Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!

September 5, 2026 by M S R

.

బహుశా ఏ రాష్ట్రంలోనూ లేదేమో… ఒక ప్రతిపక్ష నేతపై అధికార పార్టీ బహిరంగంగా… దాదాపు ఓ అభిశంసనగా చెప్పేట్టుగా… ‘నువ్వు రాజీనామా చెయ్, నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు, ప్రజలు నీకు అప్పగించిన బాధ్యతను కూడా కాలరాస్తున్నావు, వోటర్లను అవమానిస్తున్నావు’ అంటూ మహాధర్నాకు సిద్ధపడటం!

అవును, రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడు… తనదైన అస్త్రాలు తీసి పదును పెడుతున్నాడు… తనను దింపేయడానికి ఫామ్ హౌజు కేంద్రంగా సాగుతున్న కుట్రలతో తీవ్ర అసహనంతో ఉన్న రేవంత్ రెడ్డి ఇక ఏకంగా కేసీయార్ మీదే స్ట్రెయిట్ దాడికి దిగాడు…

Ads

మొన్న పిలుపునిచ్చాడు కదా, కేసీయార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఊరూరా ఆందోళనలు చేయాలని… ఇప్పుడిక తనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాదులో కేసీయార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మహా ధర్నా చేయబోతున్నాడు ఈ ఆదివారం…

నేను బాపును, నేను జాతిపితను, నేను తొలి ముఖ్యమంత్రిని, నేను రాష్ట్ర సాధకుడిని అని చిత్రీకరింపజేసుకున్న ఇమేజ్ మొత్తం గాలిలో కలిసిపోతోంది… తన పాలన తాలూకు వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలు ఒకెత్తు… నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించవయ్యా అని జనం తీర్పు చెబితే… దాన్ని తుంగలో తొక్కి అసలు జనం మొహం చూడటమే మానేశాడు…

పేరుకు తను ప్రజాజీవితంలో ఉన్నాడు… కానీ అజ్ఞాతంలోనే ఉంటూ జనానికి మొహం చాటేస్తున్నాడు… తన తప్పులకు మొహం దాచుకుంటే అవన్నీ మాఫీ అయిపోతాయా..? పైగా కేటీయార్ అంటాడు, సీఎంగా తప్ప కేసీయార్ అసెంబ్లీకి రాడు అని… సింపుల్, అలాంటప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి కదా…

రెన్యువల్ కోసం ఎప్పుడో ఓసారి అలా చుక్క తెగి రాలిపడ్డట్టు రావడం, సంతకం చేసి, మమ అనిపించుకోవడం, జీతం కోసం… అసలు తను ఈ 1000 రోజుల్లో తీసుకున్న జీతభత్యాలు కోటిన్నర తన సంపాదనలో, తన సాధన సంపత్తిలో ఎంత..? టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్, పల్లీబఠానీ సమానం…

పోనీ, నేను జనం మొహం చూడను లేదా నా మొహం జనానికి చూపించను అనే ధోరణి తీసుకుంటే… నా హరీష్, నా కేటీయారే ఇక నా పార్టీ నాయకులు నన్నిక మరిచిపొండి అనే పక్షంలో… వాళ్లకే పగ్గాలు అప్పజెప్పాలి కదా… తను యాక్టివ్ ప్రజాజీవితం నుంచి వైదొలగాలి కదా…

సీఎం కుర్చీ దక్కితేనే జనంలో ఉంటాను, లేకపోతే వాళ్ల ఏడుపు వాళ్లను ఏడవనివ్వండి అనే ధోరణి ఏమిటి అసలు..? సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న కేసీయార్‌కు ఈ ధోరణి ఏమాత్రం శోభనివ్వదు సరికదా, పాత ఇమేజ్ ఇంకా పలుచన అయిపోతుంది… కేసీయార్ అదే కోరుకుంటే ఇక ఎవరూ ఏమీ చేయలేరు…

ఎహె, ఇదంతా రాజకీయం, దీనికి విలువేముంది అంటారా..? ఇక్కడిదాాకా తెచ్చుకున్నది ఎవరు..? అనేక అక్రమాలపై శిక్షించకుండా తన పాపాన తనే పోతాడులే అని రేవంత్  రెడ్డి ఇన్నాళ్లూ ఉపేక్షించీ ఇప్పుడు ఇలా విరుచుకుపడుతున్నాడు అంటే, ఇంతదాకా తెచ్చుకున్నది ఎవరు మరి..!!

నేను తిట్టిన మోడీ మళ్లీ నన్ను కావిలించుకుంటాడు… నేను అరెస్ట్ చేసి జైలులో పారేయాలనుకున్న బీజేపీ జాతీయ నాయకులే మళ్లీ నా దగ్గరకు వచ్చి, పొత్తు పెట్టుకుందాం, ప్లీజ్ అని బతిమిలాడుతారు అనుకుంటే అది తన నియంత దొర పోకడ కావచ్చు, బీజేపీ సిగ్గుమాలిన రాజకీయం కూడా కావచ్చు… కానీ జనం మెచ్చే రాజకీయం మాత్రం కాదు…

ఆదివారం ఇందిరా పార్క్ దగ్గర జరిగే మహాధర్నాలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు… ధర్నా ఏర్పాట్లపై నేడు 9 గంటలకు సన్నాహక సమావేశం… హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం…

అన్నట్టు… అసెంబ్లీ పట్టని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ, వాళ్లకు జీతభత్యాలు అనవసరం అంటూ అసెంబ్లీలోనే ఓ తీర్మానం ప్రవేశపెడితే… బహుశా దేశ రాజకీయాల్లో ఎవరికీ దక్కనంత అపఖ్యాతి కేసీయార్‌కు దక్కుతుంది… రేవంత్ రెడ్డి అసహనం చూడబోతే… ఏమో మరి..!!

ఏపీ సీఎం చంద్రబాబు, యాక్టింగ్ సీఎం లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలంగాణ రాజకీయాల తీరు గమనిస్తున్నారు కదా..!! మీ జగన్, ఈ కేసీయార్ ఫుల్లు జాన్ జిగ్రీ దోస్తులు… సేమ్ సేమ్ అసెంబ్లీ గైర్హాజరు టాపర్లు..!!

కొసమెరుపు :: కేసీయార్ అసెంబ్లీకి వస్తే రేవంత్ తట్టుకోలేడు అని బీఆర్ఎస్ క్యాంపు విచిత్ర వాదన… వై నాట్..? పోనీ, ఓసారి అలా వచ్చి రేవంత్ రెడ్డిని వణికించొచ్చు కదా..!! లేస్తే మనిషిని గాను సుమా అనడం దేనికి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!
  • ఈ ‘స్వతంత్ర హస్తం’ కొత్తదేమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’!!
  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!
  • ఇటు రేవంత్ – అటు ఒవైసీ… ఇద్దరివీ తెలివైన ప్రసంగాలు
  • మహిళా జడ్జిలకు కూడా తప్పని లైంగిక వివక్ష – వేధింపులు !
  • వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !
  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!
  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions