.
నిజానికి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇంట్రస్టింగ్ న్యూస్… ఏమనీ..? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం – బనకచర్ల (నల్లమలసాగర్) నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది… రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యావరణ అనుమతుల ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల అంచనాల కమిటీ (EAC) వెనక్కి పంపింది. దీంతో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే కీలక అడ్డంకి ఎదురైంది…
ఎందుకు..? చట్టపరమైన చిక్కులే కారణం… ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించిన ఈఏసీ, 1980 గోదావరి జల వివాదా ల ట్రిబ్యునల్ తీర్పు, అంతర్రాష్ట్ర జల హక్కులు, పర్యావరణ ప్రభావాలపై వచ్చిన అభ్యంతరాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. గోదావరి వరద జలాల మళ్లింపు వల్ల తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో ప్రస్తుత రూపకల్పనపై మరింత సమగ్ర పరిశీలన అవసరమని స్పష్టం చేసింది.
Ads
శాస్త్రీయ అధ్యయనం తప్పనిసరి… గోదావరి బేసిన్లో వాస్తవంగా అందుబాటులో ఉన్న మిగులు వరద జలాలపై కేంద్ర జల సంఘం (CWC) ద్వారా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని కమిటీ సూచించింది. పూర్తి సాంకేతిక నివేదిక సిద్ధమైన తర్వాత పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను కూడా పరిశీలించాని చెప్పింది…
సో, ఇక్కడితో చంద్రబాబు వదిలేస్తాడని కాదు… అసలే తనకు కాళేశ్వరం వంటి ఏటీఎం కావాలి… అందుకని మోదీ మీద ఒత్తిడి తెస్తాడు… కానీ ఈలోపు తెలంగాణలో బీఆర్ఎస్ పదే పదే ఏమని ఆరోపిస్తోంది..?
రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు కోసం బనకచర్ల మీద పోరాడం లేదు… ఇదొక కుట్ర, తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ అని ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది… కానీ ఏ రాష్ట్ర పాలకుడూ తన రాష్ట్ర ప్రయోజనాల్ని, తన రాజకీయ అనివార్యతలను పణంగా పెట్టడు… తనకు మాలిన ధర్మం ఉండదు… కానీ రేవంత్ రెడ్డి సైలెంటుగా కొడుతూ పోయాడు… సైలెంట్ డిప్లొమసీ అనొచ్చు…
అవసరమైన చట్టబద్ధ, అంతర్రాష్ట్ర, సాంకేతిక ప్రక్రియలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశం లేదని క్లియర్… తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు ప్రయత్నాలకు గండికొట్టిందనేది క్లియర్…
నినాదాలు, అరుపుల కంటే ఫైళ్లతో పోరాటం… ఇలాంటి అంతర్రాష్ట్ర జల వివాదాలను బహిరంగ సభల్లో నినాదాలు చేసి, ప్రెస్‌మీట్లలో విమర్శలు చేసి పరిష్కరించడం సాధ్యం కాదు… ఇది రాజకీయ మైక్ ముందు జరిగే పోరాటం కాదు…
ట్రిబ్యునల్ అవార్డులు కావాలి.
అంతర్రాష్ట్ర ఒప్పందాలు కావాలి.
CWC పరిశీలన కావాలి.
పర్యావరణ అనుమతులు కావాలి.
సాంకేతిక నివేదికలు కావాలి.
అవసరమైతే న్యాయపోరాటం కావాలి.
అంటే… పొలిటికల్ ఢమఢమలకంటే పరిపాలనా ప్రక్రియే ఇక్కడ అసలు ఆయుధం. రేవంత్ రెడ్డి అదే మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. బయట పెద్దగా యుద్ధం ప్రకటించకపోయినా, అవసరమైన చోట అభ్యంతరాలు. అవసరమైన శాఖల ముందు వాదనలు. కేంద్ర సంస్థల ముందు సాంకేతిక అంశాలు. ఢిల్లీ స్థాయిలో రాజకీయ చర్చలు. ఇది ఒక రకమైన సైలెంట్ డిప్లొమసీ.
మరిప్పుడు హరీష్ రావు ఏమంటాడు..? ఏమీ అనలేడు..? పదే పదే చంద్రబాబుకు గురుదక్షిణ అని ప్రచారం చేస్తున్నాడు కదా… మరి రేవంత్ రెడ్డి స్వయంగా దానికి బ్రేక్ వేయించాడు కదా… అంటే, బీఆర్ఎస్ విమర్శలన్నీ ఉత్త ఊకదంపుడు, డొల్ల విమర్శలని తేటతెల్లం అయిపోయినట్టే కదా…
రాజకీయాల్లో ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో తెలిసి వ్యవహరించాలి… రేవంత్ రెడ్డి చేసింది అదే… ఇటు సొంత రాష్ట్రంలోని విమర్శలకు, అటు పొరుగు రాష్ట్రపు జలకుట్రలకు ఒకేసారి చెక్ పెట్టగలిగాడు… ప్రజలకు, రాష్ట్రానికి కావల్సింది ‘ఫలితం’… అంతేతప్ప గాయిగత్తర విమర్శలు కాదు…
అయితే బనకచర్ల మీద పోరాటం ముగిసిపోలేదు, చంద్రబాబు అంత తేలికగా వదిలేయడు… ట్రిబ్యునల్ అవార్డు, అంతర్రాష్ట్ర అంశాలు, CWC పరిశీలన, అవసరమైన అనుమతులు పూర్తయ్యే వరకు ప్రక్రియ ముందుకు సాగదు. అంటే పోరాటం ఇంకా ఉంది.
CWC ముందు తెలంగాణ వాదన ఎంత బలంగా నిలుస్తుంది?
భవిష్యత్ అనుమతుల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది?
అంతర్రాష్ట్ర అంశాలపై ఎలాంటి పరిష్కారం వస్తుంది?
న్యాయపరమైన ప్రక్రియ ఎటు వెళ్తుంది?
ఇవే అసలు ప్రశ్నలు. ప్రస్తుతానికి చెప్పగలిగేది ఒక్కటే.
బనకచర్ల ఫైల్ ముందుకు వెళ్లకుండా ఒక కీలక అడ్డంకి ఏర్పడింది. తెలంగాణ అభ్యంతరాలు అధికారిక ప్రక్రియలో ప్రాధాన్యం పొందాయి. ఇది చిన్న విషయం కాదు. రేవంత్‌కు వచ్చిన అసలు రాజకీయ లాభం ఇదే..!!
Share this Article