Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాపై చైనా- పాకిస్తాన్- బంగ్లాదేశ్‌ ఉమ్మడి కుట్ర – పార్ట్ 1

November 28, 2026 by M S R

.

నవంబర్ 9, 2026… ఇండోనేషియా నేవీ ఉత్తర సుమత్రా (North Sumatra) దగ్గర ఉన్న బెలవాన్ (Belawan) తీరంలో ఒక కార్గో షిప్‌ను అడ్డుకుని స్వాధీనం చేసుకుంది! ఇండోనేషియా నేవీ అడ్డుకున్న ఆ కార్గో షిప్ పేరు MV Star Line, ఇది కొమొరోస్ (Comoros) దేశ జెండాతో ప్రయాణిస్తోంది.

నవంబర్ 9న ఈ షిప్‌ను అడ్డుకున్న ఇండోనేషియా నేవీ, నవంబర్ 20న దీనిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, అందులోని కంటైనర్లలో ఏమేమి ఉన్నాయో, తాము ఎందుకు ఈ చర్య తీసుకున్నామో వివరించింది…

Ads

MV స్టార్ లైన్ షిప్‌లో మొత్తం 36 కార్గో కంటైనర్లు ఉండగా, అందులో 15 కంటైనర్లలో ‘సోడియం పెర్క్లోరేట్’ (Sodium Perchlorate) ఉన్నట్లు ఇండోనేషియా నేవీ పేర్కొంది.ఒక కంటైనర్‌లో పదుల కొద్దీ కార్టన్లలో 10 లక్షలకు పైగా రిజిస్టర్ కాని బ్లాంక్ 4G LTE మొబైల్ SIM కార్డులు ఉన్నాయి.MV స్టార్ లైన్ కార్గో షిప్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతోంది?

చైనాలోని లియాన్యుంగాంగ్ (Lianyungang) నుండి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా (Mongla) పోర్టుకు వెళుతోంది!

ఇండోనేషియా నేవీకి అనుమానం ఎందుకు వచ్చింది?
ఇండోనేషియా నేవీ అధికారులకు ఒక ‘గుర్తుతెలియని’ వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ఫోన్ కాల్‌లో, “సుమత్రా దీవికి దగ్గరగా ఇండోనేషియా ప్రాదేశిక సముద్ర జలాల గుండా MV Star Line కార్గో షిప్ వెళుతోంది. అందులో ప్రమాదకరమైన కెమికల్ ఉంది, బహుశా మీ దేశంలోని వారికి సరఫరా చేయడం కోసం అయి ఉండవచ్చు, కాబట్టి తనిఖీ చేయండి” అని చెప్పాడు.

అయితే మీడియా కథనాలు మాత్రం MV స్టార్ లైన్ షిప్ ఇంధనం నింపుకోవడానికి ఉత్తర సుమత్రా దగ్గర ఆగినప్పుడు అనుమానం వచ్చి తనిఖీ చేశారని పేర్కొంటున్నాయి. ఇండోనేషియా నేవీ అధికారులు మాత్రం తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి MV స్టార్ లైన్ ప్రవేశించక ముందే కోస్ట్ గార్డ్ దానిని ట్రాక్ చేయడం మొదలుపెట్టిందని తెలిపారు.

కుట్ర

అప్పటివరకు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తూ వచ్చిన ఆ కార్గో షిప్ తన దిశను రెండు సార్లు మార్చుకోవడంతో కోస్ట్ గార్డ్ అధికారులు వైర్‌లెస్ రేడియోలో మాట్లాడటానికి ప్రయత్నించారు. MV స్టార్ లైన్ నుండి స్పందన రాకపోవడంతో ఇండోనేషియా కోస్ట్ గార్డ్ నౌక KRI SIGALU – 857 దానిని అడ్డగించింది!

నేవీ అధికారులు స్టార్ లైన్ షిప్‌లోకి ప్రవేశించి డాక్యుమెంట్లు తనిఖీ చేయగా, షిప్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 2027 వరకు ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల అది సస్పెన్షన్‌లో ఉన్నట్లు గుర్తించారు! MV STAR LINE కార్గో షిప్ కొమొరోస్ (Comoros) దేశానికి చెందినది.

  • హిందూ మహాసముద్రపు ఉత్తర భాగంలో ఉన్న నాలుగు ద్వీపాల సముదాయమే కొమొరోస్. దీనికి పశ్చిమ/వాయువ్య దిశలో మొజాంబిక్, టాంజానియా దేశాలు ఉండగా, ఆగ్నేయంలో మడగాస్కర్ దేశం ఉంది! కొమొరోస్ దేశ జనాభా కేవలం 6 లక్షలు మాత్రమే! అంటే మన కూకట్‌పల్లి జనాభా కంటే తక్కువ!

MV STAR LINE కార్గో షిప్‌లో దొరికిన డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ నంబర్ IMO 8356962 అని ఉంది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) ఈ నంబర్‌ను కేటాయిస్తుంది. కార్గో షిప్‌కు ఇన్సూరెన్స్ చేయడానికి, ఏదైనా పోర్టులో లోడింగ్ లేదా అన్‌లోడింగ్ చేసేటప్పుడు పోర్ట్ అధికారులు ఈ IMO నంబర్‌ను నమోదు చేస్తారు. దీనిని IMO ఉచితంగా రిజిస్టర్ చేసి నంబర్ ఇస్తుంది. IMO డేటాబేస్‌ను S&P Global నిర్వహిస్తుంది.

కాబట్టి, MV STAR LINE కార్గో షిప్ పేరుకు కొమొరోస్ దేశానిదే అయినా, అసలు యజమాని చైనా! లేకపోతే ఆరు లక్షల జనాభా ఉన్న ఆఫ్రికా ద్వీప దేశానికి కార్గో షిప్ కొని, దానిని నిర్వహించేంత శక్తి ఉండదు! వీటిని ‘షాడో ఫ్లీట్’ (Shadow Fleet) అంటారు. షాడో ఫ్లీట్లను నిర్వహించడంలో ఇజ్రాయెల్, రష్యా, చైనాలు ముందు వరుసలో ఉంటాయి.

ఇజ్రాయెల్ షాడో ఫ్లీట్లను తన శత్రు దేశాలకు పంపి, అక్కడి నుండి కార్గోను లోడ్ చేసుకుని నేరుగా ఇజ్రాయెల్‌కు లేదా తన మిత్రదేశపు పోర్టులో అన్‌లోడ్ చేసి తిరిగి వేరే కార్గోలో ఇజ్రాయెల్‌కు చేర్చుకుంటుంది. ఇలాంటివి చేయడంలో ఇజ్రాయెల్, చైనా, రష్యాలు ఆరితేరాయి!


సోడియం పెర్క్లోరేట్ (Sodium Perchlorate) ఉపయోగాలు ఏమిటి?
ఇండోనేషియా నేవీ సీజ్ చేసిన MV స్టార్ లైన్ కార్గో షిప్‌లో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ దొరికింది. సోడియం పెర్క్లోరేట్ అనే కెమికల్‌ను పారిశ్రామిక అవసరాల కోసం వాడతారు. ఇది ఒక శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్! అమ్మోనియం, పొటాషియం, లిథియం పెర్క్లోరేట్ తయారు చేయడానికి వాడతారు. రాకెట్లు, మిసైళ్లలో ప్రొపెల్లెంట్‌గా వాడతారు! లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ అవసరాల కోసం వాడతారు.


కుట్ర

గాజా – హమాస్!
గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్లను తయారుచేసి ప్రయోగించింది. అయితే ఆక్సిడైజర్‌గా సోడియం పెర్క్లోరేట్‌ను వాడలేదు. వ్యవసాయ అవసరాల కోసం దిగుమతి చేసుకున్న ఎరువులలోని పొటాషియం నైట్రేట్‌ను చక్కెరతో కలిపి ప్రొపెల్లెంట్‌గా వాడింది!

గాజాకు కార్గో రావాలంటే మధ్యధరా సముద్రం ద్వారా రావాలి, కానీ ఇజ్రాయెల్ నేవీ అక్కడ కాపలా కాస్తుంది. కాబట్టి రోడ్డు మార్గం ద్వారా జోర్డాన్ నుండి ఇజ్రాయెల్‌లోకి వచ్చి, చెక్ పోస్టులలో తనిఖీ చేసిన తర్వాతే గాజాలోకి వెళతాయి. అందుకే నేరుగా సోడియం పెర్క్లోరేట్‌ను దిగుమతి చేసుకోలేకపోయింది కానీ అమ్మోనియా, పొటాష్ లాంటివి దిగుమతి చేసుకుంది.

బంగ్లాదేశ్ మీద ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి సోడియం పెర్క్లోరేట్‌ను దిగుమతి చేసుకుని బాలిస్టిక్ మిసైళ్లలో వాడుతుంది. దీని నుండి అమ్మోనియం పెర్క్లోరేట్ తయారుచేస్తే, అది అడ్వాన్స్‌డ్ మిలిటరీ గ్రేడ్ సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైళ్లకు హై-ఎనర్జీ ఆక్సిడైజర్‌గా ఉపయోగపడుతుంది.

చైనా లక్ష్యం స్పష్టంగా ఉంది!
ఒకసారి తరచి చూస్తే మధ్యప్రాచ్యంలో హెజ్బొల్లా, హమాస్, హూతీలకు వారు ఉంటున్న ప్రదేశాలకు అమ్మోనియం పెర్క్లోరేట్ ఎలా చేరుతోంది? ఎవరు, ఎలా సప్లై చేస్తున్నారు అనేది ప్రపంచ దేశాలకు తెలుసు— అది చైనా అని!

  • MV స్టార్ లైన్ కార్గో షిప్ బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టుకు వెళుతున్నట్లుగా డాక్యుమెంట్లలో ఉంది కానీ, మోంగ్లా పోర్టులో వీటిని ఎవరు డెలివరీ తీసుకుంటారనే వివరాలు లేవు. అసలు మతలబు ఇక్కడే ఉంది (Here is the catch)!

జూన్ 2026: మోంగ్లా పోర్ట్ అథారిటీతో చైనా ప్రభుత్వ సంస్థ  చైనా సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (CCECC) ఒక అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. ఈ MoU ప్రకారం మోంగ్లా పోర్టుకు ఆనుకుని ఉన్న 110 ఎకరాల స్థలంలో CCECC ఒక ఎకనామిక్ జోన్‌ను నిర్మిస్తుంది. అంతకుముందు అదే 110 ఎకరాలను భారత్ ఎకనామిక్ జోన్‌గా అభివృద్ధి చేసి, భారత్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా వాడుకునే విధంగా చర్చలు జరిగాయి. ఒప్పందం చేసుకోవడమే మిగిలి ఉండగా, బంగ్లాదేశ్ ప్రధాని భారత్‌ను డీలిస్ట్ చేసి చైనాతో MoU చేసుకున్నారు!

అక్టోబర్ 2026: చైనా ప్రభుత్వ బ్యాంకు అయిన ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా (Exim Bank)తో బంగ్లాదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం చైనా బ్యాంకు తక్కువ వడ్డీకి (Concessional interest rate) 335–336 మిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తుంది. ఈ నిధులతో మోంగ్లా పోర్టు పక్కన ఉన్న 110 ఎకరాల్లో కంటైనర్ టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ సదుపాయాలను CCECC నిర్మిస్తుంది!

ఒకవేళ అప్పు తీర్చలేకపోతే మోంగ్లా పోర్టును చైనా స్వాధీనం చేసుకుంటుంది— ఖచ్చితంగా ఇదే జరిగితీరుతుంది! శ్రీలంకలో హంబన్‌తోట పోర్టుకు ఇలాగే అప్పు ఇచ్చి, వారు వడ్డీ కూడా కట్టలేకపోవడంతో ఆ పోర్టును చైనా స్వాధీనం చేసుకుంది!

శ్రీలంకలో కొలంబో పోర్ట్ ఆ దేశ అవసరాలను తీరుస్తుండగా, “హంబన్‌తోటలో మరో పోర్ట్ కడితే ఇంకా బాగా వ్యాపారం జరిగి మీకు లాభాలు వస్తాయి” అని నమ్మించి చైనా అగ్రిమెంట్ చేసుకుంది. “జస్ట్, మీరు స్థలం ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి, మిగతాదంతా మేము చూసుకుంటాము. పోర్ట్ కట్టి మీకు అప్పగిస్తాము, మీకు వచ్చే లాభాల్లో మాకు వడ్డీ కడితే సరిపోతుంది” అని నమ్మించి నట్టేట ముంచింది.

చివరికి పోర్ట్ కట్టి శ్రీలంకకు అప్పగించింది కానీ, ఆ పోర్టు వైపుకు వచ్చి లోడింగ్, అన్‌లోడింగ్ చేసే షిప్పులు కరువయ్యాయి! ఫలితంగా 99 సంవత్సరాల పాటు ఆ పోర్ట్ చైనా అధీనంలోకి వెళ్లింది. శ్రీలంక షిప్పులు ఆ పోర్టును వాడుకోవాలన్నా లోడింగ్, అన్‌లోడింగ్ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది!

శ్రీలంక రాజకీయ నాయకులకు లంచాలు, అందమైన అమ్మాయిలను ఎరగా వేసి హంబన్‌తోట పోర్టును చైనా స్వాధీనం చేసుకుంది! 20 ఏళ్ల క్రితం శ్రీలంకలో ఎలాంటి రాజకీయ అస్థిరత ఉందో, బంగ్లాదేశ్‌లో సరిగ్గా అలాంటి రాజకీయ అస్థిరతే ఇప్పుడు ఉంది. మోంగ్లా పోర్ట్ దీనికి బలి కాబోతోంది!

శ్రీలంకలో కొలంబో పోర్ట్ ఎలాంటి భూమిక పోషిస్తుందో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్/ఢాకా పోర్టులు కూడా అదే భూమిక పోషిస్తున్నాయి. భారీగా రెండో పోర్ట్ కోసం ఎకనామిక్ జోన్ కట్టేంత వాణిజ్యం బంగ్లాదేశ్‌కు లేదు. మోంగ్లా పోర్ట్ నుండి భారత సరిహద్దు కేవలం 80 కిలోమీటర్లు కాగా, కోల్‌కతా 190 కిలోమీటర్ల దూరంలో ఉంది!

ఇక్కడి నుండి దాడులకు లాంగ్-రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అవసరం ఉండదు— అన్‌గైడెడ్ రాకెట్లు చాలు. 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్‌తో 100 బాలిస్టిక్ మిసైళ్లకు కావాల్సిన హై-ఎనర్జీ ఆక్సిడైజర్‌ను తయారు చేయవచ్చు. హమాస్, హెజ్బొల్లా, హూతీల తరహాలో బంగ్లాదేశ్‌లో ఉన్న ఏదో ఒక ఉగ్రవాద గ్రూపుకు చైనా సహాయం చేస్తుంది!

ఇప్పటికే మోంగ్లా పోర్టులో పనిచేస్తున్న ప్రతి 100 మందిలో 50 మంది చైనా వారే ఉన్నారు. సోడియం పెర్క్లోరేట్‌ను మోంగ్లాలో ఉన్న చైనా వారు రిసీవ్ చేసుకుని, దానిని బంగ్లాదేశ్‌లో ఉన్న గ్రూపులకు చేరవేస్తారు. అందుకే కన్‌సైన్‌మెంట్‌ను ఎవరు రిసీవ్ చేసుకుంటారనే అడ్రస్ కార్గో షిప్ డాక్యుమెంట్లలో లేదు!  MV స్టార్ లైన్ కార్గో షిప్ చైనాలో బయలుదేరగానే మోంగ్లా పోర్టులో పనిచేస్తున్న చైనా వారికి సందేశం వెళ్లి ఉంటుంది!

బంగ్లాదేశ్‌లో ఉన్న ఉగ్రవాద గ్రూపులు: జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB), నియో-JMB (Neo-JMB): వీటిని ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులుగా గుర్తించారు. వీటికి బాంబు పేలుళ్లు, జిహాద్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయి.

అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT): ఇది భారత ఉపఖండంలో అల్-ఖైదా కోసం పనిచేస్తోంది. ఇస్లాం పట్ల తటస్థంగా ఉండే ముస్లిం రచయితలను, గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో హిందువులను, క్రైస్తవులను హత్య చేసిన చరిత్ర దీనికి ఉంది. హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ బంగ్లాదేశ్ (HUJI-B), జమాతుల్ అన్సార్ ఫిల్ హిందల్ షర్కియా (JAHS): ఈ రెండు గ్రూపులు బంగ్లాదేశ్‌లోని ఇతర ఉగ్రవాద గ్రూపులతో కలిసి పనిచేస్తాయి. వీటిని మిలిటెంట్ అవుట్‌ఫిట్లుగా గుర్తించారు.

IS-బంగ్లాదేశ్: ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో కలిసి పనిచేస్తున్న ఉగ్ర సంస్థ.మావోయిస్టు / లెఫ్ట్ వింగ్ గ్రూపులు: బంగ్లాదేశ్‌లో ముస్లిం ఉగ్ర గ్రూపులే కాకుండా మావోయిస్టు / లెఫ్ట్ వింగ్ గ్రూపులు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయని గుర్తించారు. 2024లో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి భారత్‌కు వచ్చేసిన తర్వాత, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాదులను, లెఫ్ట్ వింగ్ నేరస్థులను కావాలనే జైలు నుండి విడుదల చేశారు!

ప్రస్తుతం వీరు రాజకీయ పార్టీలు పెట్టి తమకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కోర్టు తలుపులు తడుతున్నారు! పైన పేర్కొన్న సంస్థలే కాకుండా కొత్తగా ఒక సంస్థను స్థాపించి, దానికి పేరు పెట్టి చైనా ఆయుధాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

కాబట్టి, హూతీల చేత బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూయించి సౌదీ అరేబియా మీద దాడులు చేయిస్తున్న తరహాలోనే, చైనా తన ప్రాక్సీల ద్వారా భారతదేశపు ‘చికెన్ నెక్’ (సిలిగురి) కారిడార్‌పై దాడులు చేయించే ప్రమాదం ఉంది! ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవి దగ్గర పట్టుబడింది కొంత మాత్రమే అయి ఉండవచ్చు; ఇప్పటికే భారీగా ముడి పదార్థాలు బంగ్లాదేశ్‌కు చేరి ఉండవచ్చు!

4G LTE బ్లాంక్ SIM కార్డులు ఎందుకు?
MV స్టార్ లైన్ షిప్‌లో పది లక్షలకు పైగా బ్లాంక్ SIM కార్డులు దొరకడం ఆశ్చర్యకరమే! అయితే బంగ్లాదేశ్‌లో 5G నెట్‌వర్క్ కేవలం ఢాకా లాంటి నగరాలకే పరిమితమై ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 4G, 3G మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ శాతమే ఎక్కువ. మిలిటెంట్ గ్రూపులకు ఇవ్వడానికి లక్షల్లో 4G LTE SIM కార్డులను చైనా సరఫరా చేసి ఉండవచ్చు. ఒకసారి వాడి ఆ SIM కార్డును పడేసి, కొత్త SIM కార్డుతో ఏదైనా విధ్వంసానికి పాల్పడే వ్యూహం ఉండి ఉండవచ్చు. (సశేషం… పార్ట్ 2)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాపై చైనా- పాకిస్తాన్- బంగ్లాదేశ్‌ ఉమ్మడి కుట్ర – పార్ట్ 1
  • కార్తీకదీపం వెలగాల్సిందే- విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్!!
  • నాన్న కుట్టి… సెంటిమెంట్ ఉంది… కనెక్టివిటీ ఏది ఆంటోనీ..?
  • తెలంగాణతనం అంటే రక్తపాతమేనా? ఇదేం ‘భోగి’రా శర్వానందూ..!!
  • ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?
  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!
  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు
  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions