.
Srini Journalist … రాజకీయ సమరంగా మారిన పలాస హిట్ అండ్ రన్ కేసు!
ఒక సాధారణ రోడ్డు ప్రమాదం.. ఒక రాష్ట్ర రాజకీయాలనే ఎలా కుదిపేయగలదో చెప్పడానికి పలాసలో జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చీకటి పడిన వేళ రోడ్డుపై జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీల మధ్య ఒక నిప్పుల కొలిమిని రాజేసింది.
ఈ కేసులో అసలు ఏం జరిగింది?
చట్టపరమైన లోపాలు ఎక్కడ ఉన్నాయి?
రాజకీయ విమర్శల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.
విషయం పలాసలోని ఒక రోడ్డుపై మొదలైంది. వేగంగా వచ్చిన ఒక మోటార్ సైకిల్, దుబ్బ దానయ్య అనే ఒక వృద్ధ గొర్రెల కాపరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత, అక్కడ మానవత్వం పూర్తిగా మంటగలిసింది. రక్తం ఓడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధుడిని కాపాడటానికి ఆ బైక్ నడిపిన యువకుడు ఏమాత్రం ప్రయత్నించలేదు.
Ads
అతనికి కనీస వైద్య సాయం అందించకుండా, ఒక కారులో ఎక్కి అక్కడ నుంచి పారిపోయాడు. సరైన సమయానికి సాయం అందక ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా సదరు యువకుడు పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోలేదు.
సంఘటన స్థలంలో పడి ఉన్న బైక్ ఆధారంగా పోలీసులు మొదట విచారణ జరిపారు. అయితే నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక పక్కా స్కెచ్ వేశారు. త్యాడి సిద్ధార్థ అనే వ్యక్తి పోలీసుల ముందుకు పోలీసులు ముందుకు వచ్చాడు ఈ బైక్ నాదే అని.
“ప్రమాదం నేనే చేశాను” అని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కనీస ప్రాథమిక విచారణ చేయకుండా, లోతుగా చెక్ చేయకుండా ఆ నకిలీ డ్రైవర్ సిద్ధార్థను మొదట అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకున్నారు.
ప్రారంభంలోనే పోలీసులు చూపించిన ఈ నిర్లక్ష్యం వల్లే, నిందితులకు సాక్ష్యాలను తారుమారు చేయడానికి, కథలు అల్లడానికి తగినంత సమయం దొరికింది.
సీసీటీవీతో తిరగబడిన కథ…
నకిలీ డ్రైవర్ కథతో కేసు ముగించేద్దాం అనుకుంటున్న తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ రూపంలో అసలు నిజం బయటపడింది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ విజువల్స్‌ను పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రమాదం జరిగిన సమయంలో బైక్ నడిపింది నకిలీ డ్రైవర్ కాదు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడైన 18 ఏళ్ల ఆరవ్ వర్మ అని తేలింది. ఈ డిజిటల్ ఆధారంతో పోలీసులు ఆ తప్పుడు డ్రామాను బద్దలు కొట్టారు.
నిజాన్ని దాచి, పోలీసులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించినందుకు నకిలీ డ్రైవర్ త్యాడి సిద్ధార్థను పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. ఇక తప్పుకోవడానికి ఎలాంటి దారి లేకపోవడంతో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.
జగన్ వాదన: ఈ అరెస్ట్‌లు జరిగిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేవలం 18 ఏళ్ల పిల్లాడిపై పోలీసులు ‘కల్పబుల్ హోమిసైడ్’ (ఉద్దేశపూర్వక హత్య – ప్రాణం పోతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం) లాంటి అత్యంత కఠినమైన, నాన్-బైలబుల్ సెక్షన్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.
జగన్ వాదనలోని పాయింట్ : సాధారణంగా భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను ‘యాక్సిడెంటల్ నెగ్లిజెన్స్’ (bailable sections) కిందే చూస్తారు. ఒక ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చాలంటే, డ్రైవర్‌కు ముందే తన వల్ల ప్రాణం పోతుందనే కచ్చితమైన ఉద్దేశం ఉందని నిరూపించాల్సి ఉంటుంది. ఒక రోడ్డు ప్రమాదానికి ఇలాంటి కఠినమైన సెక్షన్ పెట్టడం చాలా అరుదు కాబట్టి, ఇది టీడీపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు అని జగన్ వాదించారు.
జగన్ వాదనలోని మైనస్ పాయింట్ : జగన్ కేవలం లీగల్ సెక్షన్ల గురించి మాట్లాడారు కానీ, ప్రమాదం జరిగిన తర్వాత సాక్ష్యాలను దాచడానికి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక నకిలీ డ్రైవర్‌ను ప్లాంట్ చేసిన ఘోరమైన నేరాన్ని (Evidence Tampering) ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు.
సాక్ష్యాలను తారుమారు చేయడానికి, పోలీసులను బురిడీ కొట్టించడానికి జరిగిన ఈ కుట్రను పలాస కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రధాన నిందితుడు ఆరవ్ వర్మతో పాటు, తప్పుడు సాక్ష్యానికి సహకరించిన నకిలీ డ్రైవర్ త్యాడి సిద్ధార్థకు కూడా కోర్టు తక్షణ బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
18 ఏళ్ల పిల్లాడు ఏదో తెలియక డ్యాష్ ఇస్తే ఇంత తీవ్రమైన కేసులా అని జగన్ వాదించడం మాత్రం హాస్యాస్పదం… పాపం జగన్ అనుకోవాల్సిందే… ఎందుకంటే..? చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కోర్టు ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది.

ఈ కేసు ఇప్పుడు ఒక పెద్ద లీగల్ యుద్ధానికి సిద్ధమైంది. కోర్టులో పోలీసులు నిందితుడి అతివేగం, బాధితుడిని వదిలేసి పారిపోవడం, సాక్ష్యాల తారుమారు వంటి అంశాలను బేస్ చేసుకుని ‘కల్పబుల్ హోమిసైడ్’ను నిరూపించాల్సి ఉంటుంది.
మరోవైపు ఈ సాక్ష్యాల మార్పిడి డ్రామా వెనుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా, పలాస రోడ్డుపై జరిగిన ఈ హిట్ అండ్ రన్ కేసు ఆంధ్రప్రదేశ్‌లో చట్టానికి, రాజకీయాలకి మధ్య జరుగుతున్న ఒక హై-వాల్యూమ్ క్రైమ్ డ్రామాగా మారిపోయింది.
Share this Article