.
( ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి ) … సురేఖ వివాదం నుంచి క్యాబినెట్ మార్పుల దాకా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన లెక్కలు! క్యాబినెట్ విస్తరణపై చర్చ.. యువతకు అవకాశం, మహిళా ప్రాతినిధ్యం, బీసీ సమీకరణాలపైనా కసరత్తు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు కొండా సురేఖ- జి. చిన్నారెడ్డి వివాదం చుట్టూ మొదలైన చర్చ క్రమంగా మరో పెద్ద అంశం వైపు మళ్లుతోంది. ఇద్దరి విషయంలో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఒక ప్రశ్న అయితే.. అదే సమయంలో జరగబోయే క్యాబినెట్ మార్పుల్లో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరిని తప్పిస్తారు అన్న లెక్కలు కూడా మొదలయ్యాయి.
Ads
పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తే.. ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపడంతో పాటు క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు లేదా ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ చర్య విషయంలోనూ ఇప్పుడు ఢిల్లీ నిర్ణయమే కీలకం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. సెప్టెంబర్ 2న ఆయన ఢిల్లీకి తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఈ వ్యవహారం కేవలం ఇద్దరు నేతల మధ్య వివాదంగా మిగిలిపోతుందా.. లేక క్యాబినెట్ కూర్పులో మార్పులకు దారితీస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించే పరిస్థితి వస్తే, అదే సమయంలో మరో మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా పార్టీలో వినిపిస్తోంది. ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి ఉన్న ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలన్నది ఒక లెక్క.
ఈ నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎం. యశస్విని రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీసీ మహిళ అనే సమీకరణమూ చర్చకు రావచ్చు. ఇక్కడ మరో రాజకీయ లెక్క కూడా ఉంది. యువ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా కొత్త తరానికి చెందిన నాయకులకు క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న సమయంలో తెలంగాణలోనూ ఆ దిశగా అడుగులు పడవచ్చన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువ నాయకులను ముందుకు తీసుకురావడం పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
రాహుల్ గాంధీ కూడా ఇటీవలి కాలంలో యువతకు (జెన్‌జీ ఇంపాక్ట్) సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. నీట్ పరీక్ష వివాదం, జార్ఖండ్‌లో పోటీ పరీక్షల రద్దు వంటి అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోనూ యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ వ్యూహంలో భాగం కావచ్చన్న అభిప్రాయం ఉంది.
అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ముందున్న తక్షణ సమస్య సురేఖ, చిన్నారెడ్డి వివాదం. ఇది మరింత పెద్ద సంస్థాగత సమస్యగా మారకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే సురేఖపై చర్య తీసుకుంటే చిన్నారెడ్డి విషయంలోనూ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మధ్య ఇప్పటికే ఉన్న సమీకరణాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.
అందుకే ఒక వివాదానికి పరిష్కారం చూపడంతో పాటు క్యాబినెట్‌లో అవసరమైన మార్పులు చేయడానికి ఇదే సరైన సమయమని కొందరు నేతలు భావిస్తున్నారు. బీసీ ప్రాతినిధ్యం కూడా చర్చలోనే.., క్యాబినెట్ మార్పుల చర్చలో సామాజిక సమీకరణాల అంశం కూడా ఉంది.
ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యంలో మార్పులు చేసి, బీసీలకు మరింత అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా పార్టీలో ఉంది. యశస్విని రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకునే సందర్భంలోనే ఒక బీసీ ఎమ్మెల్యేకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక సమతుల్యతను సాధించవచ్చన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది. కేకేశవరావు బిడ్డ, విజయశాంతి వంటి పేర్లూ చర్చల్లోకి వస్తున్నాయి…
టీపీసీసీ వర్గాల సమాచారం ప్రకారం బీసీ ప్రాతినిధ్యం పెంచే అంశం పరిశీలనలో ఉంది. ఇందుకోసం ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించే అంశం చర్చలో ఉన్నట్లు సమాచారం.
అంటే రాబోయే క్యాబినెట్ మార్పులు ఒకరిద్దరిని తీసుకోవడం, ఒకరిద్దరిని తప్పించడం వరకే పరిమితం కాకపోవచ్చు. మహిళలు, యువత, బీసీలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం.. ఇలా అనేక లెక్కలను ఒకేసారి సరిచేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. సో, ఇప్పుడు చూపంతా ఢిల్లీ వైపే..
కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత జరిగే సంప్రదింపులు ఈ వ్యవహారంలో కీలకంగా మారనున్నాయి. సురేఖ, చిన్నారెడ్డి వివాదాన్ని పార్టీ కేవలం క్రమశిక్షణ సమస్యగానే చూస్తుందా? లేక దానిని క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు కూడా ఉపయోగించుకుంటుందా? అన్నది అప్పుడే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక వివాదంతో మొదలైన చర్చ.. ఇప్పుడు క్యాబినెట్ కూర్పు, సామాజిక సమీకరణాలు, యువతకు అవకాశం వంటి అనేక అంశాలను కదిలిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వస్తారు.. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నదానిపైనే తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తి నెలకొంది…
Share this Article