.
హైదరాబాద్ మెట్రో కథ ఓ భేతాళ ప్రశ్నగా మారింది. మెట్రో-1 స్వాధీనం, మెట్రో-2 విస్తరణపై కొత్త సందేహాలు అనేకం ముసురుకున్నాయి. పాలన- రాజకీయ కోణాల్లో రేవంత్ రెడ్డి అనుసరించిన వైఖరి సానుకూల ఫలితాన్ని ఇచ్చిందా? వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చిందా? ఏమో, ఎవరికీ ఏమీ అర్థం కాని గందరగోళం… సీఎం స్వయంగా చెప్పాల్సిందే ఇక…
కిషన్ రెడ్డిని పొలిటికల్‌గా కార్నర్ చేద్దామని రేవంత్ రెడ్డి ట్రై చేశాడు. మూసీ, మెట్రో తదితర ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించాడు. ఒకరకంగా కేంద్రంపై ఒత్తిడి, మరోవైపు పొలిటికల్‌గా దాడి… ద్విముఖ వ్యూహం… కమాన్, నువ్వు భేటీలు ఏర్పాటు చేయించు, కలిసి వెళ్దాం అన్నాడు.
Ads
1) రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ అడగ్గానే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు కదా, మధ్యలో కిషన్ రెడ్డి మెహర్బానీ దేనికి? 2) తను సింపుల్‌గా అశ్విని వైష్ణవ్, ఖట్టర్‌ల దగ్గరకు సీఎంను తీసుకుపోయాడు. దీంతో కిషన్ రెడ్డి ‘రాష్ట్రం అడిగినట్టుగా నేను సహకరిస్తున్నాను, ఇదే నిదర్శనం’ అని చెప్పుకున్నట్టయింది. మరి ఈ ఎపిసోడ్‌లో రేవంత్ రెడ్డికి పొలిటికల్‌గా కూడా వచ్చిన మైలేజీ, ఫాయిదా ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న.
మెట్రో స్వాధీనం, మెట్రో విస్తరణపై అధ్యయనానికి ఎస్బీఐ క్యాప్స్‌ను కొత్త కన్సల్టెంటుగా పెట్టాలని నిర్ణయం. 1) అంటే మెట్రో స్వాధీనం, విస్తరణ కథ మొదటికి వచ్చినట్టేనా? 2) రాయదుర్గం భూమి విక్రయంపై ఎస్బీఐ ధోరణిపై తీవ్ర ఆగ్రహంతో ఉండి, ఎస్బీఐతో అన్నిరకాల ఆర్థిక వ్యవహారాలు కటీఫ్ అంటూ మళ్లీ అదే ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనానికి ఎందుకు అంగీకరించినట్టు?
జైకా నుంచి ఐఆర్ఎఫ్‌సీ ద్వారా 13,600 కోట్ల రుణం రావాలి, కేంద్రం దగ్గర కొర్రీ పడింది. సరే, ఈక్విటీగా చెల్లించిన 1400 కోట్లకు ఢోకా ఏమీ లేదు, కానీ రుణం కోసం మధ్యవర్తిత్వం వహించిన సంస్థకు కట్టిన కోట్ల డబ్బు, ప్రాసెసింగ్ ఫీజులు వేస్టేనా? మళ్లీ కొత్త రుణం కోసం ట్రై చేయాల్సిందేనా?
మెట్రో-2 ఫేజులో కేంద్రం- రాష్ట్రం ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యం అన్నారు. అది మీకు నచ్చకపోతే మేమే సొంతంగా విస్తరించుకుంటాం, అనుమతించండి అని రేవంత్ రెడ్డి అడిగాడు కూడా. కేంద్రం సానుకూలంగా స్పందించిందని నిన్న ప్రభుత్వ ప్రకటన. కానీ దేనికి సానుకూలం? మెట్రో-1 మెట్రో-2 రెండింటిలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉండబోతోందా?
మళ్లీ కొత్త అధ్యయనం, కొత్త డీపీఆర్, కేంద్రం సూచనల మేరకు విస్తరణ మార్గాల్లో మార్పులు ఎలాగూ తప్పనిసరి. ఇదంతా పూర్తయ్యేలోపు మెట్రో-1 స్వాధీనం కూడా ఆగిపోయినట్టేనా? సో, మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆశించింది ఏమిటి? సాధించింది ఏమిటి? ఇదీ ఇప్పుడు ఎవరికీ జవాబు దొరకని పెద్ద ప్రశ్న.
- ఐతే సీఎం రేవంత్ రెడ్డి ఏదో మాస్టర్ ప్లాన్‌లో ఉన్నాడు. మెట్రో-1 స్వాధీనానికీ ప్లస్ మెట్రో-2 విస్తరణ దశకూ కలిపి రుణం కావాలి, అందులో కేంద్రాన్ని కూడా భాగస్వామిని చేసి, రుణసమీకరణ బాధ్యతనూ కేంద్రంపైనే పెట్టి, మెట్రోను తను ఆశించినట్టు సజావుగా పట్టాలెక్కించడమే బహుశా తన ప్లాన్. అది మంచిదే. ఈ దిశలో ఈ వ్యవహారం ఎక్కడ దారితప్పినా, కాలగలిసినా బీజేపీ వైపు వేలెత్తి చూపిస్తాడు, సో, కేంద్రం తప్పించుకోలేదు, ఫిక్సయింది!
కేంద్రం కూడా జైపూర్ మోడల్ ప్రతిపాదిస్తున్నట్టుంది. అదేమిటంటే? గతంలో జైపూర్ మెట్రో స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది, తరువాత విస్తరణకు సంకల్పించింది, కేంద్రం తన పాలసీ మేరకు ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో చేరింది. రెండు దశల్లోనూ ఇప్పుడు కేంద్రం- రాష్ట్రం సమాన భాగస్వామ్యం. ఇదే హైదరాబాద్ మెట్రోకూ వర్తింపజేస్తారని అంచనా. కానీ దీన్ని వివరంగా జనానికి చెప్పలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం!
కానీ ఈ మొత్తం వ్యవహారంలో గమనించాల్సిన అంశం ఒకటుంది. రేవంత్ రెడ్డి పొలిటికల్‌గా బీజేపీని కార్నర్ చేస్తూనే, పరిపాలన కోణంలో కలిసి నడుద్దాం, సహకరించండి అంటున్నాడు. సో, ఇక్కడ కాంగ్రెస్- బీజేపీ. అంతే. బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకోలేక నిమిత్తమాత్రం అయిపోయింది. పూర్తిగా సైడ్ లైన్.
ఆ పార్టీ చేసే 30 వేల కోట్ల ఆస్తుల దోపిడీ వంటి ఊకదంపుడు ఆరోపణల్ని జనం కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతానికి ఈ ప్రయోజనం మాత్రం నెరవేరినట్టు!! నిజంగానే మెట్రో ఆస్తుల్ని అమ్ముకునే అవకాశమే ఉంటే కేటీయార్ వదిలిపెట్టేవాడా?! ఐనా మెట్రోను ఎల్ అండ్ టీ చెర నుంచి విముక్తి చేసేది రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యవహారం కాదు, అది ప్రభుత్వ వ్యవహారం!! ఎప్పటిలాగే కేటీయార్ ఏదో బురద జల్లే పనిలో ఉన్నాడు!!
Share this Article