.
ఇండియాటుడే, సీ-వోటర్ రెగ్యులర్‌గా నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల మీద, ఆ సర్వే శాంపిళ్ల సంఖ్య- ప్రామాణికత- శాస్త్రీయత- ఆ క్రెడిబులిటీ శాతం మీద పెద్దగా ఎవరికీ భ్రమలేవీ లేవు… ఉండవు… ఆ సర్వే నిర్వహణ తీరు మీదే బోలెడు సందేహాలు, అభ్యంతరాలు… గత లోకసభ ఎన్నికలకు ముందు అది ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అంటూ అది చెప్పిన ఫలితాలకూ, ఎన్నికల్లో వచ్చిన వాస్తవ ఫలితాలకూ బోలెడు తేడా…
ఇప్పుడు మరో సర్వే… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 261 సీట్లు, కాంగ్రెస్‌కు 106 వస్తాయని చెబుతోంది… అంటే ఆరు నెలల క్రితం జరిగిన సర్వేతో పోలిస్తే బీజేపీ పట్ల ఆదరణ తగ్గుతోందని స్పష్టం… (నిజానికి బీజేపీపై జనంలో అసంతృప్తి ఇంకా ఎక్కువే ఉంది, కాకపోతే దాని బలం కాంగ్రెస్ విధానాలు, నాయకత్వలోపాలు మాత్రమే)
Ads
ఎన్డీయేకు 326, ఇండి కూటమికి 185 వస్తాయట… ఎన్నికల నాటికి రాజెవరో, రాకాసి ఎవరో…)

జెన్ జీ, కాక్రోచ్ ఆందోళనలు, అయోధ్య చందా చోరీ వంటివి బీజేపీ పట్ల ఆదరణను పలుచన చేశాయనేది నిజం… ఓసారి పైన టేబుల్ గమనించండి, ఎన్నికలకు ముందు బీజేపీకి 304 వస్తాయని అంచనా వేస్తే, కేవలం 240 సీట్లతో చతికిలపడి… నితిశ్, చంద్రబాబులను ఊతకర్రలుగా చేసుకుంది…
ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పెరుగుతోంది… నిజమే… అధికార పక్షం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రధాన ప్రతిపక్షానికే ఫాయిదా… అందుకే సీట్ల అంచనా సంఖ్య పెరిగింది… ఐతే ఓ ప్రధాన విషయం…
ఎలాగైనా డీలిమిటేషన్ చేసేసి, సీట్ల సంఖ్యను కనీసం 50 శాతం పెంచాలని బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది… కాంగ్రెస్ వద్దూవద్దంటోంది గానీ దానికి సరైన తార్కిక వివరణ లేదు దాని దగ్గర… వుమెన్ రిజర్వేషన్లు, డీలిమిటేషన్, జమిలి వంటివి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాయి, సో, ప్రజెంట్ ఇండియాటుడే సర్వేకు పెద్ద విలువ లేదు…

సరే, ఈ సర్వే ఫలితాలు నిజమే అనుకుందాం కాసేపు… కొన్ని ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్స్… యూపీలో యోగీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది… ఎవరు ప్రధాని అయితే బాగుంటుందనే ప్రశ్న,కు స్టిల్, మోదీ పట్ల 49 శాతం వోటర్లు సానుకూలంగా ఉన్నారు… అంటే ఈరోజుకూ మోడీ ఫ్యాక్టరే బీజేపీ బలం… సరే, రాహుల్ గాంధీకి 27 శాతం సానుకూలత మాటెలా ఉన్నా… తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని కావాలని 9 శాతం మంది కోరుకున్నారట…
తమిళ ప్రజలకు తప్ప విజయ్ గురించి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఏం తెలుసు..? మన అర్బన్ నక్సల్ తరహా మీడియా ఆహా ఓహో, భావి ఆశాకిరణం అని పదే పదే ప్రొజెక్ట్ చేస్తున్న సీజేపీ అభిజిత్‌కు ఒక శాతం… పాపం, కేజ్రీవాల్‌తో సమానంగా..!! (కేసీయార్, చంద్రబాబు గురించి అడగొద్దు, అసలు సర్వే ప్రశ్నల్లోనే వాళ్ల పేర్లున్నాయో లేదోనని డౌట్… అంత అప్రధాన ప్రధాని అభ్యర్థులైపోయారు)…

అన్నింటికన్నా విచిత్రంగా… ఇండి కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తే బెటర్ అనే ప్రశ్నకు 29 శాతం రాహుల్ గాంధీ బెటర్ అన్నారట… (అంటే, మోదీకి ఇప్పటికీ ప్రధాన బలం రాహుల్ గాంధీయే అన్నమాట)… తన తరువాత విజయ్ బెటర్ అని 12 శాతం జనం చెబుతున్నారట… అసలు విజయ్ ఇండి కూటమిలో లేనే లేడు…
అంతకుముందున్న స్టాలిన్ కాంగ్రెస్‌కు విడాకులు ఇచ్చేశాడు ఆమధ్య… ఇంకా జనం మమతా బెనర్జీ ఫైటర్ అని నమ్ముతున్నట్టున్నారు 9 శాతం ఆదరణతో… బెంగాల్‌లో కనిపిస్తే చాలు, దాడులు చేస్తూ తరుముతున్నారు జనం అనేది వాస్తవం… ఎన్నికల నాటికి ఇదే ఇండి కూటమి ఇంకా ఎంత ఇచ్చుకుపోతుందనేది ఎన్నికల ఫలితాల్ని, తద్వారా దేశ భవిష్యత్తును శాసిస్తుంది..!!
Share this Article