.
8,542 ఓట్లు.. వందల కోట్ల విరాళాలు! రాజకీయ పార్టీల లెక్కల మతలబేంటి?
మూడు సీట్లలో పోటీ.. గెలిచింది ఒక్క సీటూ కాదు.. తెచ్చుకున్న ఓట్లు 0.03 శాతం! కానీ ఖాతాలో వందల కోట్లు. ఖర్చుల లెక్క చూస్తే మరింత ఆశ్చర్యం
ఒక రాజకీయ పార్టీకి డబ్బు ఎందుకు వస్తుంది? ఎన్నికల్లో పోటీ చేయడానికి. ప్రజల్లో తిరగడానికి. సభలు పెట్టడానికి. ప్రచారం చేయడానికి. పార్టీని నిర్మించడానికి. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి. అది సహజమైన లెక్క.
Ads
కానీ ఎన్నికల్లో కేవలం మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి, మొత్తం 8,542 ఓట్లు తెచ్చుకున్న ఒక చిన్న పార్టీ ఖాతాలో ₹291.63 కోట్లు విరాళాలుగా కనిపిస్తే? అంతేకాదు, అదే పార్టీ ఏడాదిలో దాదాపు ₹290 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు సమర్పిస్తే?
అక్కడి నుంచే ప్రశ్న మొదలవుతుంది. ఇది డబ్బు విషయంలో అసాధారణమైన విజయమా? లేక రాజకీయ పార్టీల ఆర్థిక లెక్కల వ్యవస్థలోనే ఏదో పెద్ద డొల్లతనమా?
గుజరాత్‌కు చెందిన New India United Party (NIUP) వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్ననే ముందుకు తెస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం వచ్చిన ఓట్లు 8,542 మాత్రమే. అంటే గుజరాత్‌లోని మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే దాదాపు 0.03 శాతం.
కానీ 2024-25 ఆడిట్ లెక్కల్లో పార్టీ చూపించిన Donation Income ₹291.63 కోట్లు. అంటే ఒక్కో ఓటుకు వచ్చిన విరాళాన్ని లెక్కిస్తే దాదాపు ₹3.42 లక్షలు! ఇది ఓటర్లకు ఇచ్చిన డబ్బు అని కాదు. అలా చెప్పడం తప్పు. కానీ ఒక ఓటు కూడా రాని పార్టీ కాదు; కేవలం 8,542 ఓట్లు తెచ్చుకున్న పార్టీకి ఇంత భారీగా డబ్బు ఎందుకు వస్తోంది? అన్న ప్రశ్న మాత్రం సమంజసమే.
ఇక ఖర్చుల లెక్క చూస్తే అసలు మజా అక్కడే! పార్టీ సమర్పించిన లెక్కల్లో:
పార్టీ ప్రచారం – ₹92.77 కోట్లు
ర్యాలీలు, మోర్చాలు, ఆహార సరఫరా – ₹75.90 కోట్లు
హోర్డింగులు, కరపత్రాలు, బ్యానర్లు – ₹26.33 కోట్లు
జెండాలు, దుపట్టాల ముద్రణ – ₹20.99 కోట్లు
లౌడ్‌స్పీకర్లు, యాంప్లిఫయర్లు, మైకులు – ₹20.70 కోట్లు
ఎన్నికల ఖర్చు – ₹26.39 కోట్లు
అలా Direct Expenses కింద ₹290.16 కోట్లు చూపించారు. చివరికి? ₹55.47 లక్షల Income over Expenditure. అంటే ₹291.63 కోట్లు వచ్చాయి. దాదాపు ₹290 కోట్లు ఖర్చయ్యాయి. చివరికి ₹55 లక్షలు మిగిలాయి. లెక్కకు బాగానే సరిపోతుంది. కానీ జీవితానికి సరిపోతుందా?

ముగ్గురు అభ్యర్థులు.. మరి ₹26 కోట్ల ‘ఎన్నికల ఖర్చు’ ఎక్కడ? ఇక్కడే ఈ వ్యవహారంలోని అసలు ముల్లు ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి ₹95 లక్షలు. అంటే మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు అభ్యర్థులు గరిష్ఠ పరిమితి మొత్తాన్ని ఖర్చు చేశారని అనుకున్నా: ₹95 లక్షలు × 3 = ₹2.85 కోట్లు.
అయితే పార్టీ తన వార్షిక ఖాతాలో “Election Expenses” కిందనే ₹26.39 కోట్లు చూపిస్తోంది. ఇది చూసి వెంటనే “₹26 కోట్లు ముగ్గురు అభ్యర్థుల మీద ఖర్చు చేశారు” అని చెప్పలేం. ఎందుకంటే పార్టీ ఎన్నికల ఖర్చు, అభ్యర్థి వ్యక్తిగత ఎన్నికల ఖర్చు ఒకటి కాదు. పార్టీ కేంద్ర ప్రచారం, స్టార్ క్యాంపెయినర్లు, పార్టీ స్థాయి ప్రచారం, ఇతర పార్టీ కార్యకలాపాలు వేర్వేరు ఖాతాల్లో ఉంటాయి. ECI కూడా పార్టీ ఎన్నికల వ్యయాన్ని, అభ్యర్థి వ్యయాన్ని వేర్వేరుగా పర్యవేక్షిస్తుంది.
కానీ అప్పుడు మరో ప్రశ్న తప్పదు: ఆ ₹26.39 కోట్లు అసలు ఏ నియోజకవర్గాల్లో, ఎవరి కోసం, ఏ కార్యక్రమాలపై ఖర్చయ్యాయి? ₹92.77 కోట్ల “Party Campaigning”, ₹75.90 కోట్ల “Rally & Morcha” వంటి భారీ మొత్తాలకు నియోజకవర్గాల వారీగా, కార్యక్రమాల వారీగా ఆధారాలు ఉన్నాయా? ఇవే అసలు పరిశీలించాల్సినవి.
ఇది ఒక్క ఏడాది కథ కాదు . ఇక్కడే విషయం మరింత గంభీరంగా మారుతుంది. Association for Democratic Reforms (ADR) విశ్లేషణ ప్రకారం, 2022-23లో New India United Party ₹407.45 కోట్ల విరాళాలు చూపించింది. అంతేకాదు, ఆ మొత్తం విరాళాల్లో 100 శాతం ₹20,000కు పైబడిన విరాళాలుగా ప్రకటించబడింది.

- అంటే ఇది ఒక్కసారిగా 2024 ఎన్నికల సమయంలో కనిపించిన అంకె కాదు. ADR విశ్లేషణలో మరో పెద్ద చిత్రం బయటపడింది. 2022-23లో దేశంలోని టాప్-10 Registered Unrecognised Political Parties (RUPPs) కలిపి ₹1,581.66 కోట్ల విరాళాలు ప్రకటించాయి. అందులో 93.56 శాతం ₹20,000కు పైబడిన విరాళాలు. ఈ టాప్-10లో ఐదు పార్టీలు గుజరాత్‌కు చెందినవే.
అంటే గుజరాత్‌లోని కొన్ని పేరు పెద్దగా వినిపించని, ఎన్నికల్లో ప్రభావం దాదాపు కనిపించని పార్టీల ఖాతాల్లో మాత్రం వందల కోట్ల రూపాయలు తిరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఒక్క NIUP సమస్య కాదు. ఇది రాజకీయ పార్టీల ఫండింగ్ వ్యవస్థపై ప్రశ్న. ₹407 కోట్లు.. తర్వాత ₹200.65 కోట్లు.. ఇప్పుడు ₹291.63 కోట్లు!
ఈ కథలో కూడా మరో ముఖ్యమైన అంశం ఉంది. ADR గత ఆర్థిక సంవత్సరాల లెక్కలను పరిశీలిస్తూ NIUP ఆదాయం ఒక్కో ఏడాది భారీ స్థాయిలో మారిన విషయాన్ని ప్రస్తావించింది.
2022-23లో ₹407.45 కోట్లు.
2023-24లో సుమారు ₹200.65 కోట్లు.
2024-25లో ఇప్పుడు మన ముందున్న లెక్కలో ₹291.63 కోట్లు.
ఇది ఒక సాధారణ ప్రజా పార్టీకి వచ్చే చిన్నచిన్న విరాళాల నమూనా కాదు. ఇక్కడ పెద్ద మొత్తాల్లో డబ్బు వస్తోంది. మరి ఆ డబ్బు ఇచ్చేవాళ్లు ఎవరు? ఎందుకు ఇస్తున్నారు? ఏ రాజకీయ ప్రయోజనం కోసం ఇస్తున్నారు? ఒక చిన్న పార్టీకి వందల కోట్లు ఇవ్వాల్సిన అవసరం దాతలకు ఎందుకు ఏర్పడింది? ఇవన్నీ అడగాల్సిన ప్రశ్నలే.
అసలు ప్రశ్న, ఈ ఖర్చు నిజంగా ఏ పార్టీ పెడుతోంది… అంటే ఇది బినామీ పార్టీ… ఈ నిధులు, ఈ ఖర్చులు అన్నీ కాగితాలపై లెక్కల సర్దుబాట్లు, అంటే ఫేక్… ఇంకో ప్రమాదకరమైన గ్యాప్: డబ్బు రావడానికీ, ఎన్నికల్లో కనిపించడానికీ సంబంధం లేదు! ఇదే ఈ కథలో నాకు అత్యంత ఆసక్తికరమైన అంశం.
ఒక పార్టీకి ₹290 కోట్లు వచ్చాయని అనుకుందాం. ఆ పార్టీ నిజంగానే ₹290 కోట్లు ప్రజల్లో ఖర్చు చేసి ఉంటే— దాని ఆనవాళ్లు ఎక్కడ? వేలాది హోర్డింగులు కనిపించాలి. వందలాది భారీ సభలు కనిపించాలి. వేలాది కార్యకర్తల కదలిక కనిపించాలి. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ప్రచారం కనిపించాలి. వాహనాలు తిరగాలి. ప్రచార సామగ్రి వెల్లువెత్తాలి. మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పార్టీకి ఎన్నికల సమయంలో దాని ఉనికి కనిపించాలి. ప్రచారం దుమ్ము రేగాలి…
కానీ చివరకు వచ్చిన ఓట్లు? 8,542. … ఇది తక్కువ ఓట్లు రావడం తప్పు కాదు. ప్రజలు తిరస్కరించవచ్చు. కొత్త పార్టీ కావచ్చు. అభ్యర్థులు బలహీనంగా ఉండొచ్చు. కానీ వందల కోట్ల ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తుంటే, ఆ ఖర్చు నేలమీద ఎంత కనిపించింది? అన్నది మాత్రం అడగాల్సిందే.
ఇక్కడే మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని అసలు డొల్లతనం బయటపడుతుంది ECI దగ్గర మూడు వేర్వేరు ప్రపంచాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి – పార్టీ వార్షిక ఆడిట్ లెక్కలు. ఎంత డబ్బు వచ్చింది? ఎంత ఖర్చయింది? రెండు – పార్టీ ఎన్నికల ఖర్చు లెక్కలు. ఎన్నికల సమయంలో ప్రచారం, ప్రయాణం, అభ్యర్థులకు ఇచ్చిన మొత్తం, పబ్లిసిటీ మొదలైనవి. మూడు – ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చు లెక్క. అభ్యర్థి తన నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేశాడు? కాగితంపై ఇవన్నీ వేర్వేరు వ్యవస్థలు.
కానీ ఈ మూడు లెక్కలను ఒకదానితో మరొకటి cross-check చేసేంత పారదర్శకత ఉందా? అక్కడే సందేహం. ADR కూడా 2024 ఎన్నికలపై చేసిన విశ్లేషణలో అనేక పార్టీల ఎన్నికల వ్యయ ప్రకటనలు ECI వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని పేర్కొంది. 2024లో 690 Registered Unrecognised Political Parties ఎన్నికల్లో పోటీ చేశాయని, వాటి ఎన్నికల వ్యయ ప్రకటనలను ఆ విశ్లేషణలో పరిశీలించలేకపోయామని ADR చెప్పింది.
ఇది చిన్న విషయం కాదు. పెద్ద పార్టీల లెక్కల్లోనూ ఇదే కథకు మరో రూపం. ఇది చిన్న పార్టీలను మాత్రమే అనుమానించడం కాదు. 2024 లోక్‌సభతో పాటు కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చును ADR విశ్లేషించింది. ఆ పార్టీలు కలిపి ₹3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించాయి. అందులో ప్రచారంపైనే ₹2,008.30 కోట్లు ఖర్చయినట్లు చూపించాయి.
అంటే పెద్ద పార్టీలకూ పార్టీ ఖర్చు, అభ్యర్థి ఖర్చు వేర్వేరు లెక్కలే. BJP, ఉదాహరణకు, ఈ విశ్లేషణలో దాదాపు ₹1,493.91 కోట్లు ఎన్నికల ఖర్చుగా ప్రకటించింది. కాంగ్రెస్ ₹620 కోట్లకు పైగా. ఎన్నికల ఖర్చుల విరాళాలు, బిల్లులు, లెక్కలు అంతా ఓ మాయ… క్రాస్ చెక్ చేసేవాడు లేడు, ఆ లెక్కల నిగ్గు తేల్చేవాడూ లేడు..!!
Share this Article