Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!

September 22, 2026 by M S R

.

Mohan Goteti … అక్కినేని పరమ ‘భక్తి’పరుడు కదా!
ఒకసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేని నాగేశ్వరరావు గార్ని ఇంటర్వ్యూ అడిగాడు.
“సరే చూద్దాం లెండి” అన్నారాయన.
ఆ జర్నలిస్టు వదలలేదు..
మళ్లీ మళ్లీ ఫోన్ చేసి అడిగాడు..
దాంతో ఇక కాదనలేక రమ్మన్నారు.

ఇంటర్వ్యూ మొదలు పెట్టడం మొదలు పెట్టడమే ఓ చికాకు ప్రశ్న వేశాడు.
“మీరు ఫలానా హీరోయిన్ తో ఎన్ని సినిమాలు చేశారు?” అంటూ.. ఏఎన్నార్ కు బాగా జూనియర్ అయిన ఓ హీరోయిన్ పేరు ప్రస్తావించాడు.
మరొక సీనియర్ హీరో అయితే, ఆ ప్రశ్నకు చాలా సీరియస్ అయ్యేవాడు.
ఇంటర్వ్యూ లేదు.. ఏమీ లేదు వెళ్లమనేవాడు!

Ads

మరి, ఇక్కడ వున్నది అక్కినేని.. ఎంతో జీవితాన్ని చూసిన మనిషి.
అందుకే, ఆ ప్రశ్నకు ఏఎన్నార్ అతనిపై ఏమాత్రం కోప్పడలేదు.
“చూడు బాబూ.. భానుమతి గారి దగ్గరకి వెళ్లి.. అక్కినేనితో మీరెన్ని సినిమాలు చేశారు? అని అడిగి చూడు.. ఆమె ఏం చెబుతుందో” అన్నారు.

అప్పటికే భానుమతి గారిని ఓ జర్నలిస్టు ఇలాంటి ప్రశ్నే వేస్తే, తన సీనియారిటీని చూపిస్తూ..”నేను నాగేశ్వరరావుతో చేయడమేమిటి? నాగేశ్వరరావే నాతో చేశాడు” అంటూ సదరు జర్నలిస్టు మీద భానుమతి గారు కోపంతో అంతెత్తున లేచారని అంటారు.
అలా ఏఎన్నార్ ఇక్కడ అనలేక.. ఇలా వ్యంగ్యంగా సదరు జర్నలిస్టుకి చురక అంటించారు.

లేకపోతే.. తెలుగు సినిమాకి ఒక మూలస్తంభమైన ఒక మహానటుడిని పట్టుకుని, అలాంటి ప్రశ్న వేయడమేనా?
ఏఎన్నార్ లో ఓ సంస్కారం వుంది కాబట్టి.. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అలా సున్నితంగా.. చురక అంటించినట్టు చెబుతుండేవారు.
సినిమాలలో లాగానే.. బయట కూడా అది అక్కినేని స్టయిల్ అన్న మాట!

మామూలుగా జర్నలిస్టులకు అక్కినేని ఓ మంచి స్నేహితుడు!
మనల్ని ఇష్టపడ్డారంటే ఆయనే ఫోన్ చేస్తుండేవారు..
ఫోన్లోనే కబుర్లు చెప్పేవారు..
“ఖాళీగా వుంటే ఓసారి రావచ్చుగా..” అంటూ ఆహ్వానించేవారు.
అంతటి మహానటుడు పిలిస్తే వెళ్లకుండా ఉంటామా?
ఖాళీ చేసుకుని మరీ వెళ్లిపోయేవాళ్లం..

anr

కాసేపు మాట్లాడితే చాలు.. ఆయన దగ్గర మాకు మంచి మేటర్ దొరికేది..
అప్పటి విశేషాలు ఎన్నో చెప్పేవారు..
ఒక్కోసారి అసలు ఇంటర్వ్యూ అని మనం ఆయనని అడగక్కరలేదు..
కూర్చుని కబుర్లు చెప్పడం మొదలెడితే..
రాసుకోవడానికి ఆయన నుంచి బోలెడు ఆసక్తికరమైన విషయాలు వాటికవే దొరికేవి.

ఓసారి ఆయన బర్త్ డేకి ఐదు రోజుల ముందు జూబ్లీ హిల్స్ లోని వారింటికి వెళ్లినప్పుడు.. ఆయన చెప్పిన కబుర్ల నుంచి నేను రాసిన ఓ పెద్ద ఇంటర్వ్యూ . తర్వాత అది ‘సితార’లో పబ్లిష్ అయ్యాక.. “నాతో సరదాగా మాట్లాడి.. వాటిలోంచి మేటర్ తీసుకుని ఇంటర్వ్యూ రాసేశారన్న మాట!” అన్నారు నవ్వుతూ అక్కినేని.
ఆ ఇంటర్వ్యూ బాగుందని కూడా మెచ్చుకున్నారు!

ఇక అక్కినేనితో ఫొటో సెషన్ అంటే ఓ అందమైన ఈవెంట్ లా వుండేది.
కెమేరాకి ఆయన పోజుల మీద పోజులు ఇస్తుంటే చూసి తీరాలి..
ఓసారి మా ఫొటోగ్రాఫర్ మధుసూదన్ చేత వారింటి లాన్ లో ఫొటోలు తీయించాను.
అంత వయసులోనూ కుర్ర హీరోలా వరుసగా పోజులు ఇచ్చేస్తున్నారాయన.
“ఇది ప్రేమనగర్ పోజులా వుందండీ..” అంటే తనదైన స్టయిల్ లో నవ్వారు.
ఆ వయసులోనూ ఆయనలో ఆ చలాకీతనం.. ఆ ఉత్సాహం చూస్తే ఆశ్చర్యమేసేది!

అన్నపూర్ణా స్టూడియో ఆయనకు ఓ పవిత్రమైన స్థలం!
అందుకే ప్రతిరోజూ స్టూడియోకి వచ్చేవారు..
బంజారా హిల్స్ లో ఆ స్టూడియో నిర్మాణం చేబట్టినప్పుడు.. అదంతా కొండలు.. గుట్టలు.. రాళ్లు.. రప్పలు!
ఆ కొండల్ని పిండి చేసి.. ఒక అందమైన స్టూడియోను నిర్మించారు అక్కినేని.
స్టూడియోలో ప్రతి ఫ్లోర్ తోనూ.. ప్రతి కట్టడంతోనూ.. ప్రతి మొక్కతోనూ.. ప్రతి రాయితోనూ ఆయనకు అనుబంధమే!
అన్నిటినీ ఎంతో అపురూపంగా చూసుకునే వారు..

అప్పుడప్పుడు అక్కడి ఫ్లోర్లలో ఎవరి షూటింగ్ జరుగుతున్నా .. వెళ్లి సరదాగా పలకరించి వచ్చేవారు.
ప్రతి రోజూ స్టూడియోను చూడందే ఆయనకు కుదురుండేది కాదు..
ఎందుకంటే.. అది ఆయన దృష్టిలో ఓ దేవాలయం!

అన్నట్టు, మన అక్కినేని నాస్తికుడన్న విషయం తెలిసిందే!
అయితే, తన నాస్తికత్వాన్ని ఇంట్లో వాళ్ల మీద కానీ, బయట కానీ ఎవరి మీదా ఎప్పుడూ రుద్దలేదు..
ఇంట్లో ఎవరు పూజలు చేసుకున్నా.. వారిని ఏమీ డిస్టర్బ్ చేసేవారు కాదు..
అలాగే, తన సినిమాల షూటింగు సమయంలో చేసే పూజల విషయంలో కూడా జోక్యం చేసుకునేవారు కాదు..
“ఎవరి ఇష్టం వారిది.. ఎవరి నమ్మకాలు వారివి” అనేవారు.
అయితే.. అంతటి నాస్తికుడూ భక్తిరస చిత్రాలలో అద్భుతంగా నటించేవారు.
ఆయన అభినయంలో ఆస్తికత్వం.. భక్తితత్వం ఉట్టి పడేవి..
మామూలు ఆస్తికులు కూడా అంతటి భక్తిని ప్రదర్శించలేరేమో అనిపించేది.

ఇదే ఒకసారి ప్రస్తావించి.. “మీకు దేవుడి పట్ల నమ్మకం, భక్తీ లేవు కదా? మరి ఒక భక్తుడిగా అంతలా ఎలా నటించగలుగుతున్నారు?” అనడిగాను.
“నేను నా వృత్తికి పరమభక్తుడిని కదండీ.. మరి, నా అంతటి భక్తుడు ఉంటాడా? అందుకే.. నా వృత్తిలో భాగమైన ఆ పాత్రలో భక్తిని నిండుగా చూపించగలుగుతున్నాను.. ఏమంటారు?” అన్నారు ఏఎన్నార్ నవ్వుతూ.
ఏమంటాం?

ఆ మహానటుడు తన భక్తి గురించి అంతలా విడమరచి చెబితే మన దగ్గర సమాధానం ఏముంది?
ఆయన తను నమ్మిన ‘నటన’ అనే వృత్తి దైవానికి గొప్ప భక్తిపరుడు కదా?
ఇక వెండితెరపై అలాంటి సినిమాలలో భక్తి కురవక ఏమవుతుంది?
అక్కినేని పాత్రలో భక్తి కనపడక ఏమవుతుంది? -మోహన్ గోటేటి
(సెప్టెంబర్ 20న మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా పాత జ్ఞాపకాలు..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!
  • లిక్కర్ స్కాంలో జగన్‌ను లోపలేస్తారా..? ఏపీ పాలిటిక్స్‌లో చర్చ !!
  • ‘‘ దిగితే మావాడు సీఎం – మావాడు తలుచుకుంటే దేశానికే పీఎం… ’’
  • చరిత్ర చెబుతోంది ! దానం నాగేందర్‌కు ఈ ఉపఎన్నిక అంత ఈజీ కాదు !
  • తండ్రి సినిమాకు కన్నీటి సర్టిఫికెట్..! ఎన్నిసార్లు చూసినా ఏడ్చేస్తోంది ‘మాత’..!!
  • పేరడీ ! ఏశనాగుల కట్ట మీద ఉయ్యాల ఊగిన జబర్దస్త్ సద్దాం !!
  • వై నాట్ సిరిసిల్ల – వై నాట్ సిద్దిపేట – రేవంత్ ‘అఫెన్స్ గేమ్ ప్లాన్’…
  • కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్కా, నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా..!!
  • మై జాల్ముడి ఖా రహాథా… ఈమధ్య ఇంత నవ్వొచ్చిన స్కిట్ వేరే లేదు..!!
  • వైజాగ్ బీచ్ మురి మిక్చర్ ! ఈ కరకరల రుచికీ ఓ చరిత్ర ఉంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions