Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!

October 7, 2026 by M S R

.

సాధారణంగా ఏదైనా తప్పుడు లేదా పొరపాటు వార్త ప్రచురితమైతే ‘ఈనాడు’ ఓ పట్టాన అంగీకరించదు… వివరణ గానీ, ఖండన గానీ ఇవ్వదు… క్షమించమని అడగదు, చింతిస్తున్నామనీ చెప్పదు… ఆ సంస్థకూ అహం ఉంటుంది… కానీ కేటీయార్ పంపించిన లీగల్ నోటీసుతో ‘పొరపాటు జరిగింది, ఆ వార్త వాస్తవం కాదు’ అని ఒప్పుకుంది… అంటే ఒకరకంగా లెంపలేసుకుంది…! కానీ అహం అన్నాం కదా… ఎస్, అందుకే చింతిస్తున్నట్టుగా ఒక్క పదం కూడా రాయలేదు!!

నిజానికి జరిగింది ఏమిటి..? ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీయార్‌ సహా మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిందని గత నెల 29న ఈనాడు ఓ వార్తలో పేర్కొంది… అది నిజం కాదు, ఏసీబీ అధికారులు ఇంపౌండ్ కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు, అంటే కోర్టును కోరారు… అంతే…

Ads

తప్పు వేరు, పొరపాటు వేరు… ఓ పత్రిక ఉద్దేశపూర్వకంగా రాస్తే తప్పు, రిపోర్టింగులో ఆ పదం దొర్లితే అది పొరపాటు… పాత్రికేయంతో పరిచయం ఉన్నవాళ్లకు అర్థమైంది ఏమిటంటే..? సమాచార సేకరణలోనో, నిర్ధారణలోనో పొరపాటు జరిగి, రిపోర్టింగులో జరిగిన పొరపాటు అయి ఉంటుందని..! బీఆర్ఎస్ మీద, ఆ నాయకుల మీద ఈనాడు ఉద్దేశపూర్వకంగా, ప్రత్యేకంగా నెగెటివ్ వార్తల జోలికి పోతున్నట్టు అనిపించడం లేదు కూడా…

దానికి ఏపీలో వైసీపీ, జగన్ తప్ప… తెలంగాణలో బీఆర్ఎస్, కేటీయార్, కేసీయార్ శత్రుపక్షం కాదు… సో, జరిగింది పొరపాటే గానీ, తప్పు కాకపోవచ్చు… ఐతే ఎప్పుడైతే కేటీయార్ ఈనాడు తప్పు రాసిందని బహిరంగంగా వెల్లడించాడో, తెల్లారో, మర్నాడో ఈనాడు మరింకో వార్తలో దాన్ని దిద్దుకుంటే బాగుండేది… కానీ..?

ఈనాడు తన సహజ ధోరణిలో దాటవేసింది… ఐతే కేటీయార్ విదేశాలకు వెళ్లకుండా కోర్టు పాస్‌పోర్టులు జప్తు చేయమని చెప్పిందన్నట్టుగా వార్త రావడం, అది జనంలోకి నెగెటివ్‌గా వెళ్లడంతో… కేటీయార్ దాన్ని ఇక వదిలిపెట్టలేదు… ‘క్షమాపణ చెప్పు, వార్త ఉపసంహరించుకో, లేదా ఆధారాలు చెప్పు’ అని లీగల్ నోటీసు పంపించాడు… కేటీయార్ స్పందనలో తప్పు లేదు…

ఇక ఈనాడుకు తప్పలేదు, ఏకంగా బీఆర్ఎస్ వారసుడితో గోక్కోవడం ఎందుకులే అనుకుంది… తన ధోరణికి భిన్నంగా పొరపాటును అంగీకరించింది… తప్పు అనే పదం రాయలేదు, చింతించలేదు… కానీ వాస్తవం కాదు అని రాసుకొచ్చింది… వాస్తవం కాదు అంటే అవాస్తవం… అంటే రాసింది తప్పు అంటోంది గానీ తప్పు చేయలేదు అంటోంది… రెండింటికీ తేడా ఉంది…

  • ( Mistake: Error: Wrong: Fault: Flaw: Blunder: ఈ పదాల నడుమ తేడాలున్నయ్)

ఈనాడు

ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… పాత్రికేయ లక్షణాలు లేని నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఓవరాక్షన్ ప్రదర్శించింది… నిజానికి కేటీయార్‌ను మించి మిక్కిలి బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది… ఫస్ట్ పేజీలో ఏదేదో రాసుకొచ్చింది… కేటీయార్ వార్తలో పొరపాటుకు ఈనాడు ఆంధ్రాపక్షపాతం, తెలంగాణ వ్యతిరేకతే కారణం అన్నట్టు ముద్ర వేసే ప్రయత్నం చేసింది…

ktr

ఎస్, ఈనాడు ఆంధ్రా పత్రికే… అది అక్కడి పత్రికే గానీ, ఇక్కడి పత్రిక కాదు… అచ్చం చంద్రబాబులాగే దాని ధ్యాస, దాని శ్వాస, దాని బతుకంతా ఆంధ్రా… తెలంగాణలో దాని ఉనికి, దాని కార్యస్థలి మాత్రమే తప్ప బేసిక్‌గా తెలంగాణ వ్యతిరేకతే… వ్యవస్థాగతంగానూ అదే ధోరణి కనిపిస్తుంది ఆ ఆఫీసుల్లో… ఐతే ఇక్కడ వేరు…

గతంలో ఈనాడు తన ఆంధ్రా పక్షపాత బుద్ధిని ప్రదర్శించిందో ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు… రిపోర్టింగులో పొరపాటును అదే కోణంలో చూడాలి… లీగల్ నోటీసు ఇచ్చి, క్షమాపణ అడగడం, వార్తను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేయడం వరకూ కేటీయార్ యాక్షన్‌ను అర్థం చేసుకోవచ్చు… కానీ దానికి రకరకాల రంగులు ఈ సందర్భంలో పులమడం బాగాలేదు…

ఈనాడు తెలంగాణ వ్యతిరేకతకూ, కేటీయార్ వార్తలో పొరపాటుకూ సంబంధం లేదు… మరేదైనా సందర్భం వచ్చినప్పుడు, ఈనాడు తన ఆంధ్రా పక్షపాత బుద్ధి ప్రదర్శించినప్పుడు ఇవన్నీ రంగులు కలిపి ‘ఉతికితే’ అర్థం ఉంటుంది… ఇది మాత్రం సందర్భరహితం… దీన్నే ‘అతి’ అంటారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions