Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!

September 24, 2026 by M S R

.

( రమణ కొంటికర్ల ) …  అమెరికా నుంచి బీహార్ పల్లెకు పెళ్లి చేసుకుని కోడలుగా వచ్చింది ఓ మహిళ. ఇప్పుడామె తన జీవితంలోని విశేషాల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తుండటంతో భిన్నరకాల చర్చలు కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ గా మారి… చేతిలో మోబైల్ క్లిక్కుతో భూమి చుట్టి వస్తున్న సాంకేతికత అందుబాటులోకొచ్చింది. ఇంకోవైపు, తమ కొడుకు, కూతురు అమెరికా, యూరప్, బెహ్రైన్ లో ఉంటున్నారని చెప్పుకోవడం సమాజంలో గర్వంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో… ఓ అమెరికా మహిళ మరి మన భారత పల్లెల్లో ఎలా జీవిస్తోందన్న ఆసక్తికర కోణాన్ని ఓసారి పరిశీలిద్దాం.

పేరులోనే హోప్! జీవితమంటేనే ఆశ. ఆశ మనిషిని నిలబెడుతుంది. ఆశే మనిషిని బతికిస్తుంది. అలాంటి ఆశతోనే బీహార్ కు వచ్చింది.. ఈ హోప్. అందుకే ఈమె కథ కాస్త ప్రత్యేకతం.

Ads

అమెరికాలోని అట్లాంటాకు చెందిన హోప్… ఇప్పుడు బీహార్ లోని ఓ గ్రామంలో తన భర్త అభిషేక్ సింగ్, కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఈమె జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో తను షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఆసక్తి రేపుతోంది.

hope sing

హోప్ సింగ్ భారత్ కు రావడమే విశేషం కాదు.. తను ఎంచుకున్న జీవితమే అందుకు కారణం. ఇవాళ మధ్య తరగతిలో కూడా వాషింగ్ మెషీన్స్ ఇంటింటా కనిపిస్తున్న కాలంలో… ఆడ, మగ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో ప్రత్యేకంగా ఇళ్లల్లో వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్న రోజుల్లో… ప్రాశ్చాత్య కల్చర్ ఆవహించి స్వేచ్ఛకు, మితిమీరిన స్వేచ్ఛకు మధ్య విభజన రేఖేంటన్న చర్చలు జరుగుతున్న రోజుల్లో… వీటన్నింటికీ భిన్నంగా అట్లాంటా నుంచి వచ్చిన హోప్ జీవితం కనిపిస్తుండటమే ఈ జీవన వైవిధ్యం. చేతులతో బట్టలు ఉతకడం, నేలపై కూర్చుని బోళ్లు తోమడం. సంప్రదాయ పద్ధతుల్లో అత్తగారింట్లో వంటలు చేయడం, చీర, కుర్తా ధరించి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంలా నడుచుకోవడడం.. ఇవన్నీ హోప్ సోషల్ మీడియా వీడియోల్లో కనిపిస్తున్నాయి.

మరో జీవితం కోసం ఓ హోప్! 2023లో బీహార్ కు చెందిన అభిషేక్ సింగ్ ను వివాహం చేసుకున్నారు హోప్. అభిషేక్ హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నారు. 2025 అక్టోబర్ లో హోప్ తొలిసారి భారత్ కు వచ్చింది. అప్పట్నుంచీ భర్త, కుమారుడు, అత్తా, మామలతో కలిసి బీహార్ లోనే ఉంటోంది. భవిష్యత్తులో శాశ్వతంగా భారత్ లో స్థిరపడే ఆలోచనతో ఉన్న హోప్.. అమెరికా పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే, భారత్ లో ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కోసం ప్రయత్నిస్తోంది. 

చాలాకాలంగా అమెరికాలో ఉంటున్నప్పట్నుంటే హోమ్ స్టెడ్ లైఫ్ కోరుకుంటోంది హోప్. అంటే ఇతరులపై తక్కువ ఆధారపడుతూ… సొంతంగా ఆహారం పండించుకోవడం, తోటల పెంపకం చూసుకోవడం, జంతువులను పెంచుకోవడం… మొత్తంగా ప్రకృతికి దగ్గరగా జీవించడం వంటి స్వయం సమృద్ధి జీవన విధానం కోరుకుంటోంది హోప్. ఉరుకుల పరుగుల మెకానికల్ లైఫ్ లో… కాంక్రీట్ జంగిల్ నుంచి బయటకొచ్చి ప్రకృతికి దగ్గరగా నెమ్మదైన జీవితాన్నికోరుకోవడం హోప్ లో కనిపిస్తోంది.

సమయం లేనప్పుడు డబ్బుంటే ఏం లాభం..? అమెరికా అంటే సౌకర్యాలు. కానీ, సౌకర్యాలొక్కటే జీవితం కాదన్నది హోప్ అభిప్రాయం. అక్కడి జీవితం ఖరీదైంది. ఇల్లు, వైద్యం, ఆహారం వంటి అవసరాల కోసం తీవ్రంగా పనిచేయాల్సిందే. ఆ పని తీవ్రతతో పొందే ఆధునిక సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం కంటే కూడా అర్థవంతమైన జీవితం కావాలంటోందీమె.

సౌకర్యవంతమైన జీవితం, అర్థవమంతమైన జీవితం… ఈ రెండూ ఎప్పుడూ ఒకటే కావన్నది ఆమె చెప్పే మాట.

మరి బీహార్ పల్లె జీవితం అంత బాగుంటుందా..? అమెరికా నుంచి వచ్చిన హోప్ గ్రామీణ జీవితాన్ని రొమాంటిక్ గా ఉంటుదనుకోవడం లేదు. అట్లాంటాలో పెరిగిన ఆమెకు బీహార్ లో ఎదురైన అతి పెద్ద సవాల్ ఇంటిపనులు చేయడం కూడా కాదు. కానీ, ఆ పనులు చేయాల్సిన పరిస్థితులకు అలవాటు పడటమే ఛాలెంజ్.

వేడినీటితో స్నానం చేయడం, ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి కాఫీ తాగడం, పెద్దగా ప్లాన్ లేకుండానే చిన్న చిన్న పనులు చేసుకోవడం వంటి స్వేచ్చ మిస్ అవుతున్న హోప్… బోళ్లు తోమడం వంటివి కూడా కొత్తేమీ కాదంటోంది. అయితే, అదే అమెరికాలో అయితే సింక్ లో వేడి, శుభ్రమైన నీటితో పాత్రలు తోమడం అలవాటు. ఇక్కడ కింద కూర్చుని భిన్నమైన పరిస్థితుల్లో, వాతావరణంలో పని చేయాల్సి రావడమే శారీరకంగా, మానసికంగా పెద్ద మార్పు.

మరి తన గ్రామీణ జీవితాన్ని సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తున్నట్టు..? హోప్ తన గ్రామీణ జీవితాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్న తీరు కూడా ఆసక్తికరం. బీహార్ ను ఏదో గొప్పగా చిత్రీకరించడం లేదు. అలాగే, ప్రతికూలంగానూ చూపించడం లేదు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, వనరుల లభ్యత, జీవన ప్రమాణాలు, సాంస్కృతిక అంచనాల విషయంలో అమెరికాతో ఇక్కడ కనిపించే తేడాను, పోలికలను పట్టి చూపించే ప్రయత్నమే ఆమె వీడియోల్లో చూడొచ్చు.

మరీ ముఖ్యంగా పురుషాధిక్య సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అంచనాలు ఆమెను ఆశ్చర్యపరుస్తున్నాయి. బాధ్యతలు, తీర్పులు కఠినంగా ఉండటం ఆమెను ఆశ్చర్యపరుస్తున్నాయి. అందుకే తన వీడియోల ద్వారా భారత్ అందాలతో పాటు.. వాస్తవ ప్రపంచాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నానంటోంది.

హోప్ ను ఆకట్టుకున్న కుటుంబ, సామాజిక బంధాలు! శరవేగంగా, మరింత యాంత్రికంగా తిరిగిపోతున్న జీవన చక్రంలో తన కుమారుణ్ని పెంచడంలో అత్తా, మామల నుంచి లభించే సహకారం, కుటుంబ అనుబంధం, సామాజిక సంబంధాలు ఇవన్నీ హోప్ ను ఆకట్టుకుంటున్నాయి. అమెరికా వంటి ఉరుకుల, పరుగుల జీవితంలో ఆ రణగొణ ధ్వనులు, కాలుష్యం, యాంత్రిక జీవనానికి దూరంగా ఓ గ్రామంలో పిల్లల్ని పెంచితే బాగుండుననిపిస్తుంది. కానీ, బీహార్ కు వచ్చాక ఆ భావన తన విషయంలో నిజమైందని మురిసిపోతోంది హోప్. అట్లాంటా నుంచి బీహార్ కు హోప్ ప్రయాణం కేవలం ఓ అమెరికన్ మహిళ భారతీయుణ్ని పెళ్లి చేసుకుని ఓ కుగ్రామంకు చేరుకోవడమే కాదు.. అంతకుమించి, జీవితమంటే సౌకర్యాలే కాదు.. మానవ సంబంధాలని చెప్పేది.

హోప్ దగ్గర అమెరికా పౌరసత్వం, తన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. అక్కడి సౌకర్యాలూ ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. కానీ, బీహార్ లో మాత్రం ఆమెకు డబ్బుతో కొనలేని మానవ సంబంధాలు, కుటుంబం, సమాజం అదనంగా లభించాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది సొంత గడీ కాదు సార్… బాత్రూం రిపేర్లకు కోటి రూపాయలా..?!
  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?
  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions