.
Srini Journalist …. పాకిస్తాన్ బుద్ధి మారలేదు.
సరిహద్దుల్లో భారత సైన్యం డేగ కన్ను వేయడంతో,
ఈసారి జలమార్గాల ద్వారా సరిహద్దులు దాటి
దేశంలోకి చొరబడేందుకు లష్కరే తోయిబా (LeT)
సరికొత్త ‘వాటర్ ఫోర్స్’ విభాగాన్ని రంగంలోకి దించింది.
ఇప్పటివరకు రహస్యంగా సాగిన వీరి అండర్ వాటర్ కంబాట్ (నీటి అడుగున పోరాడే) శిక్షణకు సంబంధించిన దృశ్యాలు,
మొదటిసారిగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం కావడం కలకలం రేపుతోంది.
మంగ్లా డ్యామ్: ఉగ్రవాదానికి మళ్లీ చిరునామా!
భారత రక్షణ రంగాన్ని అత్యంత కలవరపరుస్తున్న అంశం ఈ శిక్షణ జరుగుతున్న ప్రాంతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK), పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న భారీ జలాశయం ‘మంగ్లా డ్యామ్’ వేదికగా ఈ ముఠా తిష్ట వేసింది. గతంలో 2008 నవంబర్ 26న ముంబైపై దాడికి తెగబడ్డ అజ్మల్ కసబ్ బృందానికి కూడా సరిగ్గా ఇదే మంగ్లా డ్యామ్‌లోనే సముద్రయాన, నావిగేషన్ శిక్షణ ఇచ్చారు.
Ads
ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో లష్కరే కమాండర్ రానా మహమ్మద్ అష్ఫాక్ పర్యవేక్షణలో సరికొత్త బ్యాచ్ సిద్ధమవుతోంది. నీటి అడుగున శత్రువుల కంటికి చిక్కకుండా ఈత కొట్టడం (Combat Swimming), స్కూబా డైవింగ్ (Scuba Diving) పరికరాలతో గంటల తరబడి నీటిలో ఉండటం, అత్యాధునిక హై-స్పీడ్ ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లను నడపడంలో వీరికి 20 నుండి 40 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు లీకైన వీడియోల ద్వారా స్పష్టమవుతోంది.
మీ ఊపిరి ఆపేస్తాం’.. హారిస్ దార్ బహిరంగ హెచ్చరిక!
ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి, అమెరికా ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన హారిస్ దార్. ఇటీవల పాకిస్తాన్‌లోని షేక్‌పురాలో లష్కరే కొత్త రిక్రూట్లకు శిక్షణ ఇస్తూ అతడు మాట్లాడిన మాటలు భారత సార్వభౌమాధికారానికి సవాలు విసిరేలా ఉన్నాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘సింధు జలాల ఒప్పందాన్ని’ (Indus Waters Treaty) తాత్కాలికంగా నిలిపివేయడాన్ని (Abeyance) దార్ ప్రస్తావించాడు.
“భారత్ గనుక మా నీటిని ఆపాలని చూస్తే…
మేము మీ ఊపిరి ఆపేస్తాం…
మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం.
నీటి వివాదంపై మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
2026 లో భారత్‌పై జల యుద్ధం ఖాయం”
అంటూ అతడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఈ ప్రసంగం ముగిసిన వెంటనే ఉగ్రవాదులను మంగ్లా డ్యామ్ వైపు మళ్లించడం గమనార్హం.
టెక్నాలజీతో సరికొత్త ‘ప్లేబుక్’ (New Playbook)
భారత నిఘా వర్గాల (Intelligence Agencies) విశ్లేషణ ప్రకారం… లష్కరే తోయిబా కేవలం సాంప్రదాయ ఆయుధాలకే పరిమితం కావడం లేదు. ఈసారి వారు తమ వ్యూహాన్ని మార్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
సైబర్ దాడులు, డీప్‌ఫేక్ ప్రచారాలు ,
దేశంలో అలజడి సృష్టించడానికి
క్లిష్టమైన సమాచార చౌర్యం కోసం
ఏఐ టూల్స్ వాడుతున్నారు.
మార్షల్ ఆర్ట్స్ & డిజిటల్ వార్‌ఫేర్:
భౌతిక దాడులతో పాటు సోషల్ మీడియా ద్వారా
యువతను ఆకర్షించేందుకు హై-క్వాలిటీ వీడియోలను
ఒక మానసిక యుద్ధ తంత్రంలా (Psychological Warfare) వాడుతున్నారు.
తీరప్రాంతంలో ‘హై అలర్ట్’.. దూకుడు పెంచిన భారత్!
శత్రువుల ప్రతి హెచ్చరికను తిప్పికొట్టేందుకు భారత్
ఈసారి మునుపెన్నడూ లేనంత కఠినమైన వ్యూహంతో సిద్ధమైంది.
ఇటీవల స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదికల ప్రకారం, దేశ రక్షణ వ్యూహంలో భాగంగా
ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ అరిహంత్ (INS Arihant) వంటి అణు జలాంతర్గాములలో న్యూక్లియర్ వార్‌హెడ్‌లను (అణు బాంబులను) భారత్ లైవ్ (సన్నద్ధం) చేసింది. శత్రు దేశాల నుండి ఎలాంటి జల చొరబాట్లు లేదా దాడులు జరిగినా.. క్షణాల వ్యవధిలో కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ కొట్టేందుకు, నౌకాదళాన్ని సర్వసన్నద్ధం చేస్తూ
భారత్ పంపిన ఈ వ్యూహాత్మక సంకేతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
దీనికితోడు, గుజరాత్ నుండి ముంబై, కేరళ మీదుగా ఉన్న సుదీర్ఘ భారత తీరప్రాంతం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) , నౌకాదళం తమ గస్తీని ముమ్మరం చేశాయి. సముద్ర మార్గాల్లో అనుమానాస్పద బోట్ల కదలికలపై నిఘా ఉంచేందుకు అత్యాధునిక రేడార్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతుకు ఈ మంగ్లా డ్యామ్ దృశ్యాలే సజీవ సాక్ష్యమని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2026 హెచ్చరికల నేపథ్యంలో, శత్రువుల ఆటకట్టించడానికి భారత్ చూపిన ఈ సైనిక నిశ్చయత భద్రతా పరంగా అత్యంత కీలకంగా మారింది…
Share this Article