Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతా అతను చెప్పినట్టే జగన్ అడుగులు … భారతి చేతికి పగ్గాలు …

November 21, 2026 by M S R

.

Zamin Ryot dolendra prasad …. తమిళనాడు కపిల్ సాహు వ్యూహంతో పార్టీ పునర్నిర్మాణ ప్రయత్నాలు!
వైకాపా పెత్తనం వైఎస్ భారతమ్మ చేతికి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని అన్ని విధాలా సమాయత్తం చేయడానికి వివిధ దశల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ప్రధానమైనది – జగన్ బదులుగా భారతీరెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టడం; రెండవ ముఖ్యమైన పరిణామం – ఎన్నికల వ్యూహకర్తగా కపిల్ సాహు అనే మాజీ ఐప్యాక్ నిర్వాహకుడిని నియమించుకోవడం.

Ads

సాహు, మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి సలహాదారుగా పనిచేశాడు. విజయ్ పార్టీకి అనూహితంగా, 108 స్థానాల్లో గెలుపు దక్కడానికి వెనుక సాహు ప్రణాళికలు పనిచేశాయని చెబుతారు. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసేటప్పుడు, కపిల్ సాహు ఆ కంపెనీ తరఫున ఓటరు డేటా విశ్లేషణ, రాజకీయ వ్యూహ రచన, ప్రచార పోకడల విభాగాన్ని నిర్వహించేవాడు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కొన్ని ఎన్నికల్లో ఉపయోగపడ్డాడు. ఆయనకు క్రైసిస్ మేనేజర్‌గా పేరుంది.

తమిళనాడు ఎన్నికల సందర్భంగా కరూర్ తొక్కిసలాటలో 41 మంది విజయ్ అభిమానులు మరణించిన దుర్ఘటన ప్రభావం పార్టీ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కపిల్ సాహు ప్రతిభావంతంగా పనిచేశాడని చెబుతారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కజిన్ తమ్ముడైన వైఎస్ అనిల్‌ కుమార్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యం ఆధారంగా కపిల్ సాహును వైకాపా వ్యూహకర్తగా ఎంపిక చేశారని వినికిడి.

ys jagan reddy

మొన్నటి స్థానిక ఎన్నికల విషయంలోనే పార్టీ విధానాన్ని సాహు నిర్దేశించాడట. నామినేషన్ల వరకు, ఎక్కడా ఏకగ్రీవం కాకూడదని జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు. నియోజకవర్గ ఇన్‌చార్జీలను భయపెట్టాడు. ఎక్కడ ఏకగ్రీవం జరిగితే, అక్కడ టికెట్ ఇవ్వనని హెచ్చరిక చేశాడు. తీరా నామినేషన్ల తంతు ముగియగానే, ఎన్నికల విషయం పట్టించుకోవడం మానేశాడు. తన స్వంత ఊరైన పులివెందులలో ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపలేదాయన.

ఇదొక వ్యూహం ప్రకారం జరిగిందని, ఆ వ్యూహం కపిల్ సాహు రచించాడని బయటకు వస్తున్నది. ఈ ఎన్నికల్లో మనం ఓ పార్టీగా పోటీ చేయవద్దు, కానీ మన అభ్యర్థులు మాత్రం బలంగా నిలబడాలి, ఎన్నికల్లో మనవారి సత్తా ఎంత, కూటమి పార్టీల శక్తి ఏమిటి అనే అంచనా మాత్రం వేసుకుందాం. దాన్నిబట్టి భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు తయారు చేద్దామని చెప్పాడట సాహు. ఆ సూచన అక్షరాలా పాటించాడు జగన్.

ఒక రకంగా చెప్పాలంటే, ఈ వ్యూహం సంగతి తెలియకుండా, జగన్ బెదిరింపులు, హెచ్చరికలు విని, వైకాపా తీవ్రంగా పోటీకి దిగుతుందేమో అనే భయంతో, తన శక్తినంతా వినియోగించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పార్టీ యంత్రాంగం మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి, ఎక్కువ స్థానాల్లో గెలుపు కోసం ఎమ్మెల్యేలు అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించాడు. నామినేషన్లు వేసేటప్పుడు, స్క్రూటినీ సమయంలో, కౌంటింగ్ కేంద్రాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులను వాడుకున్నారు. ఎక్కువ స్థానాల్లో గెలిచామని సంబరపడిపోయాడు.

ఈ తతంగం మొత్తాన్ని దూరం నుంచి గమనిస్తూ, తమ పార్టీ పరిస్థితిని విశ్లేషించుకున్నాడు జగన్. గెలుపు, ఓటముల మీద దృష్టి పెట్టలేదాయన; ఎన్నికల నిర్వహణలో తమవారి సామర్థ్యాన్ని పరీక్షించుకున్నాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నా, ఒకటి రెండు చోట్ల తప్ప అభ్యంతరం, ఆగం చేయకుండా పట్టీ పట్టనట్లు వుండిపోయాడు. ఇదంతా సాహు వ్యూహం ప్రకారమే నడిచింది.

ఇప్పుడు వారి వద్ద సమగ్రమైన డేటా సిద్ధమైంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత మేర ఓటర్ల ఆదరణ వుంది, గతం కంటే పెరిగిందా, తగ్గిందా, తెలుగుదేశం ఎమ్మెల్యేల బలం ఏమిటి, వారి పట్ల ఓటర్ల తీరు ఏమిటి వంటి సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్నారు. ఈ విశ్లేషణలో వైకాపాకు గత శాసనసభ ఎన్నికల కంటే అధికంగా ఓటరు సానుభూతి కనిపించిందని, పార్టీ నేతలు ఎన్నికలను గాలికి వదిలేసినా ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని అంచనాకు వచ్చారట.

మరో ప్రక్క పార్టీ రోజువారీ వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారిని పక్కన పెట్టి, భారతీరెడ్డి తానే స్వయంగా శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తున్నది. సాహు బృందంతో సమానంగా ‘సాక్షి’ పత్రికా విలేకరుల బృందాన్ని తయారు చేసుకున్నారామె. నమ్మకస్తులైన విలేకరులు, మేనేజ్‌మెంట్ సిబ్బందితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలు, ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతల వివరాలన్నీ ఈ బృందం సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎలా పనిచేశారనే నివేదిక ఇప్పటికే సిద్ధమైందట.

  • చాలామంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డబ్బుకు ఆశపడి, లేదా కేసులకు భయపడి కూటమి నేతలతో పరోక్షంగా సహకరించిన వివరాలను భారతీరెడ్డి సేకరించారు. వీరిపై ఓ కన్నేసి వుంచడంతో పాటు, రేపు ఎన్నికల సమయంలో టికెట్ల ఎంపిక సమయంలో ఈ సమాచారం తనకు అందజేయాలని ‘సాక్షి’ బృందాన్ని ఆదేశించిందట ఆమె. (పార్టీ అధికార ప్రతినిధి ఒకరు సాక్షి సీఈవోగా నియమించబడ్డాడు తాజాగా..)

భారతీరెడ్డి ప్రధాన సహాయకుడిగా పూడి శ్రీహరి అనే మాజీ సాక్షిటీవీ విలేఖరి నియమితుడైనాడు. ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పూడి ముత్యాలనాయుడు సమీప బంధువు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీహరికి ఒక పోస్టు కూడా కేటాయించారు. భారతీరెడ్డికి పార్టీ సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయడంలో శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మీడియా సలహాదారు బాధ్యత కూడా ఆయనకే అప్ప చెప్పారట.

వైకాపా ఆరంభం నుంచి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా; జి.వి.జి. కృష్ణమోహన్‌రెడ్డి, తలశిల రఘురామ్, ధనుంజయరెడ్డి వంటి వారు పార్టీ నిర్వహణ చూసేవారు. వీరిలో విజయసాయిరెడ్డి వెళ్లిపోయాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చూపుడుకి పార్టీలో వున్నాడు కానీ, ఏ నిర్ణయంలోనూ ఆయనకు ప్రమేయం ఇవ్వడం లేదు. గతంలో ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు, కొందరు మంత్రుల ఎంపికలో కూడా సజ్జల కీలకంగా వ్యవహరించాడు. దానికి భారీ నజరానాలు కూడా స్వీకరించేవాడని భారతి వద్ద సమాచారం వుంది. ఏ కారణం వల్లనో ఇప్పుడు ఆయన్ను భారతీరెడ్డి పూర్తిగా దూరం పెట్టేశారు.

వై.వి.సుబ్బారెడ్డి తనంతట తానుగా పార్టీకి దూరంగా మసలుతున్నాడు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యత ఒక్కటే ఆయనకు వుంది. అది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ కారణం వల్లనో తెలియదు కానీ, వై.ఎస్.జగన్ పెద్దగా రాజకీయ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం లేదు. చుట్టపు చూపుగా తాడేపల్లికి రావడం, ఎంపిక చేసుకున్న పత్రికా విలేఖరులకు ఉపన్యాసం చెప్పడం, తూతూ మంత్రంగా పార్టీ నేతలను కలిసి బెంగళూరు వెళ్లిపోవడం ఆయన దినచర్యగా మారింది. దాంతో పార్టీ పూర్తి కాలపు బాధ్యత భారతి చేపట్టక తప్పలేదు. రేపటి ఎన్నికల తర్వాత, ప్రభుత్వంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించే ఆలోచనలు వున్నట్లు వినికిడి.

మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ఓటమికి వైకాపా నాయకత్వం ఆవేదన చెందడం లేదు. మంచే జరిగింది అనే భావనతో వున్నారట వారు. ఈ అనుభవంతో ఎమ్మెల్యే ఎన్నికల వ్యూహాన్ని లోపాలు లేకుండా రచించుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా అతను చెప్పినట్టే జగన్ అడుగులు … భారతి చేతికి పగ్గాలు …
  • కాంగ్రెస్‌ను కాదని… ఇండి కూటమి ప్రాంతీయ పార్టీల సపరేట్ బాట !!
  • పాపం సాయిపల్లవి..! తోడుగా శ్రీలీల ఉన్నా ప్రయోజనం ఓ గుండు సున్నా!!
  • ‘అమ్మ’కు వీడ్కోలు! ఎంతటి కఠోర సన్యాసమైనా ఆ ఒక్క పేగుబంధమే!!
  • హరీష్ రావుపై సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్! 
  • అమెజాన్ అడవుల్లో ఓ ఆర్తనాదం – ‘‘మమ్మల్ని బతకనిస్తారా’’
  • “డోరతి” చూసినప్పటి నుంచి రోజుకొక్కసారైనా గుర్తుకొస్తున్నాడు…
  • ’ఆకాశంలో ఒక తార’ మెరిసింది – రోత సినిమా చీకట్లలో ‘స్పూర్తి వెలుతురు !!
  • ఆ బ్రీఫ్‌కేసు తెరిచి, ఓ ఎర్రబటన్ నొక్కగానే… అణ్వాయుధాలు పేలవు!!
  • అల్లు అరవింద్ చెప్పింది నిజమే- ఈ తెలుగు కొత్త తార సాత్విక మెరిసింది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions