Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…

June 20, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. గంగను చూస్తే గౌరికి కోపం, గౌరిని చూస్తే గంగతో తంటా, ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా, నువ్వైనా చెప్పయ్యా ….. ఏకపత్నీవ్రతుడయిన బ్రహ్మయ్య ఏం చెపుతాడు . బహుపత్నులున్న ఏ విష్ణువునో , శివయ్యనో అడగాలి . ఇద్దరు భార్యలతో కాపురం ఎంత కత్తి మీద సామో ఇ వి వి సత్యనారాయణ అద్భుతంగా చూపారు . ఏమయినా స్వానుభవం ఉందేమో తెలియదు .

ఇద్దరు భామల పాత్రలకు కేరాఫ్ అడ్రసయిన శోభన్ బాబుకు మంచి హిట్ సినిమా 1993 మార్చిలో వచ్చిన ఈ ఏవండీ ఆవిడొచ్చింది సినిమా . తల్లి మేనకోడల్ని తండ్రి మేనకోడల్ని ఇద్దరినీ పెళ్లి చేసుకోవలసి వస్తుంది హీరో గారికి . వారంలో చెరి మూడు రోజుల వంతు . ఆదివారం తల్లిదండ్రుల వద్ద షెల్టర్ . ఆ ఆదివారం కూడా హీరో గారిని ప్రశాంతంగా ఉండనివ్వరు ఇద్దరూ సపత్నులు .

Ads

వాణిశ్రీ , శారద సపత్నులు . ఆ వయసులో ఆ పాత్రల్ని వేయటానికి అంగీకరించిన ఇద్దరు హీరోయిన్లను అభినందించాలి . ఇద్దరికీ గతంలో శోభన్ బాబుతో వీర హిట్లున్నాయి . వాటికి తోడయింది ఈ సినిమా కూడా . కోటి రూపాయల బడ్జెట్టుతో తీస్తే మూడు కోట్లు వసూలయిందట .

ప్రేక్షకులు కూడా రసికులు . తమ నిజ జీవితంలో తమకు సాధ్యం కానివి తెర మీద జరుగుతుంటే exciting గా ఉంటుందేమో ! స్త్రీ పురుష ప్రేక్షకులు అందరూ ఆదరించారు ఈ సినిమాను . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . టూకీగా కధ ఏంటంటే :

వాణిశ్రీ , శారద ఇద్దరూ ఒకేసారి ప్రసవిస్తారు . బతికిపోయాడు శోభన్ బాబు . ప్రసవంలోనే శారద బిడ్డ చనిపోతుంది . మరలా పిల్లలు పుట్టరని డాక్టర్ చెపుతాడు . వాణిశ్రీకి పుట్టిన బిడ్ఢని శారద దగ్గరకు చేరుస్తాడు . ఆమెకు మరలా పిల్లలు పుడతారనే ఆశతో . అయితే ఆమెకు కూడా తర్వాత పిల్లలు పుట్టరు .

శారద దగ్గర ఆ పిల్లే రంభగా పెద్దదవుతుంది . తన తల్లికి సపత్ని అయిన వాణిశ్రీ మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది . వాణిశ్రీకి ఓ మేనల్లుడు హరీష్ . అతనికి రంభ మీద మనసు . వాణిశ్రీకి ఓ విలన్ అన్న కోట శ్రీనివాసరావు . తన కొడుక్కి శారద కూతురిని చేసుకుని ఆస్తిని కొట్టేయ్యాలనేది అతని ప్లాన్ .

రంభపై తన కొడుకు అత్యాచారం చేసాడని కధ అల్లి అల్లరి చేస్తాడు . నిజం తెలుసుకున్న అందరూ వాళ్ళకు దేహశుద్ది చేసి హరిష్ , రంభలకు వివాహం జరిపిస్తారు . వాణిశ్రీ ఇంటికి వచ్చిన రంభ ఆమె మీద ద్వేషంతో గొడవలు సృష్టిస్తూ ఉంటుంది .

క్లైమాక్సులో రంభ గర్భం పోగొట్టుకున్నాక జరిగిన పంచాయతీలో శోభన్ బాబు రంభ వాణిశ్రీ కూతురు అనే నిజాన్ని బయటపెట్టడం , రంభ తన ద్వేషాన్ని విడనాడటం , సపత్నులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటానికి ఇష్టపడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఇద్దరు ప్రియురాళ్ళ సినిమాలు ఎన్నో ఉన్నా ఇలా ఇద్దరు భార్యలతో ఒకేసారి ఓపెన్ గా కాపురం చేసే కధాంశంతో సినిమాలు చాలా తక్కువే . పైగా ఆ కాపురాన్ని రొమాంటిగ్గా చూపడం దర్శకునికి చేతకావాలి . ఇవివి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో భువనచంద్ర పాటలు సినిమా విజయానికి దోహదపడ్డాయి . ఇద్దరు భార్యలతో మరో పాట హత్తుకోమన్నాది భామ కూడా రమ్యంగా ఉంటుంది . ఒకనాటి హీరో హీరోయిన్లు వయసు పిల్లల్లాగా డాన్స్ చేస్తారు ఈ పాటలో . హరీష్ , రంభల మీద రెండు డ్యూయెట్లు గుచ్చి గుచ్చి చూడకురా , భామ భామ పడుచు రేయిల చిత్రీకరణ బాగుంటుంది . గుచ్చి గుచ్చి చూడకురా పాట చిత్రీకరణ వెరైటీగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ శ్రావ్యంగా పాడారు .

  • సినిమాలో కామెడీ ట్రాకే కాస్త అపహాస్యం అయిందేమో అనిపిస్తుంది . బాబూమోహన్ శోభన గండం , గాడిదతో పెళ్లి , ఆ గాడిదకో తండ్రి లాంటి వాడు , వగైరా . సినిమాలో శోభన్ బాబు ఇద్దరు పెళ్ళాల కాపురం లాగా సమాంతరంగా నడిపాడు దర్శకుడు .

అలాగే మరో కామెడీ ట్రాక్ బ్రహ్మానందం , ఐరన్ లెగ్ శాస్త్రి . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , అత్తిలి లక్ష్మి , శివాజీ రాజా , ఆలీ , చిడతల అప్పారావు , మాస్టర్ ఆదిత్య తదితరులు నటించారు . సినిమా షూటింగ్ అంతా పశ్చిమ గోదావరి జిల్లా ధర్మవరం , వేలివెన్ను , దొమ్మేరు ప్రాంతాలలో జరిపారు . యం వి యస్ హరనాధరావు డైలాగులను బాగా వ్రాసారు .

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూట్యూబులో ఉంది . శోభన్ బాబు , వాణిశ్రీ , శారద అభిమానులు ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions