Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐదుగురు షీరోలు… ఒకరిని మించి మరొకరు… మరిచిపోలేని పాత్రలు…

June 19, 2024 by M S R

అయిదుగురు షీరోల సినిమా 1973 లో వచ్చిన ఈ గాంధీ పుట్టిన దేశం సినిమా . ఈ అయిదు షీరో పాత్రలను ధరించిన నటీమణులు షావుకారు జానకి , జయంతి , ప్రమీల , లత , నిర్మలమ్మ . ఈ షీరో పాత్రలను ఇంత స్ట్రాంగ్ గా , ఇంటెన్స్ గా మలిచిన రచయిత భావనారాయణకు , స్క్రీన్ ప్లే వ్రాసుకున్న దర్శకుడు లక్ష్మీ దీపక్ లకు హేట్సాఫ్ .

షావుకారు జానకి కంఠం ఖంగుఖంగున మోగుతుందని మనందరికీ తెలిసిందే . ఈ సినిమాలో జడ్జిగా , మానవత్వం కల మనిషిగా బాగా నటించారు . రెండో పాత్ర జయంతిది . కార్మికుల కాలనీలో చదువుకున్న మహిళ , పది మందికి మంచీచెడూ చెప్పటమే కాకుండా , సహాయం చేసే వ్యక్తి కూడా . దారి తప్పిన భర్తను ధైర్యంగా వాయించి , దారిలో పెట్టుకునే స్త్రీ పాత్రలో గొప్పగా నటించింది .

మూడో పాత్ర ప్రమీలది . ఈ సినిమా ద్వారానే పరిచయం అయింది . పేదరికంతో , భార్యనే తార్చటానికి తయారయిన భర్తని , తన శీల రక్షణ కొరకు తల పగలకొట్టి చంపేసే పాత్ర . మొదటి సినిమా అయినా చక్కగా నటించింది .

Ads

నాలుగో పాత్ర లతది . సినిమా టైటిల్సులో నూతన తారగా పరిచయం చేసారు . మరి ఇది ముందా , అందాలరాముడు ముందా తెలియదు . తన మీద కన్నేసిన కీచక మేనేజర్ని తప్పించుకుంటూ , తప్పుడు హత్య కేసులో ఇరికించబడిన భర్తను రక్షించుకోవటానికి , ఆ కీచకుడికే శీలార్పణ చేసి , ప్రాణత్యాగం చేసే పాత్ర . నూతన నటి అయినా చక్కగా నటించింది .

ఇంక అయిదో పాత్ర నిర్మలమ్మది . చదువుకోకపోయినా కోడలు చెరచబడితే , చుట్టూ ఉండే జనం చీదరించుకుంటున్నా , కడుపులో పెట్టుకునేందుకు సిధ్ధమయ్యే ఉన్నతమైన పాత్రలో బ్రహ్మాండంగా నటించింది . నిర్మలమ్మకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అనుకోండి .

ప్రతి మహిళ , అభ్యుదయ భావాలు-మానవత్వం కల ప్రతి వ్యక్తి చూడవలసిన చిత్రం . బాగా హిట్టయింది కూడా . విజయవాడ-గుణదల , మా గుంటూరు జయలక్ష్మి టుబాకో కంపెనీలలో షూటింగ్ చేసారు . టైటిల్సులో వీరితో పాటు హోటల్ మనోరమ వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు .

గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం . అద్భుతమైన సాహిత్యం . మరచిపోలేని పాట . స్వాతంత్ర్య దినోత్సవం నాడు , రిపబ్లిక్ డే నాడు , గాంధీ జయంతి నాడు అన్ని చోట్లా వింటూనే ఉంటాం . ఇంత మంచి పాటను వ్రాసిన మహానుభావుడు మైలవరపు గోపి . ఎవరికి అడగాలి బాపూ ఏమని అడగాలి అనే నారాయణరెడ్డి వ్రాసిన పాట కూడా బాగుంటుంది . దాశరధి వ్రాసిన వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా పాట శ్రావ్యంగా ఉంటుంది . శ్రీశ్రీ వ్రాసిన ఓరోరి గుంట నక్క ఊరేగే ఊరకుక్కా అనే పాట బాగానే ఉంటుంది . యస్ పి కోదండపాణి సంగీతాన్ని అందించారు .

హీరోగా వచ్చి , విలన్ అయిన కృష్ణంరాజు రెబల్ స్టార్ గా రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన పాత్ర . రెబల్ కార్మిక నాయకుడు . మరో ప్రధాన పాత్ర ప్రభాకరరెడ్డిది . ఆయనే ఈ సినిమాకు నిర్మాత కూడా . ఇతర పాత్రల్లో రాజబాబు , రమాప్రభ , సాక్షి రంగారావు , త్యాగరాజు , రమణారెడ్డి , ఆనందమోహన్ ప్రభృతులు నటించారు . రమాప్రభ పాత్రను కూడా ప్రస్తావించాల్సిందే . ఆడోళ్ళను సప్లై చేసే పాత్ర . గొప్పగా నటించింది . తెలుగు సినిమా రంగంలో ఏ పాత్రనయినా అద్భుతంగా నటించి , మెప్పించగల నటి .

ఈ సినిమాకు సంభాషణలను వ్రాసిన మద్దిపట్ల సూరిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి .చాలా పదునైన మాటల్ని , ఇలాంటి సినిమాకు ఎలాంటి మాటలు కావాలో అలాంటి మాటల్ని అందించారు . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో చాలా సార్లు చూసా . టివిలో వచ్చిన ప్రతీ సారీ కాసేపయినా చూస్తుంటా . ఈ సినిమా అంటే నాకు అంత గౌరవం . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా నేటి నారీమణులు తప్పక చూడాలి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………. (By… డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
  • లక్ష కోట్ల బంగారం అమ్మేశాడా మోదీ..! బ్లూమ్‌బర్గ్ కథనం- వార్తలు…
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?
  • కాలం ఎవరినీ క్షమించదు… ఒక మమత పతనం, ఒక గుణపాఠం!
  • ఏ వర్ణం ఎవడబ్బ సొత్తు..? తమిళనాట ఓ ‘రంగు రాద్ధాంతం’..!!
  • సినిమా ‘రాజీ’పడింది..! కానీ ఆ గూఢచారిణి ఆత్మ క్షమిస్తుందా..?
  • Jolly LLB 3 … ‘అభివృద్ధి’ ఎప్పుడూ రైతు ఇంటినే ఎందుకు కూల్చాలి…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions