.
ప్రజాజీవితంలో ఉన్నవాడు, అందులోనూ ప్రజాప్రతినిధిగా ఉన్నవాడు ఏదైనా విమర్శ చేస్తే, ఆరోపిస్తే… దానికి అర్థం ఉండాలి, స్థాయి ఉండాలి, అన్నింటికీ మించి తనకొచ్చే పొలిటికల్ ఫాయిదా ఏమిటో క్లారిటీ ఉండాలి… తనకు అనవసరమైన అంశాల జోలికి వెళ్లకూడదనేది రాజకీయాల్లో ప్రప్రథమ నైతిక, సంస్కార, ఆచరణీయ సూత్రం…
అయోధ్య రామమందిరం పేరుతో భక్తుల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడని పొద్దున్నే ఓ వార్త కనిపించింది… అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనికి బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశాడట…
Ads
ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ ఇప్పటివరకు ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించినప్పటికీ, సిట్ అధికారులు ఆయనకు అత్యంత సన్నిహితులైన ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడిందని చామల విమర్శించాడు..
తను ఇంకా ఏమంటాడంటే..? ‘‘ఆయన రాజీనామాతో ఈ వ్యవహారం ముగిసిపోదు. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి పేద ప్రజలు భక్తితో ఇచ్చిన చందాలను దోచుకోవడం దారుణం. గతంలోనే ఈ ట్రస్టులో రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ప్రజల నుంచి సేకరించిన సొమ్మును బీజేపీ రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది. మమతా బెనర్జీ పార్టీ నుండి 20 మందిని, శివసేన నుండి ఆరుగురు ఎంపీలను ఒక్కొక్కరికి రూ. 70 నుండి 80 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. రాముడి పేరుతో దోచుకున్న ఈ అక్రమ సొమ్ముతోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎంపీలను కొంటున్నారా?’’
ఇక్కడ విషయం ఏమిటంటే..? అప్పట్లో రామమందిర విరాళాల సేకరణపై గాయిగత్తర చేసి, రామభక్తుల ఆగ్రహానికి గురై, చివరకు అధికారాన్ని కూడా కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకీ ఈ ఎంపీ వ్యాఖ్యలకూ తేడా ఏమున్నట్టు..? ఐనా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్నే వ్యతిరేకించింది కాంగ్రెస్. అందులో అవినీతిపై పార్టీ ఎందుకు మాట్లాడటం? మాట్లాడినా జాతీయ స్థాయిలో ఎవరైనా కాస్త సంయమనంతో జాగ్రత్తగా కామెంట్స్ చేయాలి, చేస్తారు…
పైగా బీజేపీకి ఆ అక్రమాలతో ఏం సంబంధం..? ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలతోనే రాముడిని చేజేతులా బీజేపీకి అప్పగించడం..! అయోధ్య గుడి బీజేపీ సొత్తు కాదు. ఆ ట్రస్టు బీజేపీ అనుబంధ సంస్థ కాదు… ఆ క్లారిటీ లేకపోతే ఎలా? అయోధ్య గుడి ఈ దేశ జాతీయ ఆత్మగౌరవ ప్రతీక. అది అర్థం చేసుకోలేకపోయినా సరే, ఆ డబ్బుతో ఎంపీలను కొంటున్నారనేది కువ్యాఖ్య అవుతుంది. అయోధ్య విరాళాలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారనేదీ కామెంట్ విత్ బ్యాడ్ అండ్ పూర్ టేస్ట్…
అక్కడ ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్ ఈ వ్యవహారంపై ఏమైనా ఆరోపణలు చేశాడంటే, కనీసం తనకు అక్కడ ఓ పొలిటికల్ ఫాయిదా కోసం ప్రయత్నం అనుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దేనికి ఇది?
గుళ్లల్లో అక్రమాలు జరుగుతుంటాయి, దొంగలు అన్నిచోట్లా, అన్ని రంగాల్లోనూ ఉంటారు, అయోధ్యలోనూ జరిగింది. దానికి యోగీ రాజీనామా చేయడం ఏమిటి..? తనే కదా సిట్ వేసింది, తను ఒక్కొక్కడినీ ప్రశ్నిస్తుంటేనే కదా దొంగలు బయటపడుతున్నారు…
ట్రస్టు కార్యదర్శి సంపత్‌రాయ్ సన్నిహితుడు టిన్నూయాదవ్ సూత్రధారి దీనికి. 8 మందిని అరెస్టు చేశారు ఇప్పటికే. ఆ డబ్బును రాజకీయ అవసరాలకు వాడుకునే వాళ్లయితే ఈ దర్యాప్తులు, ఈ ప్రక్షాళన ఎందుకు చేస్తున్నట్టు మరి? పర్లేదు, ఈ యవ్వారం బయటపడి, ఆ అయోధ్య బాల రాముడికి దిష్టితీసినట్టయింది!!
తిరుమలలో ఎన్ని అక్రమాలు చూస్తున్నాం మనం? చివరకు నెయ్యి కాని నెయ్యి, పట్టు కాని పట్టు బాగోతాలు కూడా…! ఆ డబ్బును వైసీపీ రాజకీయ అవసరాలకు వాడుకుందని ఎవరైనా ఆరోపించారా; లేదు కదా..? అందుకే విమర్శల్లోనూ వివేచన అవసరం…
శబరిమల గుళ్లో బంగారు తాపడం రేకులే మాయం చేశారు… అలాగని సీపీఎం ఆ సొమ్మును రాజకీయ అవసరాల కోసం వాడుకుంది, ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అని ఆరోపణలు చేయగలమా..? లేదు కదా… ఇదుగో అయోధ్యపై విమర్శల్లోనూ ఆ విజ్ఞత అవసరం… లేకపోతే అది పార్టీకే నష్టదాయకం!!

Share this Article