.
మామూలుగా సినిమా వార్తలన్నీ మూస… వెయ్యి శాతం హిపోక్రసీ… అందరూ అవే పీఆర్వోలు ఇచ్చే ఫోటోలు, కంటెంటే వాడతారు… సినిమా పేజీల్లో వైవిధ్యం కూడా ఉండదు, అందరూ అవే ‘కవరేజీ’ వార్తలు అచ్చేస్తారు… ఎప్పుడో కొన్ని వార్తలు మాత్రం చటుక్కున అలా తళుక్కుమంటాయి, అవీ ఎక్కడో ఓచోట, అప్రధానంగా… స్పేస్ ఫిల్లింగ్ పద్ధతిలో… అలా కనిపించింది ఓ చిన్న వార్త…
వార్త ఏమిటంటే..? బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులో… తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ పూర్తి చేసి, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ‘పని అంటే పనే… అందులో ఎలాంటి రాజీ పడకూడదు, ఈ రోజు పన్నెండు షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ తో పాటు రెండు ప్రత్యేక స్టిల్ షూట్లు కూడా పూర్తయ్యాయి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సమాజంతో, నా అభిమానులతో కనెక్ట్ అయ్యే ఈ అపురూపమైన ప్రక్రియ ఏమాత్రం ఆలస్యం కాకుండా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి..
Ads
మిగతావన్నీ జీవితంలో సాగుతూనే ఉంటాయి కానీ ఈ అపురూపమైన అనుబంధం మాత్రం ఎప్పటికీ ఆగకూడదు’ అంటూ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మారుతున్న కాలంతో పాటు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ.. అత్యంత కఠినమైన క్రమశిక్షణతో ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇదీ వార్త… ఎస్, 83 ఏళ్ల వయస్సు… బుడ్డా హోగా తేరా బాప్… ఎవడ్రా ముసలోడు, నీ అయ్య ముసలోడు, నేను కాదు అన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నాడు… డబ్బు కోసమే చేస్తాడా..? ప్యాషన్ కాబట్టి చేస్తాడా..? పనిలోనే రిలాక్స్ అనుకుని చేస్తాడా..? ఈ ప్రశ్నలు వదిలేస్తే… ఈ వయస్సులో కూడా అదే ఎనర్జీ… అదీ విశేషం… (శని మహర్దశ నుంచి బయటపడి, ఈ వెలుగుల్లోకి ప్రస్థానం జాతకరీత్యా కూడా విశేషమే)…
భార్య రాజకీయవేత్త, కొడుకు హీరో, కోడలు హీరోయిన్… నిత్యం ఇల్లంతా బిజీ… ఐనా అమితాబ్ తన పనేదో తనది… కూలీ సినిమాలో ప్రమాదానికి గురై, చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు, మొత్తం దివాలా తీసి బజారున పడేసే దుర్దినాల నుంచి… మెల్లిగా కోలుకుని, ఆరోజు నుంచి ఈరోజు దాకా పని, పని, పని… ప్రతి క్షణం పని… అదీ చెప్పుకోవాల్సింది… పైగా ఏ కంట్రవర్సీలోకీ ఎంటర్ కాడు…
ఒకేరోజు 12 షార్ట్ ఫిలిమ్స్, రెండు స్టిల్ షూట్స్… మరోవైపు కేబీసీ… ఒకవైపు కల్కి… టైమ్ ప్లానింగ్ సూపర్… షార్ట్ ఫిలిమ్స్ అంటే తేలికగా తీసేయలేం, అమితాబ్ నటించే ఫిలిమ్ ఎంత నిడివి అనేది ముఖ్యం కాదు కదా… ఒక ఫిలిమ్ నుంచి మరో ఫిలిమ్‌లోకి వెంట వెంటనే లుక్కు, కంటెంటు, మూడ్ ఛేంజ్ ఓవర్ అయిపోవడం అంటే అదీ అసలు విశేషం…
ఇప్పుడు తన చేతిలో కల్కి- 2 తో పాటు సర్కార్- 4, సెక్షన్- 84, ది ఇంటర్న్, బ్రహ్మాస్త్ర-2 సినిమాలున్నాయి… అన్నీ ఓ రేంజ్ సినిమాలే… అమితాబ్, అనేకానేక మిణుగురు పురుగుల నడుమ నువ్వు అసలైన స్టార్..!! నీకు ఏజ్ జస్ట్ ఓ నంబర్ మాత్రమే… ఎవర్ స్టార్..!!
Share this Article