Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

The Lakshmana – ప్రయోగం వికటిస్తే దర్శకుడి ముక్కూచెవులు జాగ్రత్త !!

November 23, 2026 by M S R

.

రావణుడిని సమున్నతంగా చూపించినందున, వాల్మీకి రామాయణానికి వక్రబాష్యాలు చెబుతున్నందున రామాయణం సినిమాను తక్షణం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసినట్టు ఎక్కడో చదివాను… వెంటనే మరో స్టోరీ కనిపించింది… అది లక్ష్మణుడి కోణంలో రామాయణాన్ని, లక్ష్మణుడిని కొత్త పరిచయం చేసే సినిమాకు సంబంధించి…

అది రొటీన్ గ్రాఫిక్స్ సినిమా కాదు, ఫోటోరియలిస్టిక్ ఎఐ సాంకేతికతతో నిర్మితమయ్యే సినిమా, ఇలాంటి సినిమా  దేశంలో ఇది ప్రథమం అంటున్నారు మేకర్స్, లక్ష్మణుడు ఓ అనకొండతో (భారీ సర్పంతో) పోరాడే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు… The Lakshmana – Untold Story కోణం- భిన్న కథాంశం మంచిదే…

Ads

అసలు ఈ ఫోటోరియలిస్టిక్ ఎఐ బేస్డ్ సినిమా విజయవంతం అవుతుందానే డిబేట్ ఇక్కడ అక్కర్లేదు… ఆమధ్య హొంబలె ఫిలిమ్స్ వాళ్లు హాలీవుడ్ తరహా ఆధునిక యానిమేషన్ సాంకేతికతతో నిర్మించిన మహావతార్ నర్సింహ హిట్… మిగతా అవతారాల సీరీస్ కూడా తీస్తామని ప్రకటించారు, సో, కథ ప్రేక్షకుడి పల్స్ పట్టుకుంటే డబ్బులే డబ్బులు… పైగా తారాగణం ఎంపికల మీద అనవసర రచ్చ కూడా ఉండదు, వాళ్ల పేమెంట్స్ చికాకులూ ఉండవు…

ఐతే ఇక్కడ మేకర్స్ ఏం కథ చెప్పబోతున్నారు అనేదే సందేహం… ఈ సందేహం ఎందుకొచ్చిందీ అంటే… సేమ్, అదే టైటిల్‌తో  (Lakshman: An Untold Perspective of a MAHAYODDHA)  కపిల్ సంఘవి అనే పాపులర్ ఇంగ్లిష్ రచయిత ఓ నవల రాశాడు… సేమ్, రామాయణాన్ని లక్ష్మణుడి కోణంలో చెబుతాడు… అది లక్ష్మణాయణం… లక్ష్మణుడే కథానాయకుడు అందులో…

పలుచోట్ల పలువురు రాసినట్టు గుర్తు… లక్ష్మణుడు ఓ మంచి తమ్ముడు… ఓ పరాక్రమశాలి… ఓ త్యాగశీలి… కానీ ఆవేశపరుడు, ఓ మంచి భర్త కాలేకపోయడు అంటూ… కపిల్ సంఘవి రాసిన నవల పరిచయం ఏం చెబుతున్నదీ అంటే…

  • ‘‘మహాయోధ లక్ష్మణుడు అత్యంత శక్తివంతమైన యోధులతో పోరాడాడు, కానీ అతని తొందరపాటు మనస్తత్వం అతని ఆత్మను ఐదు ఘోర పాపాలు చేసేలా బంధించింది. ఈ ఐదు పాపాలు వారి జీవిత గమనాన్ని మార్చి, వారి కథను గొప్ప గాథలలో ఒకటిగా నిలిపాయి. రాముని నమ్మకస్తుడైన లక్ష్మణుడు, ఈ కథనమంతటా అనేక అంతర్గత, బాహ్య సవాళ్లతో పోరాడుతూ కల్లోలభరితమైన జీవితాన్ని గడిపాడు. యుద్ధభూమిలో అతని అసాధారణ శౌర్యం అందరికీ తెలిసిందే, కానీ అతని హృదయంలోని సంఘర్షణ మాత్రం అంతుచిక్కకుండానే మిగిలిపోయింది…’’

lakshmana

ఈ ఫిలిమ్ మేకర్స్ ఏమీ చెప్పలేదు, కపిల్ సంఘవి కథనే ఆధారంగా తీసుకున్నట్టు నిర్దారణ ఏమీ లేదు, మన సందేహం మాత్రమే… అంతేకాదు, లక్ష్మణుడి కథను ఎలా చెప్పనున్నారనేదే ప్రధానం… కపిల్ సంఘవి నవల పరిచయంలో లక్ష్మణుడు చేసినట్టు చెబుతున్న ఐదు పాపాలు ఏమిటి, అతని ఆత్మవేదన ఏమిటి..? కంటవర్సీ పాయింట్స్…

శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం మొదలు భరతుడి రాకను అనుమానించి యుద్ధానికి సిద్ధపడటం వరకు లక్ష్మణుడి ఆగ్రహావేశాలకు ఉదాహరణలు కనిపిస్తాయి… అయితే ప్రతి సంఘటన వెనుక ఓ సందర్భం, ఓ కారణం ఉన్నాయి… వాటిని కేవలం పాపాలుగా నిర్వచించగలమా? అన్నది చర్చనీయాంశం…

ఎందుకంటే..? లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారంగా రామాయణంలో విశిష్ట ఆధ్యాత్మిక పాత్ర… సో, ఐదు పాపాలు, ఆత్మసంఘర్షణ అంటూ కొత్త ప్రయోగానికో, వికట ప్రయోగానికో దిగితే చిక్కులు తప్పవు… లేదు, ఆ నవలతో మాకేం సంబంధం లేదు అని ఫిలిమ్ మేకర్స్ క్లారిటీ ఇస్తే ఏ గొడవా ఉండదు…

సినిమా సాంకేతిక విషయాల్లోకి వద్దాం… ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారట… ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా సినిమా చేస్తున్నది ఇదే కదా… కాకపోతే ఇదంతా ఎఐ బేస్డ్…  సాంకేతికంగా ఇది ఆసక్తికరమైన ప్రయోగమే. అయితే సినిమా పోస్టర్‌లో కనిపించిన ఓ దృశ్యం, సినిమాలో ఫాంటసీ పోర్షన్ ఎక్కువగా ఉండనున్నట్టు చెబుతోంది…

సినిమా పోస్టర్‌లో కనిపిస్తున్న మరో దృశ్యం కూడా ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది… భారీ సర్పంతో లక్ష్మణుడు తలపడుతున్నట్టుగా పోస్టర్‌ను రూపొందించారు… చూడటానికి అద్భుతమైన విజువల్‌గా అనిపించినా, ఆ సర్పం అనకొండను పోలి ఉంది… అనకొండలు దక్షిణ అమెరికాకు చెందిన భారీ సర్పాలు… అమెజాన్, ఒరినోకో నదీ పరివాహక ప్రాంతాలు వాటి సహజ ఆవాసాలు… భారత ఉపఖండంలో సహజంగా కనిపించే సర్పజాతి కాదు… మరి రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు సంచరించిన అరణ్యాల్లోకి అనకొండలు ఎక్కడి నుంచి వచ్చాయి?

పోస్టర్ ఒక్కటే చూసి సినిమా కథను నిర్ణయించలేం… అది కేవలం ప్రచార చిత్రం కావచ్చు… కానీ రామాయణాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు దృశ్య వైభవంతో పాటు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలపైనా జాగ్రత్త అవసరం…



సాధారణ యానిమేషన్‌లో పాత్రలకు కదలికలు ఇవ్వడానికి చిత్రాలను గీయడం లేదా కంప్యూటర్‌లో త్రీడీ మోడళ్లను రూపొందించడం జరుగుతుంది… ఒక పాత్ర ఎలా నడవాలి, ఎలా పరుగెత్తాలి, ముఖంలో ఎలాంటి భావాలు పలకాలి, చేతులు ఎలా కదలాలి అన్నది యానిమేటర్లు రూపొందిస్తారు… వేలాది ఫ్రేములను కలిపి కదిలే దృశ్యాలుగా మారుస్తారు…

సీజీఐ (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ) అంటే కంప్యూటర్ సాయంతో సృష్టించే దృశ్యాలు… ఇందులో పాత్రలు, భవనాలు, అడవులు, పర్వతాలు, యుద్ధరంగాలు, భారీ జంతువులు ఇలా ఏవైనా సృష్టించవచ్చు… అవి నిజంగా కనిపించేలా ఉండొచ్చు, కార్టూన్ల మాదిరిగా కూడా ఉండొచ్చు… గ్రాఫిక్స్ అనేది ఇంకా విస్తృతమైన పదం… సీజీఐ, యానిమేషన్ రెండూ దాని పరిధిలోకి వస్తాయి… అంటే యానిమేషన్, గ్రాఫిక్స్ రెండూ ఒకటే కాదు…

ఇక ఏఐ ఫోటోరియలిస్టిక్ విధానం కొంత భిన్నమైనది… మనం ఒక సన్నివేశాన్ని ఎలా ఉండాలో వర్ణించి చెబితే, ఏఐ మోడళ్లు అందుకు అనుగుణంగా చిత్రాలను, వీడియో దృశ్యాలను రూపొందిస్తాయి… ఉదాహరణకు అడవిలో నడుస్తున్న లక్ష్మణుడు, ఎదురుగా భారీ సర్పం, చుట్టూ దట్టమైన చెట్లు, సూర్యకాంతి, యుద్ధ వాతావరణం… ఇలాంటి దృశ్యాన్ని ఏఐ సాయంతో ఫోటోలో చూసినంత సహజంగా రూపొందించవచ్చు…

దీనినే ఫోటోరియలిస్టిక్ విజువల్స్ అంటారు… అంటే కంప్యూటర్ సృష్టించిన దృశ్యాలు కూడా నిజంగా కెమెరాతో చిత్రీకరించినట్టుగా కనిపించడం… ఇందులో ప్రతి పాత్రను, ప్రతి కదలికను సంప్రదాయ పద్ధతిలో చేతితో రూపొందించాల్సిన అవసరం కొంత తగ్గుతుంది… అయితే కథ, సన్నివేశాల రూపకల్పన, పాత్రల రూపాల్లో ఏకరూపత, ముఖ కవళికలు, కదలికల సహజత్వం, ఎడిటింగ్, సంగీతం, సౌండ్ డిజైన్ వంటి అంశాల్లో మానవ సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం ఇప్పటికీ కీలకమే…

ఇది కేవలం కార్టూన్ యానిమేషన్ కాదు… నిజమైన మనుషులు, నిజమైన ప్రదేశాలు ఉన్నట్టుగా కనిపించే డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం… అందుకే ఈ సాంకేతికతతో రామాయణం వంటి భారీ ఇతిహాసాన్ని ఆవిష్కరించడం ఆసక్తికరమైన ప్రయోగం కాగలదు…

కానీ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, కథలోని ఆత్మను మార్చేయడానికి అది కారణం కాకూడదు… రామాయణంలోని పాత్రలకు కొత్త కోణాలు ఆవిష్కరించవచ్చు… వాటి వ్యక్తిత్వంలోని తెలియని పార్శ్వాలను చూపించవచ్చు… అయితే అలా చేసేటప్పుడు మూల ఇతిహాసానికి, సంప్రదాయ విశ్వాసాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా ఉంచాలి…

రామాయణాన్ని కొత్త సాంకేతికతతో చూపించడం గొప్ప ప్రయోగమే. కానీ ఆ ప్రయోగంలో రామాయణమే కొత్తగా మారిపోకూడదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • The Lakshmana – ప్రయోగం వికటిస్తే దర్శకుడి ముక్కూచెవులు జాగ్రత్త !!
  • ఒక వేర్పాటువాది- ఒక ఉగ్రవాది …! ఇండియా వ్యవహారాల్లో అమెరికా జోక్యం !?
  • అసలు ఆమె ఎవరు..? ఈ పోలీస్ అతి భద్రతలు, బందోబస్తులు దేనికి..?
  • ఓ మలయాళీ హీరోకు తెలుగులో ఇంత మంచి స్పేస్ ఎలాగంటే..?
  • ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ… ఆ పొగల చాయ్ తాగితేనే కదా అసలు మజా !!
  • కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!
  • ఎఐ రంగులు అద్దుకుని కొత్తగా వినిపిస్తున్న ఆపాత మధురాలు !
  • రాధికా ఆప్టే ఎద్దేవా నుంచి- సుప్రీంకోర్టు దాకా…. మేనరికాలు!!
  • తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!
  • ముఖ్యమంత్రి కాదు… మఠాధిపతి కాదు… ఆ అమ్మకు మాత్రం కొడుకే!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions