.
సిలికాన్ వ్యాలీలో రేగిన పెను తుఫాను, భారత కుబేరుల పాలిట కల్పవృక్షంగా మారింది. అమెరికా చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ ఉద్వాసన, ఆగ్నేయాసియా దేశాల మీదుగా చైనాకు సాగుతున్న అక్రమ కంప్యూటింగ్ రవాణాపై వాషింగ్టన్ ఉక్కుపాదం మోపడం అంతర్జాతీయ టెక్ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
ఈ పరిణామాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా గ్రూప్ వంటి భారత దిగ్గజాలకు ఊహించని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) వరాన్ని అందిస్తున్నాయి.
Ads
ఆగ్నేయాసియాకు చెక్.. భారత్‌కు రెడ్ కార్పెట్
సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ (Megaspeed) సంస్థతో ఎన్విడియాకు ఉన్న సంబంధాలు, ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌పై చైనా గూఢచర్యం ఆరోపణలు రావడం అమెరికాను అప్రమత్తం చేసింది. దీనికి తోడు జెన్సన్ హువాంగ్ పదవీచ్యుతితో, ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియాలోని డేటా సెంటర్లపై అమెరికా వాణిజ్య శాఖ కఠిన ఆంక్షలు విధించింది.
అధునాతన చిప్‌ల ఎగుమతులపై ‘కేస్-బై-కేస్’ లైసెన్సింగ్ నిబంధనలు పెట్టడంతో, ఆ ప్రాంతంలో డేటా సెంటర్ల జోరుకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాక్స్ సిలికా’ (Pax Silica) ఒప్పందంలో భారత్ భాగస్వామిగా ఉండటం మన దేశానికి కలిసొచ్చింది. చైనాకు సాంకేతికత అందకుండా కట్టడి చేసే ఈ కూటమిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా నిలవడంతో, అమెరికా టెక్ దిగ్గజాల చూపు ఇప్పుడు భారత్ వైపు మళ్లింది.

కుబేరుల $200 బిలియన్ల మహా యజ్ఞం
అమెరికా టెక్ కంపెనీలకు నమ్మకమైన ఆసియా వేదికగా మారేందుకు భారత పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పటికే 200 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16.5 లక్షల కోట్లు) పైగా పెట్టుబడులతో సిద్ధమయ్యాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ముకేశ్ అంబానీ)…: రాబోయే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్ల ($107 బిలియన్) పెట్టుబడితో గిగావాట్ స్థాయి ఏఐ హబ్‌ను నిర్మిస్తోంది. పశ్చిమ తీరంలో మెటా (Meta) కోసం 168 మెగావాట్ల డేటా సెంటర్‌తో పాటు, ‘లామా’ (Llama) ఏఐ సాఫ్ట్వేర్ విక్రయాలకు ఒప్పందం కుదుర్చుకుంది.
అదానీ గ్రూప్ (గౌతమ్ అదానీ) : 2035 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్లను నిర్మించనుంది. తూర్పు తీరంలోని విశాఖపట్నంలో గూగుల్ (Google) సబ్-సీ కేబుల్ ప్రాజెక్టుతో జతకట్టడమే కాకుండా, అమెరికాకు చెందిన జాబిల్ (Jabil) సంస్థతో కలిసి ఏఐ సర్వర్ల తయారీకి సిద్ధమైంది.
టాటా గ్రూప్…: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టాటా గ్రూప్, ఓపెన్ఏఐ (OpenAI) కోసం 100 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. భవిష్యత్తులో దీనిని ఒక గిగావాట్‌కు విస్తరించే అవకాశం ఉంది.
గుజరాత్‌లోని కచ్ ఎడారి ప్రాంతంలో అదానీ, అంబానీలు నిర్మిస్తున్న భారీ గ్రీన్ ఎనర్జీ (సోలార్) పార్కులు, ఈ విద్యుత్ ఆధారిత డేటా సెంటర్లకు ప్రధాన బలంగా మారనున్నాయి. ఇటీవల మార్కో రూబియో ముంబైలో అదానీ, టాటా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌లతో భేటీ కావడం, జామ్‌నగర్‌లోని అంబానీ కాంప్లెక్స్‌ను సందర్శించడం ఈ వ్యూహాత్మక బంధానికి నిదర్శనం.

ముందున్న సవాళ్లు.. నిబంధనల కత్తి!
అవకాశాలు అద్భుతంగా ఉన్నా, భారత దిగ్గజాల ముందు కొన్ని కఠిన సవాళ్లు పొంచి ఉన్నాయి…
కఠినమైన కేవైసీ (KYC) తనిఖీలు…: భారత్‌లో దేశీయ డిమాండ్ ఇంకా పూర్తి స్థాయిలో పెరగనందున, విదేశీ క్లయింట్లకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని (AI Tokens) విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ఏ ఒక్క షెల్ కంపెనీ ద్వారా కూడా చైనాకు ఈ సేవలు అందకుండా కఠినమైన యాజమాన్య తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది…
అమెరికా-చైనా దౌత్యం…: షెన్జెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరగనున్న భేటీలో వాణిజ్య ఒప్పందాల కోసం చిప్ ఆంక్షలను సడలిస్తే, భారత్‌కు ఉన్న ఈ ప్రత్యేక ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది…
రాజకీయ విచారణలు…: వచ్చే జనవరిలో అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు తిరిగి సబ్పోనా (విచారణ) అధికారాలు పొందితే, అదానీ గ్రూప్‌పై గతంలో ఉన్న కేసుల అంశం మళ్లీ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి…
మొత్తానికి, సిలికాన్ వ్యాలీ సంక్షోభం భారత కార్పొరేట్ రంగానికి అమెరికా సాంకేతికతకు ‘గేట్ కీపర్లు’గా ఎదిగే సువర్ణావకాశాన్ని ఇచ్చింది… వాషింగ్టన్ గీసిన లక్ష్మణ రేఖలను దాటకుండా నిబంధనలను పక్కాగా అమలు చేయగలిగితే, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం…
Share this Article