.
కలాం ఏమన్నాడు..? కలలు కనమన్నాడు… అవి నిజం కావడానికి కష్టపడమన్నాడు… ఈమె కూడా అంతే, ఎర్ర బస్సు మొహం కూడా చూడని మారుమూల పల్లెటూరు నుంచి, అదీ పేద కుటుంబం నుంచి… ఏకంగా భూమి పొలిమేరలు దాటి, ఖగోళంలో ప్రయాణించాలని కల కన్నది…
ఒక కల్పనా చావ్లా స్పూర్తి కావచ్చు… బేడీ బచావో బేడీ పడావో నినాదం కావచ్చు… అమ్మాయిల ఆత్మవిశ్వాసం వేగంగా పెరగడం వల్ల కావచ్చు… చాలామంది మహిళలు స్పూర్తిమంతంగా ఎదుగుతున్నారు… మరో పది మందికీ దారి చూపిస్తున్నారు… పౌరాణికాల వరకూ వోకే, కానీ తెలుగు సినిమాల చెత్త పెడపోకడలు, బూతు, బీభత్సపు హింసే మాస్ అప్పీల్ అన్నట్టుగా రోత దారిలో వెళ్తున్న హీరోల సినిమాలకన్నా ఇప్పుడు రిలీజైన ఆకాశంలో ఒక తార చాలా చాలా మేలు… మగ పిల్లలు సరే, మీ ఇంట్లో ఆడపిల్లలకు చూపించండి…
Ads
ఒక సినిమా సమాజానికి ఏం నేర్పించాలో చెబుతుంది… అలాగని ఈ సినిమా గొప్పదనో, కళాఖండమనో చెప్పడం లేదు… మైనస్ పాయింట్లున్నాయి… కానీ వరుసగా తెలుగులో వస్తున్న పరమ రోత సినిమాలతో పోలిస్తే బెటర్ అని చెబుతున్నాను… సినిమా విషయానికి వస్తే…
పాలలంక అనే మారుమూల గ్రామం… ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి కల్పన (సాత్విక వీరవల్లి)… ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్లాలని, వ్యోమగామి కావాలనేది కల… కానీ తండ్రి తాగుబోతు, తల్లికి- తనకు నిత్యనరకం… ఎలాగోలా టెన్త్ దాటుతుంది… తప్పనిసరై ఆ పక్కనే కోటిపల్లికి చెందిన కుర్రాడు కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది…

కానీ పెళ్లయిన రోజు రాత్రే తొలిసారి కల్పనతో మాట్లాడతాడు… పదహారేళ్లు నిండిన ఆ అమ్మాయి కలనీ, చదువుపై ఉన్న ఆసక్తినీ తెలుసుకుంటాడు… ఆమె కలలకు తాను రెక్కలు తొడగాలని నిర్ణయించుకుంటాడు… తనేం చేశాడు, గుజరాత్ వెళ్లాక పరిచయమైన రుహానీ శర్మ, శృతిహాసన్ ఎవరు..? అదీ కథ… కమర్షియల్ కోణంలో నిర్మాతకు ఇది డెడ్, డ్రై సబ్జెక్టు… కానీ దర్శకుడు సరైన ట్రీట్‌మెంట్‌తో పర్లేదు, రక్తికట్టించాడు…
ఖగోళం, అంతరిక్షం అనగానే ఎడాపెడా వీఎఫ్‌ఎక్స్ సీన్లను, ఎఐ గ్రాఫిక్కులను రుద్దలేదు… ఎమోషన్స్ ప్రధానంగా, పెద్దగా ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు లేకుండా సాఫీగా నడిపించాడు… అవును, ప్రతి కథలో ఘర్షణే ఎందుకు ప్రధాన పాత్ర పోషించాలి..?
ఆదర్శ భర్త తోడ్పాటుతో కల్పన ఇంటర్మీడియట్ చదువు, జేఈఈలో ర్యాంక్, తర్వాత ఐఎస్‌టీలో సీటు, అక్కడ చదువుకుంటూ చేసే రాకెట్ ప్రయోగం … ఇలా ప్రథమార్ధం ఆద్యంతం ఆసక్తికరం… సెకండాఫ్ కాస్త డిఫరెంట్… శృతిహాసన్ పాత్ర ముఖ్యం… కల్పనని వెదుకుతూ ఆమె… ఆమెను వెదుకుతూ దుల్కర్… ఆ ముగ్గురూ ఒకే చోట కలవడం…

ప్లాస్మా ప్రొపల్షన్ ఇంజిన్ ప్రయోగం కోసం స్కై వాక్ బృందంలోకి కల్పన చేరి కథ ఆసక్తికరంగా మారుతుంది… అక్కడక్కడా సినిమాటిక్ కథనం సాగినా, అంతిమంగా మనం తెలుగు తెరపై భిన్నమైన కథాంశాన్ని చూస్తున్నామనే ఫీల్ ఆ అసంతృప్తిని అధిగమిస్తుంది…
డైలాగ్స్ ఎవరు రాశారో కానీ కొన్ని బాగున్నాయి… ‘నీ కల ఆకాశమైనప్పుడు.. నేను భూమితో ఏం చేసుకుంటాను’, ‘తన కలలకు నేనే కాళ్లు అయి నడిపిస్తాను’, ‘పదిమంది నవ్వితే ఏంటి? ఒక్కరు నమ్మితే చాలదా’… ఇలాంటివి…
కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మెరిశాడు… నిజానికి దుల్కర్ ఎంచుకునే పాత్రలే బాగుంటాయి… జయాపజయాల మాటెలా ఉన్నా, భిన్న పాత్రల్ని చేయడానికి, మెప్పించడానికి తన మ్యాగ్జిమం ఇచ్చేస్తాడు… ఇక సినిమాలో అసలు బలం సాత్విక వీరవల్లి… బాగా చేసింది, ఆమెకు ఇండియన్ సినిమాలో ఫ్యూచర్ ఉంటుంది… మంచి ప్లానింగ్, జాగ్రత్త గనుక పాటిస్తే… శృతిహాసన్, రుహానీ శర్మ వోకే…
కథలో కలిసిపోయే పాటలు, డబడబ మోతలు గాకుండా మంచి బీజీఎం… థియేటర్లకు రండీ రండీ అని పిలుపులు ఇవ్వడం కాదు, వచ్చేలా చేసే సినిమాలు తీయండి, మేం తప్పకుండా వస్తాం..!!
Share this Article