడలేదు. చేతిలో మందు గ్లాసుతో మీరు పెగ్గు వేస్తున్న సీన్ చూడగానే ఈ మాటలు రాయాలనిపించింది. సినిమాలో ఆ పాత్రకు ఏదైనా ప్రత్యేకమైన నేపథ్యం ఉండొచ్చు. దర్శకుడి ఉద్దేశం కూడా వేరే అయి ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడిగా ఆ సన్నివేశం చూసినప్పుడు కలిగిన భావన మాత్రం ఇదే.

ఇక వర్ధమాన హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేస్తూ ‘కథ డిమాండ్ చేసింది’ అని చెప్పినట్టు మీరు కూడా అదే మాట అనకండి. మీకూ వాళ్లకూ మధ్య వయసులోనే కాదు, ప్రేక్షకుల్లో ఏర్పడిన ఇమేజ్‌లోనూ చాలా తేడా ఉంది. అందాల భామలతో పోటీపడాల్సిన అవసరం మీకేముంది?

పారితోషికం ఎంత ఇచ్చినా, పాత్ర ఎంత వెరైటీగా ఉంటుందని చెప్పినా, మీకంటూ ఉన్న ఇమేజ్‌ను పణంగా పెట్టాల్సిన అవసరం ఏముంది? చిన్నపిల్ల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటే ‘నీ సైజుకు తగ్గ మాటలు మాట్లాడు’ అన్నట్టుగా.. మీ వయసుకు, మీ స్థాయికి, ప్రేక్షకుల్లో మీకున్న స్థానానికి తగ్గ పాత్రలు ఎంచుకుంటే బాగుంటుంది.

నిర్మలమ్మను ప్రేక్షకులు ఎందుకు అంతగా ప్రేమించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆమె బామ్మ పాత్రల్లో మందు బాటిళ్లు లేవు, సిగరెట్లు లేవు, గ్లామర్ హంగులూ లేవు. అయినా ఆ పాత్రలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే ఆమె ప్రేక్షకుల మనసుల్లో ఒక బామ్మగా స్థానం సంపాదించుకుంది.

అన్నపూర్ణమ్మ గారూ.. ఇది ఒక శ్రేయోభిలాషిగా చెబుతున్న మాట. మీకు రెట్టింపు పారితోషికం ఇచ్చినా సరే, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవద్దు. మీకున్న ప్రత్యేకమైన గుర్తింపును కాపాడుకోండి. హాయిగా మంచి అమ్మ పాత్రలు, అత్త పాత్రలు, బామ్మ పాత్రలు చేయండి. తెర మీద మీరొక కుటుంబ పెద్దగా కనిపిస్తేనే ప్రేక్షకులకు ఒక ఆత్మీయత కలుగుతుంది.

ప్రేక్షకుల మనసుల్లో సంపాదించుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక కళే కదా!…… (- – పరేష్ తుర్లపాటి)… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బామ్మా అన్నపూర్ణమ్మా… ఏమిటమ్మా ఇది..? ప్చ్, బాగోలేదు సుమీ!!
  • ఎంగిలి వార్తలకూ ఓ పద్ధతి ఉంటుంది డియర్ కేసీయార్ సర్..!!
  • కమెడియన్ సద్దాం నిజంగా ఘంటసాలను అవమానించాడా..?!
  • మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!
  • ఎన్టీఆర్ ఓడి- కృష్ణ గెలిచి… రెండు సింహాల నడుమ నలిగిన గిరిబాబు..!!
  • ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!
  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions